IPL 2024 All Records: ఐపీఎల్ 2024లో నమోదైన 10 ఆల్ టైమ్ రికార్డులు ఇవే.. సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ అసాధారణ బ్యాటింగ్
IPL 2024 All Records: ఐపీఎల్ 2024 రికార్డులకు మారుపేరుగా నిలిచిపోయింది. ఈ 17వ సీజన్ లో ఎన్నో ఆల్ టైమ్ రికార్డులు బ్రేకయ్యాయి. ఇవన్నీ బ్యాటింగ్ రికార్డులు కాగా.. వీటిలో సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ ముందు వరుసలో ఉన్నాయి.
IPL 2024 All Records: ఐపీఎల్ 2024లో బ్యాటింగ్ లో పలు ఆల్ టైమ్ రికార్డులు బ్రేకయ్యాయి. పరుగుల సునామీలో గత రికార్డులన్నీ కొట్టుకుపోయాయి. సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, కేకేఆర్, ఆర్సీబీలాంటి టీమ్స్ బౌలర్లను ఉతికారేశాయి. దీంతో కొన్నేళ్లుగా ఉన్న రికార్డులు కూడా కనుమరుగయ్యాయి. కేవలం ఐపీఎల్ రికార్డులే కాదు.. టీ20ల్లోనూ పలు రికార్డులు బ్రేకయ్యాయి. అవేంటో ఇక్కడ చూడండి.
ఐపీఎల్ 2024లో నమోదైన రికార్డులు
ఐపీఎల్లో అత్యధిక స్కోరు
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోరు ఈ సీజన్లోనే నమోదైంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఏకంగా 287 రన్స్ చేసింది. ఇదే సీజన్లో అంతకు మూడు వారాల ముందు ముంబై ఇండియన్స్ పై తానే చేసిన 277 రన్స్ రికార్డును సన్ రైజర్స్ చెరిపేసింది. ఒక ఇన్నింగ్స్ లో 287 టీ20 క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం.
టీ20 క్రికెట్ లో అత్యధిక చేజింగ్
ఇక పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లోనే కాదు టీ20 క్రికెట్ లోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేసింది. ఈ ఏడాది ఛాంపియన్ కేకేఆర్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఏకంగా 262 రన్స్ టార్గెట్ చేజ్ చేసి చరిత్ర సృష్టించింది.
ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు
పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మ్యాచ్ లోనే అత్యధిక సిక్స్‌ల రికార్డు కూడా నమోదైంది. ఈ మ్యాచ్ లో ఏకంగా 42 సిక్స్‌లు రావడం విశేషం. ఇక పంజాబ్ కింగ్స్ తన ఇన్నింగ్స్ లో 24 సిక్స్ లు కొట్టింది. ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ ల రికార్డు ఇదే. అంతకుముందు 22 సిక్స్ లతో సన్ రైజర్స్ పేరిట ఉన్న రికార్డు బ్రేకయింది.
ఐపీఎల్ ఒక సీజన్లో అత్యధిక సిక్స్‌లు
ఈ ఏడాది ఐపీఎల్లో అత్యధికంగా 1260 సిక్స్ లు నమోదయ్యాయి. గతంలో ఏ సీజన్లోనూ ఇన్ని సిక్స్ లు కొట్టలేదు. వీటిలో సన్ రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ 16 మ్యాచ్ లలో 42 సిక్స్ లతో టాప్ లో ఉన్నాడు.
టీ20 క్రికెట్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు
టీ20 క్రికెట్ లో ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులు నమోదైన రికార్డు కూడా ఈ సీజన్లోనే ఉంది. సన్ రైజర్స్, ఆర్సీబీ మధ్య ఏప్రిల్ 15న జరిగిన మ్యాచ్ లో ఏకంగా 549 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 287, ఆర్సీబీ 262 రన్స్ చేశాయి.
పవర్ ప్లేలో అత్యధిక స్కోరు
టీ20 క్రికెట్ చరిత్రలో పవర్ ప్లే (మొదటి 6 ఓవర్లు)లో అత్యధిక రన్స్ చేసిన రికార్డును సన్ రైజర్స్ క్రియేట్ చేసింది. ఆ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో వికెట్ నష్టపోకుండా 125 రన్స్ చేయడం విశేషం.
ఐపీఎల్లో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ స్పెల్
ఐపీఎల్లో నాలుగు ఓవర్ల స్పెల్ లో ఓ బౌలర్ సమర్పించుకున్న అత్యధిక పరుగుల రికార్డు కూడా ఇదే సీజన్లో నమోదైంది. డీసీతో మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ బౌలర్ మోహిత్ శర్మ 4 ఓవర్లలోనే ఏకంగా 73 రన్స్ ఇచ్చాడు.
200 వికెట్లు తీసుకున్న తొలి బౌలర్
ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ చహల్ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసుకున్న తొలి బౌలర్ గా అతడు నిలిచాడు.
తొలి ఓవర్లో అత్యధిక వికెట్లు
రాజస్థాన్ రాయల్స్ కే చెందిన ట్రెంట్ బౌల్ట్ ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే అత్యధిక వికెట్ల రికార్డును క్రియేట్ చేశాడు. బౌల్ట్ తొలి ఓవర్ వికెట్ల సంఖ్య 26కు చేరింది.
ఐపీఎల్లో అత్యధిక క్యాచ్‌లు
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్ లు అందుకున్న రికార్డును విరాట్ కోహ్లి క్రియేట్ చేశాడు. అతడు మొత్తంగా 112 క్యాచ్ లు పట్టుకున్నాడు.