T20 World Cup 2024 Upsets: ఈ ప్రపంచకప్‍లో ఇప్పటికే మూడు సంచలనాలు.. అవాక్కయ్యేలా చేసిన మ్యాచ్‍లు
T20 World Cup 2024 Upsets: టీ20 ప్రపంచకప్ 2024లో సంచలనాల మోత మోగుతోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‍లు అందరినీ స్టన్ చేశాయి. ఇందులో రెండు ఆశ్చర్యపరిచాయి. ఆ మ్యాచ్‍లు ఇవే.
T20 World Cup 2024 Upsets: టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో అప్పుడే సంచలనాలు నమోదయ్యాయి. జూన్ 2న ఈ టోర్నీ ప్రారంభం కాగా.. ఆరు రోజుల్లోనే మూడు అనూహ్య విజయాలు వచ్చాయి. అది కూడా చివరి రెండు రోజుల్లోనే ఈ మూడు సంచలనాల మోత మోగింది. ఆ మ్యాచ్‍లు వివరాలివే..
పాక్‍కు షాక్ ఇచ్చిన అమెరికా
ప్రస్తుత టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో పాకిస్థాన్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. గత ఎడిషన్ రన్నరప్‍గా టోర్నీలోకి అడుగుపెట్టిన పాక్.. ఎవరూ ఊహించని విధంగా అమెరికా టీమ్ చేతిలో పరాభవం చెందింది. సూపర్ ఓవర్ ఓవర్ వరకు వెళ్లి మరీ పాక్ ఓడిపోయింది. చెత్త ప్రదర్శనతో ఆశ్చర్యపరిచింది. గ్రూప్-ఏలో భాగంగా జూన్ 6న జరిగిన మ్యాచ్‍లో అమెరికాపై పాకిస్థాన్ ఓడిపోయింది.
ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 159 రన్స్ చేయగా.. లక్ష్యఛేదనలో అమెరికా కూడా అన్నే పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్‌కు మ్యాచ్ చేరింది. సూపర్ ఓవర్లో తొలుత అమెరికా 18 పరుగులు చేయగా.. పాకిస్థాన్ 13 రన్స్ మాత్రమే చేసి ఓడింది. ఇలా ఈ ఏడాది ప్రపంచకప్‍లో భారీ సంచలనం నమోదైంది.
కివీస్‍ను కుప్పకూల్చిన అఫ్గాన్
ఈ ప్రపంచకప్‍లో నేడు (జూన్ 8) మరో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా భావిస్తున్న న్యూజిలాండ్‍ను.. అఫ్గానిస్థాన్ చిత్తుగా ఓడించింది. ఏకంగా 84 పరుగుల తేడాతో కివీస్‍పై అఫ్గాన్ గెలిచింది. అందరూ అవాక్కయ్యేలా విజృభించింది. గయానా వేదికగా ఈ గ్రూప్ సీ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 6 వికెట్లకు 159 పరుగులు చేసింది.
అయితే, లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ బ్యాటర్లను అఫ్గానిస్థాన్ బౌలర్లు ఆటాడుకున్నారు. దీంతో కివీస్ 75 పరుగులకే ఆలౌటైంది. గ్లెన్ ఫిలిప్ (18), మ్యాట్ హెన్రీ (12) మినహా మిగిలిన పది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‍కే పరిమితమయ్యారు. అఫ్గాన్ బౌలర్లు ఫజల్లాహక్ ఫరూకీ, రషీద్ ఖాన్ చెరో నాలుగు వికెట్లతో కివీస్‍ను దెబ్బకొట్టారు. నబీ రెండు వికెట్లు తీసుకున్నారు. మొత్తంగా బలమైన న్యూజిలాండ్‍పై ఏకంగా 84 పరుగుల భారీ తేడాతో గెలిచి అప్గాన్ భారీ షాకిచ్చింది.
ఐర్లాండ్‍కు కెనడా దెబ్బ
పేపర్‌పై చూస్తే కెనడా కన్నా ఐర్లాండ్ బలమైన జట్టుగా ఉంది. దీంతో ఆ టీమ్‍పై పెద్దగా అంచనాలు లేవు. అయితే, కెనడా మాత్రం విజృభించింది. ఐర్లాండ్‍ను ఓడించి.. అదరగొట్టింది. జూన్ 7న న్యూయార్క్ వేదికగా జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‍లో కెనడా 12 పరుగుల తేడాతో ఐర్లాండ్‍ను ఓడించింది. టీ20 ప్రపంచకప్‍లో తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.
ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా 7 వికెట్ల తేడాతో 137 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 7 వికెట్లకు 125 పరుగులే చేయగలిగింది. దీంతో కెనడా అదిరిపోయే విజయాన్ని సాధించింది.
శ్రీలంకపై నేడు (జూన్ 8) బంగ్లాదేశ్ విజయం సాధించింది. అయితే, ప్రస్తుతం బలాబలాలపరంగా ఈ రెండు జట్లు ఒకేలా అనిపిస్తున్నాయి. దీంతో దీన్ని పెద్ద అప్‍సెట్‍గా పరిగణించాల్సిన అవసరం లేదు.
టీ20 ప్రపంచకప్ మెగాటోర్నీ వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగుతోంది. జూన్ 29న వరకు సాగనుంది. 20 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రస్తుతం గ్రూప్ దశ మ్యాచ్‍లు జరగుతున్నాయి. ఆ తర్వాత నాలుగు గ్రూప్‍ల్లో టాప్‍లో నిలిచే ఎనిమిది జట్లు సూపర్-8 చేరతాయి.