DC vs KKR: తెలుగుగడ్డపై మరోసారి పరుగుల వరద.. రెచ్చిపోయిన కోల్‍కతా.. తేలిపోయిన ఢిల్లీ.. ఎస్‍ఆర్‌హెచ్ రికార్డు సేఫ్
DC vs KKR IPL 2024: కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టు ధనాధన్ బ్యాటింగ్‍తో పరుగుల సునామీ సృష్టించింది. వైజాగ్‍లో జరిగిన మ్యాచ్‍లో దుమ్మురేపింది. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‍లో పరాజయం పాలైంది.
DC vs KKR: తెలుగు నేలపై మరోసారి పరుగుల తుఫాన్ వచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్‍లో వారం క్రితం హైదరాబాద్‍లోని ఉప్పల్ స్టేడియంలో సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు 277 పరుగులు చేసి టోర్నీ చరిత్రలో అత్యధిక స్కోరు రికార్డు సాధించగా.. వైజాగ్‍లో నేడు కోల్‍కతా నైట్‍రైడర్స్ (KKR) దుమ్మురేపింది. ఐపీఎల్ హిస్టరీలో రెండో అత్యధిక స్కోరు చేసింది. ఏకంగా 272 రన్స్ సాధించింది. ఐదు పరుగుల తేడాతో హైదరాబాద్ రికార్డు సేఫ్ అయింది. వైజాగ్ వేదికగా నేడు (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్‍లో కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టు 106 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టుపై భారీ విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‍లో వరుసగా మూడు మ్యాచ్‍ల్లో గెలిచి హ్యాట్రిక్ చేసింది కేకేఆర్.
మళ్లీ నరేన్ ధనాధన్
కోల్‍కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‍కు తిగింది. కోల్‍కతా ఓపెనర్, విండీస్ ఆల్ రౌండర్ సునీల్ నరేన్ మరోసారి జూలు విదిల్చాడు. భీకర హిట్టింగ్‍తో ఢిల్లీ బౌలర్లను కంగుతినిపించాడు. 39 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85 పరుగులు చేశాడు నరేన్. ఫిల్ సాల్ట్ (18) ఔటైనా.. నరేన్ మాత్రం వీరబాదుడు బాదేశాడు. తన ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‍లోనే కోల్‍కతా యువ బ్యాటర్ అంగ్‍క్రిష్ రఘువంశీ అర్ధశతకం బాదాడు. 27 బంతుల్లోనే 54 పరుగులతో రాణించాడు. నరేన్, రఘువంశీ దూకుడుతో 11 ఓవర్లలోనే 150 పరుగులకే చేరుకుంది కోల్‍కతా. నరేన్ 21 బంతుల్లోనే అర్ధ శకతం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడాడు. అయితే, 13వ ఓవర్లో నరేన్ ఔటయ్యాడు. రఘువంశీ కూడా తర్వాతి ఓవర్లో వెనుదిరిగాడు.
రసెల్, రింకూ మెరుపులు
నరేన్, రఘువంశీ పెవిలియన్ చేరాక.. కోల్‍కతా బ్యాటర్లు ఆండ్రీ రసెల్, రింకూ సింగ్ మెరిపించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (18) త్వరగానే ఔటైనా.. వారిద్దరూ దుమ్మురేపారు. ధనాధన్ హిట్టింగ్‍తో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపారు. 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో రసెల్ 41 రన్స్ చేశాడు. అయితే, ఢిల్లీ సీనియర్ ఇషాంత్ శర్మ.. రసెల్‍ను అద్భుతమైన యార్కర్‌తో పెవిలియన్‍కు పంపాడు. రింకూ సింగ్ 8 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్స్‌లు కొట్టి 26 రన్స్ చేశాడు. మొత్తంగా 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 పరుగులు చేసింది కోల్‍కతా నైట్ రైడర్స్. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఢిల్లీ బౌలర్లు ఎన్రిచ్ నార్జే మూడు, ఇషాంత్ శర్మ రెండు, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ తలా ఓ వికెట్ తీశారు.
పంత్, స్టబ్స్ పోరాడినా..
భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు డేవిడ్ వార్నర్ (18), పృథ్వి షా (10), మిచెల్ మార్ష్ (0), అభిషేక్ పోరెల్ (0) విఫలమవటంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓ దశలో 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. త్వరగానే ఆలౌటవుతుందా అని అనిపించింది. అయితే, ఆ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతంగా ఆడాడు. 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్స్‌లు బాది 55 పరుగులు చేశాడు. అర్ద శకతంతో పోరాడాడు. అయితే, 13వ ఓవర్లో పంత్ ఔటయ్యాడు. ఢిల్లీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ కూడా కాసేపు పోరాడాడు. 32 బంతుల్లోనే 54 పరుగులతో రాణించాడు. పంత్, స్టబ్స్ పోరాడినా ఫలితం లేకపోయింది. తర్వాతి బ్యాటర్లు చేతులు ఎత్తేశారు. 17.2 ఓవర్లలో 166 పరుగులకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆలౌటై.. భారీ పరాజయం మూటగట్టుకుంది. కోల్‍కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభర్ అరోరా చెరో మూడు, మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీసుకున్నారు. రసెల్, నరేన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ సీజన్‍లో వైజాగ్‍లో ఇదే చివరి మ్యాచ్.
కోల్‍కతా హ్యాట్రిక్
ఐపీఎల్ 2024 సీజన్‍లో కోల్‍కతా హ్యాట్రిక్ కొట్టింది. తన తొలి మూడు మ్యాచ్‍ల్లో గెలిచింది. హైదరాబాద్, బెంగళూరుపై విజయం సాధించిన కేకేఆర్.. నేడు ఢిల్లీపై కూడా పైచేయి సాధించింది. దీంతో ఆరు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‍కు చేరింది. నాలుగు మ్యాచ్‍ల్లో మూడు ఓడిన ఢిల్లీ తొమ్మిదో స్థానానికి పడిపోయింది.
హైదరాబాద్ రికార్డ్ సేఫ్
ఐపీఎల్ 2024 సీజన్‍లో మార్చి 27న జరిగిన మ్యాచ్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. ఉప్పల్ స్టేడియంలో ముంబైతో జరిగిన మ్యాచ్‍లో 277 రన్స్ చేసి.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు రికార్డును తన పేరిట లిఖించుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2013లో 263 పరుగులు) రికార్డును బద్దలుకొట్టింది ఎస్‍ఆర్‌హెచ్. ఇక, నేటి మ్యాచ్‍తో ఆర్సీబీని కోల్‍కతా దాటేసింది. ఈ మ్యాచ్‍లో 272 రన్స్ చేసి.. ఐపీఎల్‍లో రెండో అత్యధిక స్కోరు చేసింది. ఓ దశలో హైదరాబాద్ రికార్డును కూడా కోల్‍కతా దాటేలా కనిపించింది. అయితే, ఐదు పరుగుల దూరంలో ఆగింది. దీంతో హైదరాబాద్ పేరిట ఉన్న ఐపీఎల్ అత్యధిక పరుగుల స్కోరు ఇంకా సేఫ్‍గా నిలిచింది.
ఐపీఎల్ 2024 సీజన్‍లో రేపు (ఏప్రిల్ 4) పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్‍లో మ్యాచ్ జరగనుంది.