IND vs IRE: తొలి పోరులో టాస్ గెలిచిన టీమిండియా.. జైస్వాల్‍కు దక్కని చోటు.. తుది జట్లు ఇలా..
IND vs IRE T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 పోరును భారత్ మొదలుపెట్టింది. ఐర్లాండ్‍తో మ్యాచ్‍లో టాస్ గెలిచాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.
IND vs IRE: టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో వేటను ప్రారంభించింది టీమిండియా. టైటిల్ సాధించడమే లక్ష్యంగా వరల్డ్ టోర్నీలో పోరు షురూ చేసింది. ఈ ప్రపంచకప్‍లో తన తొలి మ్యాచ్‍లో ఐర్లాండ్‍తో నేడు (జూన్ 5) తలపడుతోంది భారత్. అమెరికాలోని న్యూయర్క్ నసావూ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్‍కు దిగనుంది.
జైస్వాల్, సంజూకు నో ప్లేస్
టీమిండియా తుదిజట్టులో యశస్వి జైస్వాల్‍కు చోటు దక్కలేదు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్‍కు దిగనున్నారు. సంజూ శాంసన్ కూడా ప్లేస్ లేదు. రెగ్యులర్ స్పిన్నర్లయినా కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ ఇద్దరూ తుది జట్టులో లేరు.
పిచ్ పరిస్థితులు అంత అంచనా వేసే విధంగా లేవని, అందుకే లక్ష్యఛేదనే మేలని అనుకున్నట్టు టాస్ సమయంలో రోహిత్ శర్మ చెప్పాడు. “మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. బాగా సిద్ధమయ్యాం. ఈ కొత్త పరిస్థితులకు మేం అలవాటు పడుతున్నాం” అని అన్నాడు.
నలుగురు ఆల్‍రౌండర్లు
వికెట్ కీపర్ రిషబ్ పంత్ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలోనే రానున్నాడు. వామప్ మ్యాచ్‍లో అదే స్థానంలో వచ్చి అర్ధ శకతంతో అతడు అదరగొట్టాడు. ఈ మ్యాచ్ కోసం ఏకంగా నలుగురు ఆల్ రౌండర్లను తుదిజట్టులోకి తీసుకుంది టీమిండియా. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబే ఆల్ రౌండర్లుగా ఉన్నారు. ఆప్షన్లు చాలా ఉండటంతో దూబేకు బౌలింగ్ చేసే అవకాశం రాకపోవచ్చు. పేసర్లుగా బుమ్రా, అర్షదీప్, సిరాజ్ ఉన్నారు.
ఈ మ్యాచ్ జరుగుతున్న న్యూయార్క్ పిచ్ బౌలింగ్‍కు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పేసర్లకు ఎక్కువ మద్దతు లభిస్తుంది. అందుకే ముగ్గురు ఫాస్ట్ బౌలర్లకు తుదిజట్టులో చోటు ఇచ్చింది భారత్. జడేజా, అక్షర్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు.
భారత తుదిజట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‍ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్
ఐర్లాండ్ తుదిజట్టు: పౌల్ స్టిర్లింగ్(కెప్టెన్), ఆండ్రూ బాల్‍బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫెర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బ్యారీ మెక్‌కార్తి, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్
టైటిల్‍తో యువరాజ్
టీమిండియా మాజీ దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.. ఈ టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీకి బ్రాండ్ అంబాసిడార్‌గా ఉన్నాడు. దీంతో భారత్ బరిలోకి దిగిన ఈ మ్యాచ్ ప్రారంభానికి టైటిల్‍ను మైదానంలోకి తీసుకొచ్చాడు యువీ. ఇక, న్యూయార్క్ స్డేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‍కు ప్రేక్షకులు భారీగా హాజరయ్యారు. భారత్‍కు మద్దతు ఎక్కువగా ఉంది.
టీ20 ప్రపంచకప్ జూన్ 2న మొదలుకాగా.. జూన్ 29 వరకు జరగనుంది. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ఈ టోర్నీ సాగుతోంది. అమెరికాలో ప్రపంచకప్ జరగడం ఇదే తొలిసారి.