Shoaib Akhtar on Pakistan: ఇది ఘోర అవమానం.. మళ్లీ ఓ చెత్త చరిత్ర సృష్టించారు: పాకిస్థాన్ టీమ్‌పై షోయబ్ అక్తర్ ఆగ్రహం-shoaib akhtar on pakistan says this is very insulting creates another unwanted history ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shoaib Akhtar On Pakistan: ఇది ఘోర అవమానం.. మళ్లీ ఓ చెత్త చరిత్ర సృష్టించారు: పాకిస్థాన్ టీమ్‌పై షోయబ్ అక్తర్ ఆగ్రహం

Shoaib Akhtar on Pakistan: ఇది ఘోర అవమానం.. మళ్లీ ఓ చెత్త చరిత్ర సృష్టించారు: పాకిస్థాన్ టీమ్‌పై షోయబ్ అక్తర్ ఆగ్రహం

Hari Prasad S HT Telugu
Jun 07, 2024 02:02 PM IST

Shoaib Akhtar on Pakistan: క్రికెట్ పసికూన యూఎస్ఏ చేతుల్లో పాకిస్థాన్ ఓడిపోవడంపై ఆ టీమ్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇది దారుణమైన అవమానమని, మరోసారి ఓ చెత్త చరిత్ర సృష్టించారని అనడం గమనార్హం.

ఇది ఘోర అవమానం.. మళ్లీ ఓ చెత్త చరిత్ర సృష్టించారు: పాకిస్థాన్ టీమ్‌పై షోయబ్ అక్తర్ ఆగ్రహం
ఇది ఘోర అవమానం.. మళ్లీ ఓ చెత్త చరిత్ర సృష్టించారు: పాకిస్థాన్ టీమ్‌పై షోయబ్ అక్తర్ ఆగ్రహం (Getty-Agency)

Shoaib Akhtar on Pakistan: టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ తొలి మ్యాచ్ లోనే యూఎస్ఏ చేతుల్లో దారుణమైన ఓటమి ఆ టీమ్ మాజీ క్రికెటర్లు, అభిమానులకు మింగుడు పడటం లేదు. మరీ సూపర్ ఓవర్లో అమెరికాలాంటి క్రికెట్ పసికూన చేతుల్లో ఓడిపోవడంపై మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇది దారుణమైన అవమానమని అన్నాడు.

చాలా అవమానకరం: పాకిస్థాన్ మాజీలు

టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే పాకిస్థాన్ కు ఇంత దారుణమైన ఓటమి ఎదురవడంపై ఆ టీమ్ మాజీ క్రికెటర్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. షోయబ్ అక్తర్ తోపాటు మరో మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ కూడా ఇది అవమానకరం అంటూ మండిపడ్డాడు. ఈ మ్యాచ్ తర్వాత అక్తర్ ఓ చిన్ని వీడియోను తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అందులో అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది.

"పాకిస్థాన్ కు ఇది తీవ్రంగా నిరాశ కలిగించే ఓటమి. యూఎస్ఏ చేతుల్లో ఓటమితో మరో చెత్త చరిత్రను సృష్టించారు. 25 ఏళ్ల కిందట 1999 వరల్డ్ కప్ లోనూ బంగ్లాదేశ్ చేతుల్లో ఇలాంటి ఓటమే ఎదురైంది. దురదృష్టవశాత్తూ పాకిస్థాన్ కు గెలిచే అర్హత లేదు. యూఎస్ఏ చాలా బాగా ఆడింది. వాళ్లు మ్యాచ్ మొత్తం పటిష్టమైన స్థితిలోనే ఉన్నారు. ఆమిర్ మ్యాచ్ కాపాడాడు. అతడు, షహీన్ ప్రయత్నించారు. కానీ గెలిపించలేకపోయారు" అని అక్తర్ అన్నాడు.

మరో మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ మరింత ఘాటుగా స్పందించాడు. ఇది చాలా అవమానమని అన్నాడు. "సూపర్ ఓవర్లో మ్యాచ్ ఓడిపోవడం అనేది పాకిస్థాన్ కు అతిపెద్ద అవమానం. ఇంతకంటే దారుణమైన అవమానం మరొకటి ఉండదు. యూఎస్ఏ అద్భుతంగా ఆడింది. వాళ్లు ఏదో పసికూనలాగా కనిపించలేదు. వాళ్లు పాకిస్థాన్ కంటే మెరుగైన జట్టుగా కనిపించారు. వాళ్లు ఆ స్థాయి పరిణతి చూపించారు" అని అక్మల్ అన్నాడు.

పాకిస్థాన్‌కు అలవాటే..

పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు దాదాపు ప్రతి మెగా టోర్నీలోనూ ఇలాంటి ఓటములు అలవాటే. గత టీ20 వరల్డ్ కప్ లోనూ ఆ టీమ్ జింబాబ్వే చేతుల్లో ఓడింది. ఒక దశలో లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టేలా కనిపించినా.. చివరికి అనూహ్యంగా ఫైనల్ చేరి అక్కడ ఇంగ్లండ్ చేతుల్లో ఓడిపోయింది. అక్తర్ చెప్పిన 1999 వన్డే వరల్డ్ కప్ లోనూ పాకిస్థాన్ తొలి మ్యాచ్ లోనే బంగ్లాదేశ్ తో ఓడిపోయింది.

అయితే ఆ టోర్నీలోనూ ఫైనల్ చేరడం విశేషం. అక్కడ ఆస్ట్రేలియా చేతుల్లో ఓటమి తప్పలేదు. కానీ ఈసారి మరీ యూఎస్ఏ చేతుల్లో ఓటమి అంటేనే పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్రికెట్ చరిత్రలో ఆ టీమ్ తొలిసారి ఓ మెగా టోర్నీలో ఆడుతోంది. అలాంటి జట్టుపై మహామహుల్లాంటి ప్లేయర్స్ ఉన్న పాక్ ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు.

ఇలాంటి ఓటమి తర్వాత పాకిస్థాన్ టీమ్ దాయాది ఇండియాతో తలపడబోతోంది. ఈ మ్యాచ్ ఆదివారం (జూన్ 9) జరగనుంది. ఈ ఓటమితో తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాక్ టీమ్.. తనకంటే ఎంతో మెరుగ్గా ఉన్న టీమిండియాపై ఎలా ఆడుతుందో చూడాలి.

Whats_app_banner