USA vs BAN: టీ20 క్రికెట్‌లో అమెరికా సంచలనం - బంగ్లాదేశ్‌పై సిరీస్ కైవసం
USA vs BAN: టీ20 క్రికెట్‌లో అమెరికా సంచలనం సృష్టించింది. వరల్డ్ కప్ ముగింట బంగ్లాదేశ్‌కు షాకిచ్చి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్నది. రెండో టీ20 అమెరికా చేతిలో బంగ్లాదేశ్ ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
USA vs BAN: టీ 20 వరల్డ్ ముంగిట పసికూనలు సంచనాలను సృష్టిస్తోన్నాయి. మొన్న పాకిస్థాన్ ను ఐర్లాండ్ మట్టికరిపించి షాకిచ్చింది. తాజాగా బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన అమెరికా ఏకంగా టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్నది. టీ20 వరల్డ్ కప్‌లో పసికూనలు అంటూ తమకు తక్కువ అంచనా వేయద్దని ఐర్లాండ్, అమెరికా హింట్ ఇచ్చాయి.
మోనాక్ పటేల్ మెరుపులు...
గురువారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అమెరికా చేతిలో ఆరు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసింది. అమెరికాకు కెప్టెన్ కమ్ ఓపెనర్ మోనాక్ పటేల్ చక్కటి ఆరంభాన్ని అందించాడు.
మోనాక్ పటేల్ 38 బాల్స్‌లో నాలుగు ఫోర్లు ఓ సిక్సర్‌తో 42 రన్స్, టేలర్ ఇరవై ఎనిమిది బాల్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 రన్స్ చేయడంలో అమెరికా భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫలం కావడంతో మోస్తారు స్కోరుకే అమెరికా పరిమితమైంది.
ఆరోన్ జోన్స్ 34 బాల్స్‌లో 35 రన్స్ చేశాడు. కానీ ధాటిగా ఆడలేకపోయాడు. కోరే అండర్సన్ విఫలమయ్యాడు. ముస్తాఫిజుర్ రహ్మన్‌తో పాటు రిషాద్ హోస్సైన్, షోరిఫుల్ ఇస్లామ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
బంగ్లాదేశ్ తడబాటు...
145 పరుగుల సింపుల్ టార్గెట్‌ను ఛేదించడంలో బంగ్లాదేశ్ తడబడింది. 19.3 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది. ఆరు పరుగుల తేడాతో అమెరికా చేతిలో ఓడిపోయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్స్‌లో నలుగురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు.
షకీబ్ అల్ హసన్ (30 రన్స్), కెప్టెన్ షా (36 రన్స్) బంగ్లాను గెలిపించేందుకు ప్రయత్నించారు. కీలక సమయంలో వారు ఔట్ కావడంతో బంగ్లాదేశ్ ఓటమి ఖాయమైంది. తౌహిద్ హ్రిదయ్ 25 రన్స్ చేశాడు.
చివరి ఆరు వికెట్లను బంగ్లాదేశ్ 14 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. అమెరికా పేసర్ల ధాటికి బంగ్లాదేశ్ చివరి వరుస బ్యాట్స్‌మెన్స్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. అమెరికా బౌలర్లలో అలీఖాన్ మూడు, నేత్రవాల్కర్,షాల్విక్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
సిరీస్ కైవసం...
ఇప్పటికే తొలి టీ20 బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన అమెరికా రెండో టీ20లో విజయంలో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్నది. అమెరికా క్రికెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద విజయం. మరోవైపు అగ్ర ప్లేయర్లతో బరిలో దిగిన బంగ్లాదేశ్ అమెరికా లాంటి పసికూనను ఓడించలేక చతికిలపడటంతో ఆ దేశ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
షకీబ్‌తో పాటు మిగిలిన ప్లేయర్లను తెగ ట్రోల్ చేస్తున్నారు. నేపాల్, నెదర్లాండ్స్ లాంటి జట్లపై కూడా బంగ్లాదేశ్ గెలవలేదని అంటున్నారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో టీ20 మ్యాచ్ మే 25న జరుగునుంది.