IND vs IRE: టీ20 ప్రపంచకప్‍లో టీమిండియా అదిరే ఆరంభం.. ఐర్లాండ్‍పై అలవోక గెలుపు.. అదరగొట్టిన రోహిత్ శర్మ-ind vs ire india beats ireland and gets excellent start to t20 world cup 2024 rohit sharma half century on tough pitch ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ire: టీ20 ప్రపంచకప్‍లో టీమిండియా అదిరే ఆరంభం.. ఐర్లాండ్‍పై అలవోక గెలుపు.. అదరగొట్టిన రోహిత్ శర్మ

IND vs IRE: టీ20 ప్రపంచకప్‍లో టీమిండియా అదిరే ఆరంభం.. ఐర్లాండ్‍పై అలవోక గెలుపు.. అదరగొట్టిన రోహిత్ శర్మ

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 05, 2024 11:13 PM IST

IND vs IRE T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍ను గెలుపుతో ఆరంభించింది టీమిండియా. ఐర్లాండ్‍తో నేడు జరిగిన మ్యాచ్‍లో భారత్ అలవోకగా గెలిచింది. అన్ని విభాగాల్లో సత్తాచాటి విజయం దక్కించుకుంది.

IND vs IRE: టీ20 ప్రపంచకప్‍లో టీమిండియా అదిరే ఆరంభం.. ఐర్లాండ్‍పై అలవోక గెలుపు.. అదరగొట్టిన రోహిత్ శర్మ
IND vs IRE: టీ20 ప్రపంచకప్‍లో టీమిండియా అదిరే ఆరంభం.. ఐర్లాండ్‍పై అలవోక గెలుపు.. అదరగొట్టిన రోహిత్ శర్మ (PTI)

India vs Ireland T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో భారత జట్టు అదిరే ఆరంభం దక్కించుకుంది. ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్‍లో ఐర్లాండ్‍ను చిత్తుచిత్తుగా ఓడించి టీమిండియా సత్తాచాటింది. టోర్నీని అద్భుత విజయంతో మొదలుపెట్టింది. అమెరికాలోని న్యూయార్క్‌ వేదికగా నేడు (జూన్ 5) జరిగిన టీ20 ప్రపంచకప్ గ్రూప్-ఏ పోరులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 46 బంతులు మిగిలి ఉండగానే స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి అదరగొట్టింది.

రోహిత్ ధనాధన్.. పంత్ సూపర్

స్వల్ప టార్గెట్‍ను టీమిండియా అలవోకగా ఛేదించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (37 బంతుల్లో 52 పరుగులు రిటైర్డ్ హర్ట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకంతో అదరగొట్టాడు. బ్యాటింగ్‍కు కఠినంగా ఉన్న పిచ్‍పై రోహిత్ అద్భుతంగా ఆడాడు. మొత్తంగా 12.2 ఓవర్లలోనే 2 వికెట్లకు 97 పరుగులు చేసి భారత్ విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (1) మూడో ఓవర్లో పెవిలియన్ చేరాడు. భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి ఐర్లాండ్ పేసర్ అడైర్ బౌలింగ్ విరాట్ ఔటయ్యాడు. ఆ తర్వాత కూడా రోహిత్ శర్మ దూకుడు కొనసాగించాడు. క్రమంగా పరుగులు రాబట్టాడు. ఓ క్యాచ్ మిస్ కాగా.. ఆ అవకాశాన్ని హిట్‍మ్యాన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.

వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (26 బంతుల్లో 36 పరుగులు; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో స్థానంలోనే బ్యాటింగ్‍కు వచ్చాడు. మరోవైపు రోహిత్ శర్మ జోరు కొనసాగించాడు. దీంతో ఎనిమిదో ఓవర్లో 50 పరుగుల మార్క్ దాటింది భారత్. హిట్‍మ్యాన్ ఆ తర్వాత కూడా దుమ్మురేపాడు. 36 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు. అయితే, చేతికి బంతి బలంగా తగలడంతో రిటైర్డ్ హర్ట్‌గా రోహిత్ వెనుదిరిగాడు.

సూర్యకుమార్ యాదవ్ (2) త్వరగా ఔటయ్యాడు. అయితే, రిషబ్ పంత్ మాత్రం దూకుడు తగ్గించలేదు. జోరుగా ఆడాడు. అద్భుత రివర్స్ స్కూప్ సిక్స్‌తో మ్యాచ్ విన్నింగ్ షాట్ కొట్టాడు పంత్. దీంతో 12.2 ఓవర్లలోనే 46 బంతులు మిగిల్చి అలవోకగా గెలిచింది భారత్.

ఐర్లాండ్ ఢమాల్

అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టుకు విలవిల్లాడింది. 16 ఓవర్లలో 96 పరుగులకే ఐర్లాండ్ ఆలౌటైంది. గారెత్ డెలానే (14 బంతుల్లో 26 పరుగులు), జోష్ లిటిల్ (14) కాస్త రాణించగా.. మిలిగిన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఐర్లాండ్‍ను కుప్పకూల్చారు.

భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు దక్కించుకున్నాడు. జస్‍ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. బుమ్రా 3 ఓవర్లలో కేవలం ఆరు పరుగులే ఇచ్చి రాణించాడు. మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

పాకిస్థాన్‍తో టీమిండియా సమరం

టీ20 ప్రపంచకప్‍ 2024లో తదుపరి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‍తో భారత్ తలపడనుంది. అందరూ ఎదురుచూస్తున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జూన్ 9వ తేదీన జరగనుంది. భారత్, పాక్ మ్యాచ్ కూడా న్యూయార్క్ వేదికగానే జరగనుంది. ఈ పిచ్ బౌలింగ్‍కు చాలా అనుకూలంగా ఉండటంతో ఆ పోరు ఎలా ఉంటుందోననే ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది.

Whats_app_banner