PAK vs USA: టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం - పాకిస్థాన్‌ను ఓడించిన అమెరికా - సూపర్ ఓవర్‌లో థ్రిల్లింగ్ విక్టరీ
PAK vs USA: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌కు అమెరికా షాకిచ్చింది. సూపర్ ఓవర్‌లో పాకిస్థాన్‌పై ఐదు పరుగుల తేడాతో అమెరికా విజయం సాధించింది.
PAK vs USA: టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం నమోదైంది. గురువారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించి అమెరికా చరిత్రను సృష్టించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో పాకిస్థాన్‌పై అమెరికా పూర్తిగా ఆధిపత్యం కనబరిచింది. సూపర్ ఓవర్‌లో పాకిస్థాన్‌ను ఐదు పరుగుల తేడాతో చిత్తు చేసి వరల్డ్ కప్‌లో రెండో విక్టరీని అందుకున్నది అమెరికా.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఇరవై ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసింది. అమెరికా కూడా సరిగ్గా ఇరవై ఓవర్లలో 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో అమెరికా 18 పరుగులు చేయగా...పాకిస్థాన్ 13 పరుగులకే పరిమితమైంది. ఐదు పరుగుల తేడాతో అమెరికా చేతిలో ఓటమి పాలైంది.
బాబర్ ఆజాం, షాబాద్ ఖాన్...
కెప్టెన్ బాబర్ ఆజాం, షాబాద్ ఖాన్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫలం కావడంతో పాకిస్థాన్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 159 పరుగులు సాధించింది. బాబర్ ఆజాం 43 బాల్స్‌లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 44 రన్స్ చేశాడు.
షాబాద్ ఖాన్ 25 బాల్స్‌లో నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 45 పరుగులతో రాణించడంతో పాకిస్థాన్ ఈ మాత్రమైనా స్కోరు చేసింది. చివరలో షాహిన్ అఫ్రిదీ 16 బాల్స్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 23 రన్స్ చేసి పాకిస్థాన్ స్కోరును 150 పరుగులు దాటించాడు. అమెరికా బౌలర్లలో నోస్తూస్ కెంజీగే మూడు, నేత్రవల్కర్ రెండు వికెట్లతో రాణించారు.
మోనాంక్ పటేల్ హాఫ్ సెంచరీ...
160 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన అమెరికా విజయం కోసం చివరి వరకు పోరాడింది. కెప్టెన్ మోనాంక్ పటేల్ హాఫ్ సెంచరీ తో (38 బాల్స్‌లో ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో యాభై పరుగులు) అదరగొట్టాడు. ఆండ్రీస్ గౌస్ 35, ఆరోన్ జోన్స్ 36 పరుగులు చేయడంతో అమెరికా విజయం దిశగా సాగింది.
చివరి ఓవర్‌లో అమెరికా విజయానికి పదిహేను పరుగులు కావడంతో మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. హరీస్ రౌఫ్ వేసిన లాస్ట్ ఓవర్ తొలి ఐదు బంతులకు అమెరికా పది పరుగులు చేసింది. లాస్ట్ బాల్‌కు నితీష్ కుమార్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్ టైగా మారింది. చివరి ఓవర్‌లో అరోన్ జోన్స్ ఇచ్చిన క్యాచ్‌ను అఫ్రిదీ మిస్ చేయడంతో పాకిస్థాన్ మూల్యం చెల్లించుకుంది. ఆ తర్వాతి బాల్‌నే అరోన్ సిక్స్‌గా బాదాడు.
సూపర్ ఓవర్‌లో...
సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా ఓ వికెట్ నష్టానికి పద్దెనిమిది పరుగులు చేసింది. మహ్మద్ అమీర్ వేసిన సూపర్ ఓవర్‌లో వైడ్స్ ద్వారానే అమెరికాకు ఏడు పరుగులు వచ్చాయి. సూపర్ ఓవర్‌లో 19 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ కేవలం 13 పరుగులే చేసింది. నేత్రవాల్కర్ అద్భుతంగా బౌలింగ్ చేసి అమెరికాకు విజయం అందించాడు. పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్‌లో టీమిండియాతో తలపడనుంది.