RR vs RCB IPL 2024: బెంగళూరు కల చెదిరె.. సూపర్ విక్టరీ కొట్టిన రాజస్థాన్.. టోర్నీ నుంచి ఆర్సీబీ ఔట్-rr vs rcb eliminator royal challengers bengaluru out of ipl 2024 after defeat against rajasthan ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rr Vs Rcb Ipl 2024: బెంగళూరు కల చెదిరె.. సూపర్ విక్టరీ కొట్టిన రాజస్థాన్.. టోర్నీ నుంచి ఆర్సీబీ ఔట్

RR vs RCB IPL 2024: బెంగళూరు కల చెదిరె.. సూపర్ విక్టరీ కొట్టిన రాజస్థాన్.. టోర్నీ నుంచి ఆర్సీబీ ఔట్

RR vs RCB IPL 2024 Eliminator: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హార్ట్ బ్రేక్ అయింది. ఎలిమినేటర్‌లో రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ చిత్తయింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. అద్భుత విజయంతో క్వాలిఫయర్-2లో రాజస్థాన్ అడుగుపెట్టింది.

RR vs RCB IPL 2024: బెంగళూరు కల చెదిరె.. సూపర్ విక్టరీ కొట్టిన రాజస్థాన్..టోర్నీ నుంచి ఆర్సీబీ ఔట్

RR vs RCB IPL 2024 Eliminator: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ టైటిల్ కల మరోసారి చెదిరింది. ఐపీఎల్ 2024 సీజన్ లీగ్ దశలో వరుసగా ఆరు విజయాలతో ప్లేఆఫ్స్ చేరిన ఆర్సీబీకి ఎలిమినేటర్‌లో ఓటమి ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో నేడు ఓటమి పాలై టోర్నీ నుంచి నిరాశగా నిష్క్రమించింది బెంగళూరు. ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా నేడు (మే 22) జరిగిన ఎలిమినేటర్‌లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. ఆల్ రౌండ్ పదర్శనతో అదరగొట్టింది. ఓ ఓవర్ మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించింది. దీంతో క్వాలిఫయర్-2కు సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ దూసుకెళ్లింది. ఇక, తొలి టైటిల్ కల నెరవేరకుండానే ఈ 17వ సీజన్ నుంచి బెంగళూరు నిష్క్రమించింది.

యశస్వి దూకుడు

లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. 19 ఓవర్లలోనే 6 వికెట్లకు 174 పరుగులు చేసి విజయం సాధించింది. ఓ ఓవర్ మిగిలి ఉండగానే గెలిచేసింది. మోస్తరు టార్గెట్ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. 30 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. 8 ఫోర్లు బాదాడు. మరో ఓపెనర్ టోమ్ కోహ్లెర్ కాడ్మోర్ (20) పర్వాలేదనిపించాడు. నెమ్మదిగా మొదలుపెట్టినా జైస్వాల్ ఆ తర్వాత దూకుడు పెంచాడు. ఆరో ఓవర్లో కాడ్మోర్‌ను ఔట్ చేసి బెంగళూరుకు బ్రేక్‍త్రూ ఇచ్చాడు పేసర్ ఫెర్గ్యూసన్. పదో ఓవర్లో గ్రీన్ బౌలింగ్‍లో స్కూప్ షాట్‍కు ప్రయత్నించిన జైస్వాల్.. కీపర్ కార్తీక్‍కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (13 బంతుల్లో 17 పరుగులు) కాస్త నెమ్మదిగా ఆడాడు. పదో ఓవర్లోనే కర్ణ్ శర్మ బౌలింగ్‍లో స్టంపౌట్ అయ్యాడు సంజూ. దీంతో 10 ఓవర్లలో 86 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది ఆర్ఆర్. ఆ తర్వాత జురెల్ (8) రనౌట్ అయ్యాడు.

రాణించిన పరాగ్.. హిట్మైర్, పావెల్ మెరుపులు

ఈ సీజన్‍లో ఫుల్ ఫామ్‍లో ఉన్న రాజస్థాన్ యంగ్ స్టార్ రియాన్ పరాగ్ ఈ కీలకమైన ఎలిమిటర్‌లోనూ రాణించాడు. 26 బంతుల్లో 36 పరుగులు (2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు పరాగ్. షిమ్రన్ హిట్మైర్ 14 బంతుల్లోనే 26 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో మెరిపించాడు. దీంతో రాజస్థాన్ గెలుపు దిశగా నడిచింది. అయితే, 18వ ఓవర్లో పరాగ్, హిట్మైర్‌ను సిరాజ్ ఔట్ చేయటంతో కాస్త టెన్షన్ ఏర్పడింది. అయితే, అప్పటికే చేయాల్సిన పరుగులు.. బంతులు సమానం అయిపోయాయి. చివర్లో రావ్మన్ పావెల్ (8 బంతుల్లో 16 పరుగులు నాటౌట్; 2 ఫోర్లు, ఓ సిక్స్) వేగంగా ఆడి రాజస్థాన్‍ను గెలుపు తీరం దాటించాడు.

ఆర్సీబీ ఫీల్డింగ్ తప్పిదాలు

బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ రెండు, లూకీ ఫెర్గ్యూసన్, కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్ తలా ఓ వికెట్ తీశారు. అయితే, బెంగళూరు ఫీల్డింగ్‍లో తీవ్రంగా తడబడింది. మూడు క్యాచ్‍లు నేలపాలు చేశారు ఫీల్డర్లు. గ్రౌండ్ ఫీల్డింగ్‍లోనూ తడబడ్డారు.

ఆర్సీబీని అదుపు చేసిన రాజస్థాన్ బౌలర్లు

అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (24 బంతుల్లో 33 పరుగులు), రజత్ పాటిదార్ (22 బంతుల్లో 34 పరుగులు), మహిపాల్ లోమ్రోర్ (17 బంతుల్లో 32 పరుగులు) రాణించగా.. మిగిలిన వారు విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రాజస్థాన్‍ను నిలువరించారు.

రాజస్థాన్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 16 రన్స్ ఇచ్చి ఓ వికెట్ దక్కించుకున్నాడు. చాహల్, సందీప్ శర్మ తలా ఓ వికెట్ తీసుకున్నారు.

మే 24న చెన్నై చెపాక్ స్టేడియంలో సన్‍రైజర్స్ హైదరాబాద్‍‍తో క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‍లో గెలిచిన జట్టు మే 26న కోల్‍కతాతో ఫైనల్ ఆడుతుంది.