India vs Pakistan: పాకిస్థాన్‌తోనూ ఓపెనర్‌గా కోహ్లినే.. టోర్నీ మొత్తం మూడో స్థానంలో ఆ బ్యాటరే-india vs pakistan t20 world cup 2024 virat kohli to open rishabh pant at number 3 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Pakistan: పాకిస్థాన్‌తోనూ ఓపెనర్‌గా కోహ్లినే.. టోర్నీ మొత్తం మూడో స్థానంలో ఆ బ్యాటరే

India vs Pakistan: పాకిస్థాన్‌తోనూ ఓపెనర్‌గా కోహ్లినే.. టోర్నీ మొత్తం మూడో స్థానంలో ఆ బ్యాటరే

Hari Prasad S HT Telugu
Jun 07, 2024 06:00 PM IST

India vs Pakistan: టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా పాకిస్థాన్ తో జరగనున్న మ్యాచ్ లోనూ ఓపెనర్ గా విరాట్ కోహ్లినే రానున్నాడు. మూడో స్థానంలో పంత్ వస్తాడని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పష్టం చేశాడు.

పాకిస్థాన్‌తోనూ ఓపెనర్‌గా కోహ్లినే.. టోర్నీ మొత్తం మూడో స్థానంలో ఆ బ్యాటరే
పాకిస్థాన్‌తోనూ ఓపెనర్‌గా కోహ్లినే.. టోర్నీ మొత్తం మూడో స్థానంలో ఆ బ్యాటరే (Getty Images via AFP)

India vs Pakistan: ఇండియా, పాకిస్థాన్ మెగా ఫైట్ కు టైమ్ దగ్గర పడుతోంది. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఆదివారం (జూన్ 9) ఈ దాయాదుల మధ్య పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు కూడా విరాట్ కోహ్లియే ఓపెనర్ గా రానున్నట్లు స్పష్టమైపోయింది. ఐర్లాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో అతడు ఈ స్థానంలో విఫలమైనా.. విరాట్ నే కొనసాగించాలని టీమ్ నిర్ణయించింది.

ఓపెనర్‌గా కోహ్లి.. మూడో స్థానంలో పంత్

ఐపీఎల్ 2024లో ఓపెనర్ గా వచ్చిన అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచిన విరాట్ కోహ్లిని టీ20 వరల్డ్ కప్ లోనూ ఓపెనింగ్ చేయిస్తారని ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నదే. అందుకు తగినట్లే ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ లో అతన్నే రోహిత్ తో కలిసి ఓపెనర్ గా దించారు. అయితే కోహ్లి మాత్రం ఈ మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యాడు.

ఇప్పుడు పాకిస్థాన్ తో కీలకమైన మ్యాచ్ లో కోహ్లిని తిరిగి మూడో స్థానంలో పంపిస్తారా అన్న సందేహాల మధ్య అలాంటిదేమీ లేదని టీమ్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. ఈ మ్యాచ్ లోనూ రోహిత్, కోహ్లియే ఓపెనర్లుగా వస్తారని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వెల్లడించాడు. అంతేకాదు ఈ మ్యాచ్ కు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.

మూడో స్థానంలో రిషబ్ పంత్

ఇక తొలి మ్యాచ్ లో కోహ్లి ఓపెనింగ్ చేయగా అతని రెగ్యులర్ స్థానమైన నంబర్ 3లో లెఫ్ట్ హ్యాండర్ అయిన రిషబ్ పంత్ వచ్చాడు. ఈ టోర్నమెంట్ మొత్తం మూడో స్థానంలో పంతే వస్తాడని కూడా ఈ సందర్భంగా రాథోడ్ తేల్చి చెప్పాడు. బంగ్లాదేశ్ తో జరిగిన వామప్ మ్యాచ్, ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ లలో పంత్ ఈ స్థానంలో వచ్చి సక్సెస్ అయ్యాడు.

"అవును, అతడు చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడు ఆడిన రెండు మ్యాచ్ లలోనూ చాలా బాగా ఆడాడు. అందుకే ప్రస్తుతానికి మా నంబర్ 3 బ్యాటర్ అతడే. పంత్ లెఫ్ట్ హ్యాండర్ కావడం కూడా కలిసి వస్తుంది" అని రాథోడ్ స్పష్టం చేశాడు. ఇక ఐర్లాండ్ తో మ్యాచ్ లో రాణించిన హార్దిక్ పైనా రాథోడ్ ప్రశంసలు కురిపించాడు.

"హార్దిక్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. హార్దిక్ ప్రాక్టీస్ మ్యాచ్ తోపాటు ప్రాక్టీస్ లోనూ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. నాలుగు ఓవర్లు వేసేంత ఫిట్‌గా కనిపిస్తున్నాడు. కచ్చితత్వంతోపాటు వేగంగానూ బౌలింగ్ చేస్తున్నాడు. ఇది మాకు కలిసి వచ్చేదే" అని రాథోడ్ చెప్పాడు.

యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచ్ లో ఓడిన పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇండియన్ టీమ్ తో కీలకమైన మ్యాచ్ ఆడనుంది. ఇందులోనూ ఓడితే ఆ టీమ్ సూపర్ 8 అవకాశాలు సంక్లిష్టమవుతాయి. మరోవైపు ఇందులో గెలిస్తే మాత్రం ఇండియన్ టీమ్ సూపర్ 8లోకి వెళ్లడం దాదాపు ఖాయమవుతుంది.

Whats_app_banner