IND vs IRE: ఐర్లాండ్‍ను కప్పకూల్చేసిన భారత బౌలర్లు.. బ్యాటింగ్‍కు కఠినంగా పిచ్-ind vs ire t20 world cup 2024 team indian rattles ireland and new york pitch very tough for batting ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ire: ఐర్లాండ్‍ను కప్పకూల్చేసిన భారత బౌలర్లు.. బ్యాటింగ్‍కు కఠినంగా పిచ్

IND vs IRE: ఐర్లాండ్‍ను కప్పకూల్చేసిన భారత బౌలర్లు.. బ్యాటింగ్‍కు కఠినంగా పిచ్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 05, 2024 09:42 PM IST

IND vs IRE T20 World Cup 2024: ఐర్లాండ్‍తో మ్యాచ్‍లో భారత బౌలర్లు విజృంభించారు. అదిరిపోయే బౌలింగ్‍తో ఆ జట్టును తక్కువ స్కోరుకే కుప్పకూల్చేశారు.

IND vs IRE: ఐర్లాండ్‍ను కప్పకూల్చేసిన భారత బౌలర్లు.. బ్యాటింగ్‍కు కఠినంగా పిచ్
IND vs IRE: ఐర్లాండ్‍ను కప్పకూల్చేసిన భారత బౌలర్లు.. బ్యాటింగ్‍కు కఠినంగా పిచ్

T20 World Cup IND vs IRE: టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో తన తొలి మ్యాచ్‍లో బౌలింగ్‍లో అదరగొట్టింది భారత్. ఐర్లాండ్ జట్టును టీమిండియా బౌలర్లు గడగడలాడించి కుప్పకూల్చేశారు. న్యూయార్క్‌లోని నసావూ స్టేడియంలో నేడు (జూన్ 5) జరుగుతున్న టీ20 ప్రపంచకప్ గ్రూప్-ఏ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో కేవలం 96 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు సమిష్టిగా సత్తాచాటి ఐరిష్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. టీమిండియా ముందు 97 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది.

చెలరేగిన భారత బౌలర్లు

ఐర్లాండ్‍తో ఈ మ్యాచ్‍లో టీమిండియా బౌలర్లు ఆది నుంచే దుమ్మురేపారు. బౌలింగ్‍కు సహకరిస్తున్న పిచ్‍ను పూర్తిగా వినియోగించుకుంటూ అదరగొట్టారు. వరుసగా వికెట్లు తీశారు. మూడో ఓవర్లో ఐర్లాండ్ కెప్టెన్ పౌల్ స్టిర్లింగ్ (2)ను భారత పేసర్ అర్షదీప్ సింగ్ ఔట్ చేశాడు. అదే ఓవర్లో ఆండీ బాల్‍బిర్నీ (5)ను కూడా పెవిలియన్‍కు పంపాడు. ఏడో ఓవర్లో లోకాన్ టకర్ (10)ను అద్భుతమైన ఇన్‍స్వింగర్‌తో బౌల్డ్ చేశాడు భారత పేసర్ హార్దిక్ పాండ్యా. హ్యారీ టెక్టర్ (4)ను బుమ్రా ఔట్ చేశాడు. పరుగులు చేసేందుకు ఐర్లాండ్ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. కొన్ని చెత్త షాట్లతో నిరాశపరిచారు.

కాస్త దీటుగా ఆడేందుకు ప్రయత్నించిన కర్టిస్ కాంపెర్ (12)ను పాండ్యా వెనక్కి పంపాడు. జార్జ్ డాక్రెల్ (3)ను సిరాజ్ ఔట్ చేయగా.. మార్క్ అడైర్ (3)కు పాండ్యా షాకిచ్చాడు. బారీ మెక్‍కార్తీ (0)ని అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. దీంతో 11.2 ఓవర్లలో 50 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఐర్లాండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

మెరిసిన డెలానీ

అయితే, చివర్లో గెరాత్ డెలానీ (14 బంతుల్లో 26 పరుగులు) వేగంగా ఆడాడు. 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదాడు. జాషువా లిటిల్ (13 బంతుల్లో 14 పరుగులు) కాస్త పోరాడాడు. దీంతో ఐర్లాండ్ స్కోరు బోర్డు కాస్త ముందుకు కదిలింది. లిటిల్ ఔటైనా డెలానీ దూకుడుగా ఆడాడు. అయితే, చివర్లో రనౌట్ అయ్యాడు. దీంతో ఐర్లాండ్ ఆలౌటైంది.

పాండ్యా, బుమ్రా అదుర్స్

భారత ఆల్ రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‍లో అదరగొట్టాడు. మూడు వికెట్లతో రాణించాడు. జస్‍ప్రీత్ బుమ్రా మూడు ఓవర్లో ఆరు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు దక్కించుకున్నా.. 35 పరుగులు సమర్పించాడు. మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.

బ్యాటింగ్‍కు కఠినంగా పిచ్

ఈ మ్యాచ్ జరుగుతున్న న్యూయార్క్ పిచ్ బ్యాటింగ్‍కు అత్యంత కఠినంగా ఉంది. బంతులు రకరకాలుగా బౌన్స్ అవుతోంది. పేసర్లకు ఎక్కువగా ఈ పిచ్ అనుకూలిస్తోంది. బంతి ఎక్కువగా స్వింగ్ అవుతోంది. ఔట్ ఫీల్డ్ కూడా చాలా స్లోగా ఉంది. మొత్తంగా ఈ పిచ్‍ బ్యాటర్లకు చాలా కష్టంగా ఉంది. భారత బౌలర్లు ఈ పిచ్‍పై కట్టుదిట్టంగా బౌలింగ్ చేయటంతో ఐర్లాండ్ తక్కువ స్కోరుకే ఢమాల్ అయింది.

Whats_app_banner