AFG vs NZ World Cup: వరల్డ్ కప్‌లో 75 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ - టైటిల్ ఫేవరెట్‌కు షాకిచ్చిన అప్ఘనిస్తాన్
AFG vs NZ World Cup: టీ20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం నమోదైంది. అప్ఘనిస్థాన్ చేతిలో న్యూజిలాండ్ 84 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో అప్ఘనిస్థాన్ 159 పరుగులు చేయగా...న్యూజిలాండ్ 75 పరుగులకే కుప్పకూలింది.
AFG vs NZ World Cup: 2024 టీ20 వరల్డ్ కప్ టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా బరిలో దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభ పోరులోనే షాక్ తగిలింది. గురువారం అప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ చిత్తుగా ఓడింది. అప్ఘన్ బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ 75 పరుగులకే ఆలౌటైంది. అప్ఘనిస్తాన్ చేతిలో 84 పరుగులతో ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 15.2 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.
గుర్భాజ్ మెరుపు బ్యాటింగ్...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ అప్ఘనిస్తాన్... ఓపెనర్ రహ్మతుల్లా గుర్భాజ్ మెరుపులతో 159 రన్స్ చేసింది. గుర్భాజ్‌తో పాటు ఇబ్రహీం జర్ధాన్ రాణించడంలో అప్ఘన్ భారీ స్కోరు చేసేలా కనిపించింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యం జోడించారు. గుర్భాజ్ న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగగా...జర్ధాన్ మాత్రం నిదానంగా ఆడాడు. గుర్భాజ్ 56 బాల్స్‌లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 80 రన్స్ చేశాడు.
జర్ధాన్ 41 బాల్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 44 రన్స్‌తో చేసి ఔటయ్యాడు. అమ్జదుల్లా కూడా 13 బాల్స్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 22 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. కానీ ఈ ముగ్గురు ఔటైన తర్వాత మిగిలిన వికెట్లను చకచకా కోల్పోయింది అప్ఘన్. ఆరంభంలో తేలిపోయిన న్యూజిలాండ్ బౌలర్లు చివరల్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఇరవై ఓవర్లలో అరు వికెట్ల నష్టానికి 159 పరుగుల వద్ద అప్ఘన్ ఇన్నింగ్ ముగిసింది. బౌల్ట్, హెన్రీ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
సున్నా రన్స్‌కే వికెట్
160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్‌కు సున్నా పరుగుల వద్దే షాక్ తగిలింది. ఇన్నింగ్ తొలి బంతికే ఫిన్ అలెన్‌ను పెవిలియన్‌కు పంపించాడు అప్ఘన్ పేసర్ ఫరూఖీ. ఆ తర్వాత కూడా ఫరూఖీ తన జోరును కొనసాగించాడు. అతడి పేస్ దెబ్బకు న్యూజిలాండ్ నలభై పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డది. ఆ తర్వాత రషీద్ ఖాన్ ఎంట్రీతో న్యూజిలాండ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 15.2 ఓవర్లలోనే 75 పరుగుల వద్ద న్యూజిలాండ్ కథ ముగిసింది.
ఇద్దరే డబుల్ డిజిట్ స్కోర్…
న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ 18 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి తర్వాత మ్యాట్ హెన్నీ 17 పరుగులు చేశాడు. వీరిద్దరు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరును అందుకున్నారు. అప్ఘనిస్థాన్ బౌలర్లలో ఫరూఖీ, రషీద్ ఖాన్ తలో నాలుగు వికెట్లు తీసుకున్నారు. మహ్మద్ నబీకి రెండు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో అప్ఘన్ బ్యాటర్లు తొమ్మిది సిక్స్‌లు కొట్టగా...న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఒకే ఒక సిక్స్ నమోదైంది.
ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటికే పాకిస్థాన్‌కు పసికూన అమెరికా షాకిచ్చింది. తొలిసారి వరల్డ్ కప్ ఆడుతోన్న అమెరికా...అగ్ర జట్టు పాకిస్థాన్‌ను సూపర్ ఓవర్‌లో ఓడించింది. ఈ మ్యాచ్ మరువక ముందే అప్ఘనిస్థాన్ చేతిలో న్యూజిలాండ్ ఓటమి పాలైంది.