Dale Steyn: బౌలింగ్ అలా కాదు ఇలా చేయాలి: సౌతాఫ్రికా లెజెండరీ బౌలర్‌కే అమెరికా సిబ్బంది బౌలింగ్ పాఠాలు
Dale Steyn: ప్రపంచ క్రికెట్ ను ఏలిన ఓ లెజెండరీ బౌలర్ కే అమెరికాలోని సిబ్బంది బౌలింగ్ పాఠాలు చెప్పడం విశేషం. టీ20 వరల్డ్ కప్ ప్రాక్టీస్ సెషన్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Dale Steyn: సౌతాఫ్రికా లెజెండరీ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ ఎవరో తెలియని క్రికెట్ అభిమాని ఉంటాడా? అంతటి బౌలర్ కు కూడా ఓ సాధారణ వ్యక్తి బౌలింగ్ పాఠాలు చెప్పడం ఎక్కడైనా చూశారా? టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న అమెరికాలో అది జరిగింది. స్టెయిన్ ను గుర్తు పట్టని నెట్స్ లోని ఓ వ్యక్తి.. అతనికి బౌలింగ్ ఎలా చేయాలో చెబుతున్న వీడియో వైరల్ అయింది.
డేల్ స్టెయిన్‌కు బౌలింగ్ పాఠాలు
సౌతాఫ్రికా తరఫునే కాదు ప్రపంచ క్రికెట్ లోని అత్యుత్తమ పేస్ బౌలర్లలో డేల్ స్టెయిన్ ఒకడు. తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో మరుపురాని అనుభూతులను అతడు సొంతం చేసుకున్నాడు. క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు అతనిది. కానీ క్రికెట్ అంటే పెద్దగా తెలియని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో స్టెయిన్ ను గుర్తు పట్టని వాళ్లు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు.
టీ20 వరల్డ్ కప్ 2024కు వెస్టిండీస్ తో కలిసి అమెరికా కూడా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నెట్స్ లో అక్కడి సిబ్బందిలో ఒకరు స్టెయిన్ కు బౌలింగ్ ఎలా చేయాలో చెప్పాడు. బాల్ విసిరే సమయంలో మోచేతిని వంచకూడదని, ఓసారి బౌన్స్ అయిన తర్వాత స్టంప్స్ వరకు వెళ్లాలని చెప్పడం ఆ వీడియోలో చూడొచ్చు.
అంతటి లెజెండరీ బౌలర్ అయినా కూడా స్టెయిన్ అతడు బౌలింగ్ పాఠాలను సీరియస్ గా విన్నాడు. అతడు చెప్పినట్లే నెట్స్ లో బంతి విసరడానికి ప్రయత్నించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం స్టెయిన్ వరల్డ్ కప్ కామెంటరీ ప్యానెల్లో సభ్యుడిగా ఉన్నాడు. సరదాగా నెట్స్ దగ్గరికి వెళ్లగా అతనికి ఈ వింత అనుభవం ఎదురైంది.
స్టెయిన్ కెరీర్ ఇలా?
సౌతాఫ్రికా పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ 2004లో ఇంగ్లండ్ పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. ప్రపంచ టెస్టు ర్యాంకుల్లో నంబర్ వన్ గా ఎదిగాడు. మొత్తం 93 టెస్టుల్లో 439 వికెట్లు తీసుకున్నాడు. 2021లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతకుముందు 2019లో శ్రీలంకపై తన చివరి టెస్ట్ ఆడాడు. కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా అతని సొంతమయ్యాయి.
2008లో ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచాడు. ఇక 2013లో విజ్డన్ లీడింగ్ క్రికెటర్ అవార్డు అందుకున్నాడు. అంతేకాదు 2008 నుంచి 2014 వరకు ఏకంగా 263 వారాల పాటు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ బౌలర్ గా ఉన్నాడు. సౌతాఫ్రికా తరఫున అతడు 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. ఐపీఎల్లో ఆర్సీబీ, డెక్కన్ ఛార్జర్స్, సన్ రైజర్స్, గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు.