IPL 2024 GT vs SRH: నిరాశపరిచిన హైదరాబాద్.. అలవోకగా గెలిచిన గుజరాత్.. మలుపుతిప్పిన ఆ ఓవర్-ipl 2024 gt vs srh sunrisers hyderabad lost against gujarat titans sai sudarshan shines again ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Gt Vs Srh: నిరాశపరిచిన హైదరాబాద్.. అలవోకగా గెలిచిన గుజరాత్.. మలుపుతిప్పిన ఆ ఓవర్

IPL 2024 GT vs SRH: నిరాశపరిచిన హైదరాబాద్.. అలవోకగా గెలిచిన గుజరాత్.. మలుపుతిప్పిన ఆ ఓవర్

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 31, 2024 08:23 PM IST

GT vs SRH IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు రెండో ఓటమి ఎదురైంది. గుజరాత్ టైటాన్స్ జట్టుతో నేడు జరిగిన మ్యాచ్‍లో హైదరాబాద్ ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్‍లో ఆకట్టుకోలేకపోయింది ఎస్‍ఆర్‌హెచ్.

GT vs SRH: నిరాశపరిచిన హైదరాబాద్.. అలవోకగా గెలిచిన గుజరాత్
GT vs SRH: నిరాశపరిచిన హైదరాబాద్.. అలవోకగా గెలిచిన గుజరాత్ (AFP)

Gujarat Titans vs Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024 సీజన్‍లో గత మ్యాచ్‍లో ముంబైపై అద్భుతాలు చేసిన సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH).. నేడు గుజరాత్ టైటాన్స్‌(GT)పై నిరాశపరిచింది. ఈ సీజన్‍లో తన మూడో మ్యాచ్‍లో ఎస్ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు (మార్చి 31) జరిగిన మ్యాచ్‍లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో గుజరాత్ చేతిలో పరాజయం చెందింది.

ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‍రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (20 బంతుల్లో 29 పరుగులు), అబ్దుల్ సమాద్ (14 బంతుల్లో 29 పరుగులు) పర్వాలేదనిపించినా.. మిగిలిన బ్యాటర్లు ఎక్కువ సేపు నిలువలేకపోయారు. హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 24 పరుగులు) కాసేపు మెరిపించాడు. అయితే, ఒక్కరు కూడా 30 మార్కును దాటలేకపోయారు. దీంతో ఎస్ఆర్‌హెచ్‍కు మోస్తరు స్కోరే దక్కింది. గుజరాత్ పేసర్ మోహిత్ శర్మ 4 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. చివర్లో హైదరాబాన్‍ను కట్టడి చేశాడు. నూర్ అహ్మద్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.

సునాయాసంగా..

ఈ మోస్తరు లక్ష్యాన్ని 5 బంతులు మిగిల్చి గుజరాత్ టైటాన్స్ ఛేదించింది. 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 168 పరుగులు చేసి విజయం సాధించింది శుభ్‍మన్ గిల్ సేన. గుజరాత్ యంగ్ ప్లేయర్ సాయిసుదర్శన్ (36 బంతుల్లో 45 పరుగులు) మంచి ఇన్నింగ్స్ ఆడగా.. డేవిడ్ మిల్లర్ (27 బంతుల్లో 44 పరుగులు నాటౌట్) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. కెప్టెన్ శుభ్‍మన్ గిల్ (28 బంతుల్లో 36 పరుగులు) ఆరంభంలో రాణించాడు. మొత్తంగా సునాయాసంగానే ఈ మ్యాచ్ గెలిచింది గుజరాత్. హైదరాబాద్ బౌలర్లలో షెహబాజ్ అహ్మద్, మయాంక్ మార్కండే, ప్యాట్ కమిన్స్ చెరో వికెట్ తీశారు.

చివరి 5 ఓవర్లలో 40 పరుగులే..

సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్‍‍లో చివరి ఐదు ఓవర్లలో తడబడింది. అబ్దుల్ సమాద్ 14 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్ బాది 29 పరుగులు చేసిన.. చివర్లో షహబాజ్ అహ్మద్ 20 బంతుల్లో కేవలం 22 రన్స్ మాత్రమే చేయగలిగాడు. దీంతో వేగంగా పరుగులు రాలేదు. అనుకున్న స్థాయిలో హిట్టింగ్ చేయలేకపోయారు. గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ పొదుపుగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో షహబాజ్ అహ్మద్ వాషింగ్టన్ సుందర్ (0)ను ఔట్ చేసిన మోహిత్.. కేవలం 3 పరుగులే ఇచ్చాడు. దీంతో హైదరాబాద్ 162 పరుగులకే పరిమితమైంది.

మలుపుతిప్పిన ఓ ఓవర్

లక్ష్యఛేదనలో ఓ దశలో గుజరాత్ టైటాన్స్ చివరి ఐదు ఓవర్లలో 49 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే, ఆ దశలో 16వ ఓవర్ వేశాడు హైదరాబాద్ స్పిన్నర్ మయాంక్ మార్కండే. ఆ ఓవర్లో జీటీ హిట్టర్ డేవిడ్ మిల్లర్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదేశాడు. మొత్తంగా ఆ ఓవర్లో 24 రన్స్ వచ్చాయి. దీంతో హైదరాబాద్‍ పరాజయం అక్కడే ఖరారైంది. ఆ తర్వాత లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించేసింది గుజరాత్. సాయి సుదర్శన్ ఔటైనా మిల్లర్ చివరి వరకు నిలిచాడు.

దీంతో ఐపీఎల్ 2024 సీజన్‍లో తొలి మూడు మ్యాచ్‍ల్లో రెండు ఓడింది హైదరాబాద్. గుజరాత్ మూడు మ్యాచ్‍ల్లో రెండింట విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్-4కు వెళ్లింది.

Whats_app_banner