IPL 2024 in numbers: ఈ నంబర్స్ చూస్తే ఐపీఎల్ 2024లో కోహ్లి, కేకేఆర్, సన్ రైజర్స్ డామినేషన్ ఏంటో తెలిసిపోతుంది
IPL 2024 in numbers: ఐపీఎల్ 2024ను నంబర్లలో చూస్తే ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్, విరాట్ కోహ్లి ఏ స్థాయిలో డామినేట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్ ఎలా సాగిందో వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
IPL 2024 in numbers: ఐపీఎల్ 2024లో ఏ స్థాయి పరుగుల విధ్వంసం జరిగిందో మనకు తెలుసు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ లాంటి టీమ్స్ పరుగుల సునామీ సృష్టించాయి. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ భాగస్వామ్యం నుంచి విరాట్ కోహ్లి నిలకడైన ఆటతీరు వరకు ఈ సీజన్ మొత్తాన్ని నంబర్లలో ఒకసారి చూద్దాం.
నంబర్లలో ఐపీఎల్ 2024 ఇలా..
9.56: ఒక సీజన్లో అత్యధిక రన్ రేట్ ఇదే
ఐపీఎల్ 2024లో నమోదైన రన్ రేట్ 9.56. ఏ సీజన్ లో అయినా ఇదే అత్యధికం. గతేడాది 8.99తో ఉన్న రికార్డు బ్రేకయింది. ఇక ఈ ఏడాది 1260 సిక్స్ లు నమోదయ్యాయి. గతేడాది 1124 సిక్స్ ల రికార్డు బ్రేకయింది. ఈ ఏడాది టీమ్స్ 8 సార్లు 250కిపైగా స్కోర్లు చేశాయి. గత 16 సీజన్లు కలిపి కేవలం రెండేసార్లు ఈ రికార్డు నమోదైంది.
13.46: హెడ్, అభిషేక్ భాగస్వామ్యం రన్ రేట్
ఈ ఏడాది సన్ రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఏకంగా 13.46 రన్ రేట్ తో పరుగులు చేశారు. ఈ ఇద్దరూ కలిసి డీసీతో మ్యాచ్ లో పవర్ ప్లే ఆరు ఓవర్లలో 125 రన్స్ తో టీ20 వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు. అంతేకాదు లక్నోపై 165 రన్స్ లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఫినిష్ చేసేశారు. మొత్తంగా 15 ఇన్నింగ్స్ లో 691 రన్స్ జోడించారు. మూడు సెంచరీ, రెండు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి.
సునీల్ నరైన్ 488 రన్స్, 17 వికెట్స్
ఈ ఏడాది మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్ కేకేఆర్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్. అతడు 488 రన్స్ చేయడంతోపాటు 17 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో షేన్ వాట్సన్, జాక్ కలిస్ తర్వాత ఒకే సీజన్లో 400కుపైగా రన్స్, 15కుపైగా వికెట్లు తీసిన ప్లేయర్ నరైనే. ఫైనల్లో విఫలమైనా.. సీజన్ మొత్తం నిలకడగా రాణించాడు.
విరాట్ కోహ్లి 741 రన్స్
ఈ సీజన్ లో విరాట్ కోహ్లి 741 రన్స్ చేశాడు. అతడే ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. కోహ్లి 15 ఇన్నింగ్స్ లో 154.7 స్ట్రైక్ రేట్ తో ఈ రన్స్ చేశాడు. ఒక సీజన్లో 700కుపైగా రన్స్ రెండు సార్లు చేసిన రెండో ప్లేయర్ కోహ్లి. గతంలో క్రిస్ గేల్ ఈ ఘనత అందుకున్నాడు. విరాట్ ఆరెంజ్ క్యాప్ అందుకోవడం కూడా ఇది రెండోసారి. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ అతడే.
బుమ్రా 20 వికెట్లు
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ 10 ఓటములతో టేబుల్లో చిట్టచివరన ఉంది. కానీ ఆ టీమ్ బౌలర్ బుమ్రా మాత్రం 20 వికెట్లతో రాణించాడు. ఈ సీజన్ లో పర్పుల్ క్యాప్ చాలా వరకూ అతని దగ్గరే ఉంది. అయితే చివర్లో పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షల్ పటేల్ 24 వికెట్లతో ఆ క్యాప్ గెలుచుకున్నాడు.