Pat Cummins: లగేజీ పోగొట్టుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్.. టీ20 వరల్డ్ కప్ కోసం టీమ్ రెడీ
Pat Cummins: ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టీ20 వరల్డ్ కప్ కు వెళ్తూ తన లగేజీ పోగొట్టుకున్నాడు. మరోవైపు ఈ మెగా టోర్నీ కోసం ప్రస్తుతం ఆస్ట్రేలియా టీమ్ అంతా బార్బడోస్ చేరుకుంది.

Pat Cummins: టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడటానికి ఆస్ట్రేలియా నుంచి బార్బడోస్ వెళ్తున్న ఆ టీమ్ టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రయాణంలో తన లగేజీ పోగొట్టుకున్నాడట. అంతేకాదు అతని ప్రయాణానికి కూడా రెండు రోజుల పట్టడం గమనార్హం. ఐపీఎల్ 2024 ముగిసిన తర్వాత కొన్ని రోజుల పాటు ఆస్ట్రేలియా వెళ్లిన కమిన్స్, స్టార్క్, మ్యాక్స్‌వెల్.. ఇప్పుడు టీమ్ తో చేరారు.
కమిన్స్ లగేజీ మాయం
ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ తర్వాత ఈ టీమ్స్ లో ఆడిన ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు ఫ్యామిలీస్ తో గడిపిన తర్వాత టీ20 వరల్డ్ కప్ 2024 కోసం బార్బడోస్ వెళ్లారు. ఆస్ట్రేలియా గురువారం (జూన్ 6) తన తొలి మ్యాచ్ లో ఒమన్ తో తలపడనుంది.
ఈ మ్యాచ్ కు మూడు రోజుల ముందే వెస్టిండీస్ చేరుకున్నారు. అయితే ప్రయాణంలో కమిన్స్ తన లగేజీ కోల్పోవడం గమనార్హం. సిడ్నీ నుంచి కరీబియన్ మధ్య అతని ప్రయాణం కూడా రెండు రోజుల పాటు సాగింది. కానీ కమిన్స్ తాను కోల్పోయిన లగేజీని తర్వాత తిరిగి పొందినట్లు అతని భార్య బెక్కీ తెలిపింది. అటు స్టార్క్, మ్యాక్స్‌వెల్ కూడా ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి తిరిగి వెస్టిండీస్ చేరుకున్నారు.
స్టాయినిస్‌కూ అదే పరిస్థితి
గత వారం మరో ఆస్ట్రేలియా క్రికెటర్ మార్కస్ స్టాయినిస్ కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అతని క్రికెట్ కిట్ రాకపోవడంతో అతడు వామప్ మ్యాచ్ ఆడలేకపోవడం విశేషం. ఈ లగేజీ ఆలస్యం కారణంగా ఆ మ్యాచ్ కు ఆస్ట్రేలియా టీమ్ కేవలం 9 మంది ప్లేయర్స్ నే ఎంపిక చేసే పరిస్థితి ఏర్పడింది. రెగ్యులర్ ప్లేయర్స్ లేకపోవడం సపోర్ట్ స్టాఫ్ ను కూడా ఆ టీమ్ బరిలోకి దింపింది.
వీళ్లలో చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ, హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ మార్ష్, హేజిల్‌వుడ్ ఫీల్డ్ నుంచి బయటకు వెళ్లిపోయిన సమయంలో హెడ్ కోచ్ తోపాటు బ్యాటింగ్ కోచ్, 49 ఏళ్ల బ్రాడ్ హాడ్జ్ కూడా బరిలోకి దిగాల్సి వచ్చింది. ఐపీఎల్లో ఆడిన ప్లేయర్స్ తోపాటు మిగిలిన ఆస్ట్రేలియా ప్లేయర్స్ కూడా గత వారమే బార్బడోస్ చేరుకోగా.. తాజాగా ఈ ముగ్గురు ప్లేయర్స్ తో పూర్తి ఆస్ట్రేలియా టీమ్ ఇప్పుడు తొలి మ్యాచ్ కోసం సిద్ధంగా ఉంది.
కేవలం ఆస్ట్రేలియా ప్లేయర్స్ కే కాదు టీ20 వరల్డ్ కప్ లో ఆడుతున్న కొందరు ఇతర జట్ల ప్లేయర్స్ కు కూడా ఈ ఇబ్బందులు ఎదురయ్యాయి. శ్రీలంక కెప్టెన్ హసరంగా కూడా లాజిస్టిక్స్ ను చేరవేడయంలో ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక అంతకుముందు ఇండియన్ టీమ్ కూడా న్యూయార్క్ లో తగిన ట్రైనింగ్ వసతలు లేకపోవడంపై కూడా ప్రత్యేకంగా ప్రస్తావించింది.