Australia vs Oman T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా బోణీ.. ఒమన్‌ను చిత్తు చేసిన మాజీ ఛాంపియన్
Australia vs Oman T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2024లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా బోణీ చేసింది. ఒమన్ తో గురువారం (జూన్ 6) జరిగిన మ్యాచ్ లో సులువుగా విజయం సాధించింది.
Australia vs Oman T20 World Cup: పసికూన ఒమన్ పై ఊహించిన స్థాయిలో కాకపోయినా మొత్తానికి గెలిచి టీ20 వరల్డ్ కప్ 2024లో బోణీ చేసింది ఆస్ట్రేలియా. మార్కస్ స్టాయినిస్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. దీంతో 39 పరుగుల తేడాతో ఒమన్ ను చిత్తు చేసింది. స్టాయినిస్ కేవలం 36 బంతుల్లోనే 67 రన్స్ చేయడం విశేషం. ఈ విజయంతో గ్రూప్ బిలో ఆస్ట్రేలియా టాప్ లోకి దూసుకెళ్లింది.
ఆస్ట్రేలియా బోణీ
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా గురువారం (జూన్ 6) ఆస్ట్రేలియా, ఒమన్ మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన కంగారూలు 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 రన్స్ చేసింది. స్టాయినిస్ కేవలం 36 బంతుల్లోనే 67 రన్స్ చేయడంతోపాటు తర్వాత బంతితోనూ రాణించాడు. 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడంతో ఒమన్ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 రన్స్ చేసింది.
ఒమన్ లాంటి పసికూనపై స్టార్ బ్యాటర్లు ఉన్న ఆస్ట్రేలియా చెలరేగిపోతుందని భావించినా.. పెద్దగా స్కోరు చేయలేకపోయింది. అంతేకాదు తర్వాత ప్రత్యర్థిని కనీసం ఆలౌట్ కూడా చేయలేదు. అయితే చివరికి తొలి విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. 2021లో తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా.. గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్, వరల్డ్ కప్ కూడా గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో టీ20 టైటిల్ పై కన్నేసింది.
వార్నర్, స్టాయినిస్ హాఫ్ సెంచరీలు
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోరు చేస్తుందని అందరూ భావించారు. అయితే ఆ టీమ్ లో ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్టాయినిస్ మాత్రమే హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగతా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (12), కెప్టెన్ మిచెల్ మార్ష్ (14), మ్యాక్స్‌వెల్ (0), టిమ్ డేవిడ్ (9) విఫలమయ్యారు. వార్నర్ 51 బంతుల్లో 56 రన్స్ చేశాడు. అయితే మిడిలార్డర్ లో వచ్చి స్టాయినిస్ సృష్టించిన విధ్వంసంతోనే ఆస్ట్రేలియా ఆ మాత్రం స్కోరైనా సాధించింది.
తర్వాత చేజింగ్ లో ఒమన్ ఏ దశలోనూ మెరుగ్గా కనిపించలేదు. స్టార్క్, ఎలిస్ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోతూ వెళ్లింది. 57 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే అయాన్ ఖాన్ (35), మెహ్రాన్ ఖాన్ (27) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఒమన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 రన్స్ చేసింది. స్టాయినిస్ మూడు వికెట్లు తీయగా.. స్టార్క్, ఎలిస్, జంపా తలా రెండు వికెట్లు తీసుకున్నారు.
ఈ విజయంతో గ్రూప్ బిలో ఆస్ట్రేలియా టాప్ లోకి దూసుకెళ్లింది. నమీబియా రెండో స్థానంలో ఉండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ మూడో స్థానంలో ఉంది. ఆ టీమ్ స్కాట్లాండ్ తో ఆడిన తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన విషయం తెలిసిందే. గ్రూప్ ఎలో ఇండియా, గ్రూప్ సిలో ఆఫ్ఘనిస్థాన్, గ్రూప్ డిలో సౌతాఫ్రికా తొలి స్థానాల్లో ఉన్నాయి.