IPL 2024 Orange Cap: చెన్నై సూపర్ కింగ్స్ పై సెంచరీ చేసినా తన టీమ్ ను గెలిపించలేకపోయాడు రోహిత్ శర్మ. ధోనీ మెరుపు ఇన్నింగ్స్ తో చేసిన ఆ 20 పరుగులే చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ మార్జిన్ అయింది. అయితే ఈ సెంచరీతో ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేసులోకి వచ్చాడు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్. ప్రస్తుతం అతడు టాప్ 5లో ఉన్నాడు.
ఆదివారం (ఏప్రిల్ 14) రాత్రి వాంఖెడేలో చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో రోహిత్ శర్మ 63 బంతుల్లోనే 105 రన్స్ చేసి అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. ఓపెనర్ గా వచ్చిన సెంచరీ చేసి, చివరి వరకూ క్రీజులో ఉన్నా ముంబై ఇండియన్స్ ను మాత్రం అతడు గెలిపించలేకపోయాడు. అతని ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 5 సిక్స్ లు ఉన్నాయి.
ఈ ఇన్నింగ్స్ తో ఐపీఎల్ 2024లో రోహిత్ ఆరెంజ్ క్యాప్ టాప్ 5లోకి వచ్చాడు. ప్రస్తుతం రోహిత్ 6 మ్యాచ్ లలో 261 రన్స్ తో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్లో ఈ సెంచరీ తప్ప రోహిత్ మరో హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఇక ఈ లిస్టులో విరాట్ కోహ్లియే టాప్ లో కొనసాగుతున్నాడు. కోహ్లి 6 మ్యాచ్ లలో 319 రన్స్ చేశాడు. అతడు ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు చేయడం విశేషం.
రెండో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కు చెందిన రియాన్ పరాగ్ ఉన్నాడు. అతడు 6 మ్యాచ్ లలో 284 రన్స్ చేశాడు. మూడు హాఫ్ సెంచరీలు చేసిన పరాగ్ అత్యధిక స్కోరు 84 పరుగులు. మూడో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఉన్నాడు. అతడు 6 ఇన్నింగ్స్ లో 264 రన్స్ చేశాడు. సంజూ కూడా మూడు హాఫ్ సెంచరీలు చేయడం విశేషం.
నాలుగో స్థానంలో 261 రన్స్ తో రోహిత్ శర్మ ఉండగా.. ఐదో స్థానంలో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. అతడు 6 మ్యాచ్ లలో 255 రన్స్ చేశాడు. గిల్ ఇప్పటి వరకూ రెండు హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. ప్రస్తుతానికి కోహ్లి, రోహిత్ ఇద్దరూ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న వాళ్ల టీమ్స్ ఆర్సీబీ, ముంబై మాత్రం వరుస ఓటములతో ప్లేఆఫ్స్ అవకాశాలను చేజార్చుకుంటున్నాయి.
ఇక ఐపీఎల్ 2024 పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ క్యాప్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజువేంద్ర చహల్ దగ్గర ఉంది. అతడు 6 మ్యాచ్ లలో 11 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా 10 వికెట్లతో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ కూడా 10 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.