IND vs BAN: కమ్‍బ్యాక్ మ్యాచ్‍లో రిషబ్ పంత్ ధనాధన్.. అదరగొట్టిన హార్దిక్.. బంగ్లాకు మోస్తరు టార్గెట్ ఇచ్చిన భారత్
IND vs BAN T20 World Cup 2024 Warm-Up: బంగ్లాదేశ్‍తో టీ20 ప్రపంచకప్ వామప్ మ్యాచ్‍లో భారత్ బ్యాటింగ్‍లో మంచి స్కోరే చేసింది. హిట్టర్ రిషబ్ పంత్.. టీమిండియాలో తన కమ్‍బ్యాక్ మ్యాచ్‍లోనే అర్ధ శకతంతో సత్తాచాటాడు. చివర్లో హార్దిక్ పాండ్యా మెరిపించాడు.

IND vs BAN T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో అసలు పోరు కంటే ముందు సన్నాహకం కోసం వామప్ మ్యాచ్‍కు బరిలోకి దిగింది టీమిండియా. బంగ్లాదేశ్‍తో నేడు (జూన్ 1) భారత్ వామప్ పోరులో తలపడుతోంది. న్యూయార్క్ వేదికగా ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తర్వాత ఈ మ్యాచ్‍తోనే 16 నెలల తర్వాత టీమిండియాలోకి కమ్‍బ్యాక్ ఇచ్చాడు రిషబ్ పంత్. పూర్తిగా కోలుకొని ఈ ఏడాది ఐపీఎల్‍తో మైదానంలోకి దిగిన పంత్.. మళ్లీ భారత జట్టులోకి ఈ మ్యాచ్‍తోనే ఎంట్రీ ఇచ్చాడు. ఈ కమ్‍బ్యాక్ మ్యాచ్‍లోనే రిషబ్ (32 బంతుల్లో 53 పరుగులు: 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకంతో చెలరేగాడు.
అదరగొట్టిన పంత్
ఈ వామప్ మ్యాచ్‍లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు. జట్టుతో తాజాగా కలిసిన స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‍కు మేనేజ్‍మెంట్ విశ్రాంతినిచ్చింది. దీంతో ఈ మ్యాచ్‍లో రోహిత్ శర్మ(19 బంతుల్లో 23 పరుగులు)తో సంజూ శాంసన్ ఓపెనింగ్ చేశాడు. అయితే, శాంసన్ (1) రెండో ఓవర్లోనే ఔటై నిరాశపరిచాడు. ఆ తర్వాత పంత్ షో షురూ అయింది.
రిషబ్ పంత్ ఆరంభం నుంచే దుమ్మురేపాడు. తన మార్క్ షాట్లతో విరుచుకుపడ్డాడు. బంగ్లాదేశ్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఓవైపు రోహిత్ నిలకడగా ఆడి పంత్‍కు సహకరించాడు. అయితే, ఏడో ఓవర్లో భారీ షాట్‍కు వెళ్లి రోహిత్ ఔటయ్యాడు. ఆ తర్వాత కూడా పంత్ ఏ మాత్రం జోరు తగ్గించలేదు. 32 బంతుల్లోనే పంత్ అర్ధ శకతం చేరాడు. భారత్ స్కోరు 11.1 ఓవర్లలోనే 100 దాటింది.
అయితే, అర్ధ శకతం తర్వాత రిటైర్డ్ ఔట్‍గా పంత్ పెవిలియన్ చేరాడు. వామప్ మ్యాచ్ కాబట్టి వేరే ఆటగాళ్లకు బ్యాటింగ్ అవకాశం ఇచ్చేందుకు అతడు వెనక్కి వెళ్లాడు. సూర్య కుమార్ యాదవ్ (18 బంతుల్లో 31 పరుగులు; 4 ఫోర్లు) ఉన్నంతసేపు మెరిపించాడు. శివమ్ దూబే (16 బంతుల్లో 14 పరుగులు) తడబడి ఔటయ్యాడు.
పాండ్యా మెరుపులు
ఈ ఏడాది ఐపీఎల్‍లో విఫలమైన హార్దిక్ పాండ్యా.. ఫామ్‍లోకి వచ్చేశాడు. ఈ మ్యాచ్‍లో 23 బంతుల్లో అజేయంగా 40 రన్స్ చేశాడు. 2 ఫోర్లు, 4 సిక్స్‌లు బాదాడు. చివర్లో మెరుపు మెరిపించాడు పాండ్యా. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్, షరీఫుల్ ఇస్లాం, మహమ్మదుల్లా తన్వీర్ ఇస్లాం చెరో వికెట్ తీశారు. బంగ్లాకు ముందు 183 పరుగుల టార్గెట్ ఉంచింది భారత్. అయితే, బ్యాటింగ్‍కు కష్టంగా ఉన్న ఈ పిచ్‍పై ఇది చాలా మంచి టార్గెట్.
పంత్ అదిరిపోయే కమ్‍బ్యాక్
2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి టీమిండియాకు దూరమయ్యాడు. ఎంతో కష్టపడి ఈ ఏడాదిలోనే పంత్ పూర్తిగా కోలుకున్నాడు. ఇటీవలే ఐపీఎల్ 2024 సీజన్‍లో అదరగొట్టాడు. మళ్లీ మనుపటి ఆటను చూపించాడు. ఇప్పుడు టీమిండియాలో సుమారు 16 నెలల తర్వాత పంత్ ఇప్పుడు కమ్‍బ్యాచ్ ఇచ్చాడు. ఈ వామప్ మ్యాచ్‍లో దుమ్మురేపే బ్యాటింగ్‍తో అదరగొట్టాడు రిషబ్ పంత్.
టీ20 ప్రపంచకప్ టోర్నీ రేపు (జూన్ 2) మొదలుకానుంది. జూన్ 5న ఐర్లాండ్‍తో మ్యాచ్‍తో ప్రపంచకప్‍లో తన పోరు షురూ చేయనుంది భారత్.