IND vs PAK T20 World Cup 2024: భారత్, పాకిస్థాన్ సమరం: పిచ్‍పై టెన్షన్.. టెన్షన్.. మ్యాచ్ టైమ్, స్ట్రీమింగ్ వివరాలు ఇవే
IND vs PAK T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో హైవోల్టేజ్ ఫైట్ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‍కు సమయం సమీపించింది. అయితే, ఈ మ్యాచ్‍లో పిచ్ ఎలా ఉంటుందనే ఆసక్తి ఎక్కువగా ఉంది.
India vs Pakistan: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో అందరూ ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ సమరానికి సమయం ఆసన్నమైంది. చిరకాల ప్రత్యర్థులైన ఇరు జట్లు ఆదివారం (జూన్ 9) తలపడనున్నాయి. అమెరికా న్యూయార్క్‌లోని నసావూ స్టేడియం వేదికగా ప్రపంచకప్ గ్రూప్-ఏలో ఈ ఇండియా, పాక్ హైవోల్టేజ్ పోరు జరగనుంది. అయితే, న్యూయార్క్ పిచ్‍పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఆ పిచ్‍పై ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‍ల్లో బ్యాటర్లు నానా తంటాలు పడాల్సి వచ్చింది. దీంతో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా పిచ్‍పై టెన్షన్ నెలకొంది. ఆ వివరాలు ఇవే..
పిచ్‍పై టెన్షన్
ఈ ప్రపంచకప్‍లో న్యూయార్క్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‍లో దక్షిణాఫ్రికాపై శ్రీలంక 77 పరుగులకే ఆలౌటైంది. పిచ్ సమాంతరంగా లేకపోవటంతో బంతి బౌన్స్ రకరకాలుగా అయింది. బ్యాటర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. భారత్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో జరిగింది. బ్యాటర్లకు ఈ మ్యాచ్‍లోనూ పిచ్ చుక్కలు చూపింది. పిచ్ గతుకులుగా ఉన్నట్టు కనిపించింది. దీంతో బంతి పిచ్‍పై పడ్డాక కొన్నిసార్లు వింతగా బౌన్స్ అయింది. బ్యాటర్లు ఊహించలేని విధంగా కొన్ని బంతులు బౌన్స్ అయి ఆశ్చర్యపరిచాయి. ఈ క్రమంలో ఓ బంతి అనూహ్యంగా బౌన్స్ కాగా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు బ్యాటింగ్‍లో చేతికి గాయమైంది. దీంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. న్యూయార్క్ పిచ్ విషయంలో ఐసీసీపై విమర్శలు వచ్చాయి. దీంతో టోర్నీకి ఎంతో కీలకమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‍కు న్యూయార్క్ పిచ్ ఎలా ఉంటుందోననే టెన్షన్ ఉంది.
ఐసీసీ సరిచేసిందట
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సిన పిచ్‍కు ఐసీసీ దిద్దుబాట్లు చేసిందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. పిచ్‍పై గతుకులు ఎక్కువగా లేకుండా రోలింగ్ ఎక్కువగా చేయించిందని తెలుస్తోంది. పచ్చిక కూడా ఎక్కువగా లేకుండా చేస్తోంది. పిచ్ సమాంతరంగా ఉండేలా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పిచ్ ఫ్లాట్‍గా ఉండి బ్యాటింగ్‍కు కూడా మెరుగవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఔట్ ఫీల్డ్ మాత్రం స్లోగానే ఉండే అవకాశం ఉంది.
ఈ టీ20 ప్రపంచకప్ 2024 తొలి మ్యాచ్‍లో ఐర్లాండ్‍పై భారీ విజయం సాధించి భారత్ సూపర్ ఫామ్‍తో ఉంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఆత్మవిశ్వాసంతో ఉంది రోహిత్ శర్మ సేన. మరోవైపు, గత మ్యాచ్‍లో అమెరికా చేతిలో పాకిస్థాన్‍కు ఘోర పరాభవం ఎదురైంది. అమెరికాపై ఓటమి బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాక్‍ను కుంగదీసింది. మరి అత్యంత బలంగా ఉన్న భారత్‍తో పాక్ ఎలా ఆడుతుందో చూడాలి.
మ్యాచ్ ఎప్పుడు..
టీ20 ప్రపంచకప్ 2024లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఆదివారం (జూన్ 9) రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మొదవుతుంది. అరగంట ముందు 7.30 గంటలకు టాస్ పడుతుంది. న్యూయార్క్‌లోని నసావూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.
టెలికాస్ట్, స్ట్రీమింగ్ వివరాలు ఇవే
ప్రపంచకప్‍లో ఇండియా, పాక్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.