T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా బోణీ - కెనడాపై ఘన విజయం - పది సిక్సర్లు కొట్టిన ఆరోన్ జోన్స్
T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా బోణీ కొట్టింది. ఓపెనింగ్ మ్యాచ్‌లో కెనడాపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అమెరికా బ్యాట్స్‌మెన్ అరోన్ జోన్స్ ఏకంగా పది సిక్సర్ల బాది కెనడా బౌలర్లకు చుక్కలు చూపించాడు.
T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో ఆతిథ్య అమెరికా బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో కెనడాపై ఏడు వికెట్ల తేడాతో అమెరికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెనడా 194 పరుగులు చేయగా...ఈ టార్గెట్‌ను అమెరికా 17.4 ఓవర్లలోనే ఛేదించింది. అమెరికా బ్యాట్స్‌మెన్ అరోన్ జోన్స్ ఏకంగా పది సిక్సులు బాది రికార్డ్ క్రియేట్ చేశాడు.
నవనీత్ హాఫ్ సెంచరీ...
ఓపెనింగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 194 పరుగులుచేసింది. ఓపెనర్ నవనీత్ ధనివాల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 44 బాల్స్‌లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. అరోన్ జోన్స్ 21 పరుగులతో రాణించడంతో కెనడాకు మంచి ఆరంభం దక్కింది.
మిడిల్ ఆర్డర్‌లో నికోలస్ కిర్టన్, శ్రేయాస్ మొవ్వా ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అదరగొట్టడంతో కెనడా భారీ స్కోరు చేసింది. కిర్టన్ 31 బాల్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 51 రన్స్ చేశాడు. శ్రేయాస్ మొవ్వా 16 బాల్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 రన్స్‌తో రాణించాడు. అమెరికా బౌలర్లలో హర్మీత్ సింగ్, కోరే అండర్సన్, అలీఖాన్‌లకు తలో ఓ వికెట్ దక్కింది.
పది సిక్సర్లు...
ఆరోన్ జోన్స్ మెరుపులతో కెనడా విధించిన భారీ టార్గెట్‌ను మరో పదిహేను బాల్స్ మిగిలుండగానే అమెరికా ఛేదించింది. స్కోరు బోర్డు సున్నా వద్దే తొలి వికెట్‌ను కోల్పోయింది అమెరికా. స్టీవెన్ టేలర్ ఇన్నింగ్స్ రెండో బంతికే పెవిలియన్ చేరుకున్నాడు. కెప్టెన్ మోనాంక్ పటేల్ కూడా 16 పరుగులు మాత్రమే చేసి ఔటవ్వడంతో అమెరికా ఈ మ్యాచ్‌లో గెలవడం కష్టమే అనిపించింది.
మోనాంక్ పటేల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అరోన్ జోన్స్ కెనడా బౌలర్లకు చక్కులు చూపించాడు. ఎడాపెడా సిక్సర్లు బాదాడు. అరోన్ జోన్స్‌తో పాటు అండ్రీస్ గోస్ కూడా బ్యాట్ ఝులిపించడంతో అమెరికా ఈజీగా టార్గెట్‌ను ఛేదించింది.
40 బాల్స్‌లో 94 రన్స్...
ఈ మ్యాచ్‌లో అరోన్ జోన్స్ 40 బాల్స్‌లోనే పది సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 94 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. ఆండ్రీస్ గోస్ 46 బాల్స్‌లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 65 రన్స్ చేశాడు. వీరిద్దరి మెరుపులతో 17.4 ఓవర్లలోనే 197 పరుగులు చేసిన అమెరికా టార్గెట్‌ను ఛేదించింది. కెనడా బౌలర్లలో హేలింగర్ మినహా మిగిలిన వారు ధారాళంగా పరుగులు ఇచ్చారు. హేలింగర్ మూడు ఓవర్లలో పంతొమ్మిది పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు.
తొలి మ్యాచ్‌లోనే విజయం...
టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనడం అమెరికాకు ఇదే తొలిసారి. ఆతిథ్య దేశం హోదాలో బెర్తును దక్కించుకున్న అమెరికా తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి రికార్డ్ నెలకొల్పింది.
రికార్డులపై వెస్టిండీస్ కన్ను...
ఆదివారం మరో మ్యాచ్‌లో పపువా న్యూ గినియాతో వెస్టిండీస్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రికార్డులపై వెస్టిండీస్ కన్నేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 257 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.