SRH vs KKR Result: క్లాసెన్ వీర మాస్ హిట్టింగ్ వృథా.. చివరి వరకు పోరాడి ఓడిన హైదరాబాద్
SRH vs KKR Result - IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍ను నిరాశజనకంగా మొదలుపెట్టింది సన్‍రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్‍లో తన తొలి పోరులో కోల్‍కతా చేతిలో పోరాడి ఓడింది ఎస్‍ఆర్‌హెచ్. హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుత హిట్టింగ్‍తో పోరాటం చేశాడు.
IPL 2024 SRH vs KKR: ఐపీఎల్ 2024 టోర్నీని సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓటమితో ఆరంభించింది. ఈ సీజన్‍లో తన తొలి మ్యాచ్‍లో చివరి వరకు పోరాడి ఉత్కంఠ పోరులో ఎస్‍ఆర్‌హెచ్ పరాజయం పాలైంది. కోల్‍కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నేడు (మార్చి 23) జరిగిన మ్యాచ్‍లో హైదరాబాద్ 4 పరుగుల తేడాతో కోల్‍కతా నైట్‍రైడర్స్ చేతిలో ఓడిపోయింది. ఎస్‍ఆర్‌హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 29 బంతుల్లో 8 సిక్సర్లు బాది 63 పరుగులతో అదరగొట్టాడు. వీర మాస్ హిట్టింగ్‍తో చివరి వరకు పోరాడాడు. అయితే, చివరి ఓవర్లో తడబడి ఓడింది హైదరాబాద్. ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్ సారథ్యం వహించిన తొలి మ్యాచ్‍లోనే సన్‍రైజర్స్ పరాజయం చెందింది.
ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోరు చేసింది. కోల్‍కతా బ్యాటర్, వెస్టిండీస్ స్టార్ ఆండ్రీ రసెల్ 25 బంతుల్లో అజేయంగా 64 పరుగులతో హిట్టింగ్ సునామీ చేశాడు. 3 ఫోర్లు, 7 సిక్సర్లు బాది విధ్వంసం చేశాడు. సన్‍రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ఎవరూ రసెల్ బాదుడు అడ్డుకోలేకపోయారు. కోల్‍కతా ఓపెనర్ ఫిల్ సాల్ట్ (54) అర్ధ శతకంతో రాణించాడు. ఓ దశలో కష్టాల్లో ఉన్న కోల్‍కతాకు భారీ స్కోరు కట్టబెట్టాడు రసెల్. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ మూడు వికెట్లతో రాణించగా.. మయాంక్ మార్కండేకు రెండు, ప్యాట్ కమిన్స్‌కు ఓ వికెట్ దక్కింది.
లక్ష్యఛేదనలో సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 రన్స్ చేసింది. హెన్రిచ్ క్లాసెన్ సునామీ హిట్టింగ్‍తో అర్ధ శతకం చేశాడు. అసాధ్యమనుకున్న చోటు నుంచి ఏకంగా గెలిపించినంత పని చేశాడు. గెలుపునకు చివరి ఐదు ఓవర్లలో 81 రన్స్ చేయాల్సి ఉన్న దశలో క్లాసెన్ వీరబాదుడు బాదాడు. అయితే, ఆఖరి ఓవర్లో చివరి ఐదు బంతులకు 7 పరుగులు చేయాల్సిన దశలో తడబడి ఓటమి పాలైంది హైదరాబాద్. ఆ దశలో షెహబాజ్ అహ్మద్ (5 బంతుల్లో 16 పరుగులు), క్లాసెన్ ఔటవటంతో సన్‍రైజర్స్ పరాజయం చెందింది. కోల్‍కతా బౌలర్లలో హర్షిత్ రాణా మూడు, ఆండ్రే రసెల్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తికి చెరో వికెట్ తీసుకున్నారు. ఈ హైస్కోరింగ్ మ్యాచ్‍లో నరేన్ 4 ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చాడు.
క్లాసెన్ అద్భుత పోరాటం
భారీ లక్ష్యఛేదనలో సన్‍రైజర్స్ హైదరాబాద్ చివరి వరకు పోరాడింది. మయాంక్ అగర్వాల్ (32), అభిషేక్ శర్మ (32) మంచి ఆరంభమే అందించారు. అయితే వారిద్దరూ పెవిలియన్‍కు చేరాక పరుగుల రాక మందగించింది. రాహుల్ త్రిపాఠి (20), ఐడెన్ మార్క్‌రమ్ (18) వేగంగా ఆడలేకపోయారు. నెమ్మదిగా పరుగులు రాబట్టి కాసేపటికి ఔటయ్యారు. దీంతో 13 ఓవర్లలో 4 వికెట్లకు 111 పరుగులే చేయగలిగింది హైదరాబాద్. గెలువాలంటే చివరి 6 ఓవర్లకు 94 రన్స్ చేయాల్సి వచ్చింది. ఆ దశలో హెన్రిచ్ క్లాసెన్ విజృభించాడు. సిక్సర్లతో విరుచుకపడ్డాడు. కోల్‍కతా బౌలర్లకు దడ పుట్టించాడు.
క్లాసెన్ వీరబాదుడుతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. షెహబాద్ అహ్మద్ కూడా హిట్టింగ్ చేయడంతో హైదరాబాద్ గెలుపును సమీపించింది. ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన రూ.24.75కోట్ల కోల్‍కతా పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన 19వ ఓవర్లో క్లాసెన్ రెండు, షెహబాజ్ ఓ సిక్సర్ బాదారు. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. క్లాసెన్ తొలి బంతికే సిక్సర్ కొట్టాడు. దీంతో 5 బంతుల్లో గెలుపుకు 7 పరుగులే అవసరం కాగా.. హైదరాబాద్ గెలిచే దశకు వచ్చింది. అయితే, ఆ తర్వాత క్లాసెన్ సింగిల్ తీయగా.. షెహబాజ్ అహ్మద్ ఔటయ్యాడు. క్లాసెన్ కూడా పెవిలియన్‍కు చేరడంతో హైదరాబాద్ ఓడింది. చివరి ఓవర్లో కోల్‍కతా యువ బౌలర్ హర్షిత్ రాణా రాణించి హైదరాబాద్ విజయాన్ని అడ్డుకున్నాడు.
రసెల్ విధ్వంసం
సన్‍రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అదరగొట్టడంతో ఫస్ట్ బ్యాటింగ్‍లో కోల్‍కతా నైట్‍రైజర్స్ ఆరంభంలో తడబడింది. 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఫిల్ సాల్ట్ అర్ధశకతంతో పాటు రమణ్‍దీప్ సింగ్ (35) నిలువడంతో కోలుకుంది. అయితే, ఆ తర్వాతే ఆండ్రీ రసెల్ విధ్వంసం మొదలైంది. హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ భీకర హిట్టింగ్‍తో రసెల్ చెలరేగాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. 20 బంతుల్లోనే అర్ధ శతకానికి రసెల్ చేరాడు. అతడి విధ్వంసంతో కోల్‍కతా స్కోరు పరుగులు పెట్టింది. చివరి వరకు ఆదే జోరు చూపాడు రసెల్. మొత్తంగా 7 సిక్సర్లు బాదాడు. 256 స్ట్రయిక్ రేట్‍తో 64 రన్స్ చేశాడు. రింకూ సింగ్ (23) కూడా రాణించాడు. మొత్తంగా చివరి పది ఓవర్లలో 131 రన్స్ చేసింది కోల్‍కతా. దీంతో ఆ జట్టుకు భారీ స్కోరు దక్కింది.