Zim vs SL 2nd T20I: 6 బంతుల్లో 20 పరుగులు కావాలి.. జింబాబ్వే బ్యాటర్లు ఏం చేశారో చూడండి
Zim vs SL 1st T20I: శ్రీలంకపై చారిత్రక విజయం సాధించింది జింబాబ్వే. చివరి 6 బంతులకు 20 పరుగులు అవసరం కాగా.. జింబాబ్వే బ్యాటర్ ల్యూక్ జాంగ్వె రెండు సిక్స్‌లు బాది సంచలన విజయం సాధించి పెట్టాడు.
Zim vs SL 1st T20I: జింబాబ్వే చేతుల్లో శ్రీలంకకు తొలిసారి ఓ అవమానకర ఓటమి ఎదురైంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో చివరి 6 బంతులకు 20 పరుగులు అవసరం అయ్యాయి. ఇక లంక విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ ఏంజెలో మాథ్యూస్ వేసిన చివరి ఓవర్లో అద్భుతమే జరిగింది.
జింబాబ్వే బ్యాటర్ ల్యూక్ జాంగ్వె రెండు సిక్స్ లు బాది తమ టీమ్ కు చారిత్రక విజయం సాధించి పెట్టాడు. 174 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి జింబాబ్వే టీమ్ చేజ్ చేసింది. నాలుగు వికెట్లతో గెలిచి.. మూడు టీ20ల సిరీస్ ను 1-1తో సమం చేసింది. తొలి టీ20లో శ్రీలంక గెలవగా.. ఈ మ్యాచ్ గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో తొలిసారి శ్రీలంకను జింబాబ్వే ఓడించింది.
చివరి ఓవర్ సాగింది ఇలా..
శ్రీలంక ఇన్నింగ్స్ లో 66 రన్స్ చేసి హీరోగా నిలిచిన ఏంజెలో మాథ్యూస్ బౌలింగ్ లో మాత్రం విలన్ అయ్యాడు. జింబాబ్వే బ్యాటర్ ల్యూక్ జాంగ్వె 12 బంతుల్లోనే 25 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. అతనికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కడం విశేషం. అంతకుముందు బౌలింగ్ లోనూ అతడు 2 వికెట్లు తీసుకున్నాడు.
చివరి ఓవర్ తొలి బంతికే జాంగ్వె లాంగాన్ దిశగా సిక్స్ కొట్టాడు. అది నోబాల్ కూడా కావడంతో 7 పరుగులు వచ్చాయి. దీంతో టార్గెట్ 6 బంతుల్లో 13 పరుగులకు దిగి వచ్చింది. ఫ్రీహిట్ కు ఓ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత బంతికి మరో సిక్స్ బాదాడు. దీంతో చివరి 4 బంతులకు లక్ష్యంగా 3 పరుగులకు దిగి వచ్చింది. మూడో బంతికి పరుగు రాలేదు. నాలుగో బంతికి జాంగ్వె సింగిల్ తీశాడు.
దీంతో 2 బంతుల్లో 2 పరుగులు అవసరం అయ్యాయి. ఈ సమయంలో స్ట్రైక్ లో ఉన్న క్లైవ్ మడండె సిక్స్ కొట్టి ఒక బంతి మిగిలి ఉండగానే విజయం సాధించి పెట్టాడు. ఇది నమ్మశక్యం కాని విజయం అని మ్యాచ్ తర్వాత జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా అన్నాడు. అంతకుముందు ఓపెనర్ క్రెయిగ్ ఎర్విన్ కూడా 54 బంతుల్లో 70 రన్స్ చేసి జింబాబ్వేకు మంచి స్టార్ట్ ఇచ్చాడు.
టీ20ల్లో శ్రీలంకను జింబాబ్వే తొలిసారి ఓడించింది. ఈ క్రెడిట్ అంతా ఎర్విన్, జాంగ్వెలకే దక్కుతుంది. నిజానికి అంతకుముందు శ్రీలంక 27 రన్స్ కే 4 వికెట్లు కోల్పోయినా.. మాథ్యూస్, అసలంక ఐదో వికెట్ కు 118 రన్స్ జోడించడంతో లంక మంచి స్కోరు సాధించింది. కానీ జింబాబ్వే చివరి వరకూ పోరాడి విజయం సాధించడం, మొదట హీరో అనుకున్న మాథ్యూసే చివరి ఓవర్ వేసి బాధితుడవడం లంక అభిమానులకు మింగుడు పడటం లేదు.