Sunil Narine: సెంచరీతో రికార్డ్ సృష్టించిన సునీల్ నరైన్.. రోహిత్, వాట్సన్ తర్వాత అరుదైన ఫీట్ సాధించిన మూడో ప్లేయర్‌గా..
Sunil Narine - KKR vs RR: కోల్‍కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ సెంచరీతో కదం తొక్కాడు. రాజస్థాన్ బౌలర్లను చితకబాది.. శకతం చేశాడు. కొన్ని రికార్డులను సృష్టించాడు. ఓ అరుదైన ఫీట్ సాధించిన మూడో ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.
Sunil Narine: కోల్‍కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్, వెస్టిండీస్ స్టార్ సునీల్ నరైన్ దుమ్మురేపాడు. తన కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‍లో నేడు (ఏప్రిల్ 16) రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‍లో కేకేఆర్ ప్లేయర్ సునీల్ నరైన్ ధనాధన్ హిట్టింగ్‍తో చెలరేగాడు. ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో 56 బంతుల్లోనే 109 పరుగులతో అదరగొట్టాడు. 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో మోతెక్కించాడు. ఈ అద్భుత సెంచరీతో కొన్ని రికార్డులను సృష్టించాడు సునీన్ నరైన్.
ఐపీఎల్ చరిత్రలో ఐదు వికెట్ల ప్రదర్శన, సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా సునీల్ నరేన్ చరిత్ర సృష్టించాడు.
ఈ ఫీట్ సాధించి మూడో ప్లేయర్‌గా..
ఐపీఎల్‍లో హ్యాట్రిక్‍తో పాటు సెంచరీ కూడా సాధించిన మూడో ప్లేయర్‌గా సునీల్ నరేన్ రికార్డులకెక్కాడు. ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ, ఐపీఎల్ మాజీ స్టార్ షేన్ వాట్సాన్ తర్వాత ఈ అరుదైన ఫీట్ సాధించింది నరైనే.
ఐపీఎల్ 2009 సీజన్‍లో డెక్కన్ చార్జర్స్ తరఫున రోహిత్ శర్మ.. బౌలింగ్‍లో హ్యాట్రిక్ తీశాడు. ముంబైపై హ్యాట్రిక్ తీశాడు. ఆ తర్వాత ఐపీఎల్‍లో 2012లో ముంబై ఇండియన్స్ తరఫున తన తొలి సెంచరీ చేశాడు. 2011 నుంచి ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఐపీఎల్‍లో రెండు సెంచరీలు చేశాడు. ఐపీఎల్‍లో సెంచరీ, హ్యాట్రిక్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 2024 సీజన్‍లో ఇటీవలే తన రెండో సెంచరీ చేశాడు హిట్‍మ్యాన్.
ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ షేన్ వాటన్స్.. ఐపీఎల్‍లో నాలుగు సెంచరీలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తలా రెండు శతకాలు బాదాడు. 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున తొలి శతకం చేశాడు వాట్సాన్. అలాగే, 2014 సీజన్‍లో హైదరాబాద్‍పై అతడు బౌలింగ్‍లో హ్యాట్రిక్ తీశాడు. దీంతో ఐపీఎల్‍లో సెంచరీ, హ్యాట్రిక్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
కోల్‍కతా ప్లేయర్ సునీల్ నరైన్ నేడు సెంచరీతో కదం తొక్కాడు. 2013 ఐపీఎల్ సీజన్‍లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‍పై నరైన్ హ్యాట్రిక్ తీశాడు. అది కూడా పదకొండేళ్ల క్రితం ఇదే రోజే (ఏప్రిల్ 16). దీంతో ఐపీఎల్‍లో హ్యాట్రిక్‍తో పాటు సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా ఇప్పుడు నరైన్ రికార్డులకెక్కాడు.
ఐపీఎల్‍లో కోల్‍కతా నైట్ రైడర్స్ తరఫున సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా నరైన్ నిలిచాడు. బ్రెండన్ మెక్‍కలమ్ (2008), వెంకటేశ్ అయ్యర్ (2023) తర్వాత శకతం చేసిన కేకేఆర్ ప్లేయర్‌గా నిలిచాడు.
కోల్‍కతా భారీ స్కోరు
ఈ మ్యాచ్‍లో సునీల్ నరైన్ సెంచరీతో అదరగొట్టగా.. అంగ్‍క్రిష్ రఘువంశీ (30), రింకూ సింగ్ (20 నాటౌట్) దూకుడుగా ఆడారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది కోల్‍కతా నైట్ రైడర్స్. దీంతో రాజస్థాన్ ముందు 224 పరుగుల భారీ లక్ష్యం ఉంది. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ చెరో రెండు వికెట్లు తీయగా.. యజువేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్ చెరో వికెట్ దక్కించుకున్నారు.