T20 World Cup 2024: నేటి నుంచే టీ20 ప్రపంచకప్ సంగ్రామం.. జట్లు, ఫార్మాట్, వేదికలు సహా మరిన్ని వివరాలు ఇవే
ICC T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ సమరానికి నేడే (జూన్ 2) తెరలేవనుంది. ఈ క్రికెట్ సంగ్రామం తొలి మ్యాచ్‍లో అమెరికా, కెనడా తలపడనున్నాయి. ఈ టోర్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

T20 World Cup 2024: క్రికెట్ అభిమానులందరూ ఎదురుచూస్తున్న మహా సంగ్రామం టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీకి వేళయింది. ఈ మెగాటోర్నీ నేడు (భారత్‍లో జూన్ 2) షురూ కానుంది. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ఈ క్రికెట్ సమరం సాగనుంది. జూన్ 29వ తేదీన వరకు ప్రపంచకప్ జరగనుంది. నేడు (జూన్ 2) అమెరికా, కెనడా మధ్య డల్లాస్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‍తో టీ20 ప్రపంచ సమరం షురూ కానుంది. ఈ టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. ఈ టీ20 ప్రపంచకప్ 2024 వివరాలు ఇక్కడ చూడండి.
20 జట్లు.. 4 గ్రూప్‍లు
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో 20 జట్లు పాల్గొననున్నాయి. వరల్డ్ కప్‍లో 20 జట్లు ఆడడం ఇదే తొలిసారి. ఈ 20 టీమ్‍లు నాలుగు గ్రూప్‍ల్లో ఉన్నాయి. ఒక్కో గ్రూప్‍లో ఐదు జట్లు ఉన్నాయి.
గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా ఉండగా.. గ్రూప్ బీలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ ఉన్నాయి. గ్రూప్ సీలో న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, ఉగాండా, పపువా న్యూగినియా, గ్రూప్ డీలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ ఉన్నాయి.
ఫార్మాట్ ఇదే
గ్రూప్ దశలో ప్రతీ జట్టు నాలుగు మ్యాచ్‍లు ఆడుతుంది. గ్రూప్ దశ ముగిసే సరికి ప్రతీ గ్రూప్‍లో టాప్‍లో నిలిచే రెండు జట్లు సూవర్-8కు చేరుకుంటాయి. టాప్-8లో విజయం సాధించే నాలుగు జట్లు సెమీఫైనల్స్ చేరతాయి. సెమీస్‍లో గెలిచిన రెండు జట్లు ఫైనల్‍లో తలపడతాయి.
55 మ్యాచ్‍లు.. వేదికలు ఇలా..
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో మొత్తంగా 29 రోజుల పాటు 55 మ్యాచ్‍లు జరగనున్నాయి. వెస్టిండీస్‍లో 39 మ్యాచ్‍లు, అమెరికాలో 16 మ్యాచ్‍లు జరుగుతాయి. గ్రూప్ దశ మ్యాచ్‍లు వెస్టిండీస్, అమెరికాలో సంయుక్తంగా జరుగుతాయి. సూపర్-8 నుంచి అన్ని మ్యాచ్‍లకు వెస్టిండీస్ ఆతిథ్యమిస్తుంది.
వెస్టిండీస్‍లోని అంటిగ్వా & బార్బొడా, బార్బొడాస్, గ్రెనడా, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ & ది గ్రెనడైన్స్, ట్రినిడాడ్ టుబాగోల్లోని స్టేడియాల్లో 39 మ్యాచ్‍లు జరుగుతాయి. అమెరికాలోని న్యూయార్క్, టెక్సాస్, ఫ్లోరియాలోని స్టేడియాల్లో గ్రూప్ దశలో 16 మ్యాచ్‍లు సాగుతాయి. జూన్ 29న ఫైనల్ విండీస్‍లోని బార్బడోస్‍లో జరుగుతుంది.
లైవ్ స్ట్రీమింగ్
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ మ్యాచ్‍లను ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో చూడొచ్చు. డిజిటల్ విషయానికి వస్తే డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు.
గ్రూప్ దశలో భారత్ మ్యాచ్‍లు
జూన్ 5వ తేదీన ఐర్లాండ్‍తో న్యూయర్క్ వేదికగా జరిగే మ్యాచ్‍తో టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా తన వేటను మొదలుపెట్టనుంది. జూన్ 9న (న్యూయార్క్) పాకిస్థాన్‍తో మెగాఫైట్‍లో టీమిండియా తలపడనుంది. జూన్ 12న అమెరికాతో (న్యూయార్క్), జూన్ 15న కెనడాతో (ఫ్లోరిడా) భారత్ తలపడనుంది. గ్రూప్-ఏలో టాప్-2లో నిలిస్తే సూపర్-8 దశకు రోహిత్ శర్మ సేన చేరుతుంది. గ్రూప్ దశలో టీమిండియా ఆడే మ్యాచ్‍లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలవుతాయి.
టీ20 ప్రపంచకప్‍లో తొలి రోజు నేటి మ్యాచ్‍లు
అమెరికా vs కెనడా - డల్లాస్‍లో - నేటి (జూన్ 2) ఉదయం 6 గంటల నుంచి.. (భారత కాలమానం ప్రకారం)
వెస్టిండీస్ vs పపువా న్యూగినియా - గయానాలో - రాత్రి 8 గంటల నుంచి..