Kalki Review: కల్కి రివ్యూ - భీమ్లానాయక్ హీరోయిన్ మలయాళం యాక్షన్ మూవీ ఎలా ఉందంటే?
Kalki Review: టోవినో థామస్ హీరోగా నటించిన కల్కి మూవీ తెలుగులో ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రవీణ్ ప్రభరాజ్ దర్శకత్వం వహించాడు.
Kalki Review: టోవినో థామస్, సంయుక్త మీనన్ (Samyuktha Menon) ప్రధాన పాత్రల్లో నటించిన కల్కి మూవీ ఇటీవల ఈటీవీ విన్ ఓటీటీ (Etv Win OTT) ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ప్రవీణ్ ప్రభరామ్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో హిట్టైన ఈ మూవీ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పిస్తోందా? లేదా? అంటే?
పోలీస్ ఆఫీసర్ కల్కి...
నెంజన్‌కొట్ట ఎస్ఐ వైశాఖ్ (ఇర్షాద్) పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్య చేసుకుంటాడు. అతడి స్థానంలో ఎస్ఐగా ఆ ఊరికి కల్కి (టోవినో థామస్) వస్తాడు. వచ్చి రావడంతోనే రౌడీల పనిపడతాడు కల్కి. నెంజన్‌కొట్ట ఊరిలో అమర్‌నాథ్ (శివజీత్ పద్మనాభన్) చెప్పిందే వేదం. తన తమ్ముడు అప్పుతో పాటు ఉమర్ (హరీష్ ఉత్తమన్) అనే రౌడీతో కలిసి నెంజన్‌కొట్టను ఏలుతుంటాడు అమర్‌నాథ్.
తనకు ఎదురుతిరిగిన వారిని దారుణంగా చంపేస్తుంటాడు. అమర్‌నాథ్‌కు భయపడి నెంజన్‌కొట్ట ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి ఊరవతల గుడిసెల్లో తలదాచుకుంటుంటారు. కల్కి ఊరిలో అడుగుపెట్టిన టైమ్‌లో ఎన్నికలు జరుగుతుండటంతో అమర్‌నాథ్, అపోజిషన్ పార్టీకి గొడవలు మొదలవుతాయి.
తన తమ్ముడికి పోటీగా ఎన్నికల్లో నిలబడిన వారిని అమర్‌నాథ్ చంపేస్తుంటాడు. అమర్‌నాథ్ ఆధిపత్యాన్ని ఎదురించి నెంజన్‌కొట్టలో కల్కి తన డ్యూటీని ఎలా చేశాడు? ఉమర్‌తో పాటు అప్పులకు కల్కి ఎలాంటి శిక్ష విధించాడు? అమర్‌నాథ్ గ్యాంగ్‌లో పనిచేసే డాక్టర్ సంగీత (సంయుక్త మీనన్) ఎవరు? కల్కికి సపోర్ట్ చేసిన పోలీసులను ఎలా చనిపోయారు? కల్కి అండతోఊరి ప్రజలు తిరిగి తమ ఇళ్లలోకి వచ్చారా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
మాస్‌కు రీచ్ ఎక్కువ...
లవ్, రొమాన్స్, థ్రిల్లర్ జానర్స్ తో పోలిస్తే మాస్ సినిమాలకు రీచ్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి భాషలో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమాల్లో ఎక్కువగా మాస్ కథలే కనిపిస్తుంటాయి. అందుకే హీరోలందరూ మాస్ ఇమేజ్‌ను కోరుకుంటారు. మాస్ కథల్లో తమను తాము చూసుకోవాలని ఉబలాటపడుతుంటాడు. మలయాళంలో టోవినో థామస్ కామెడీ థ్రిల్లర్ కథలతో హీరోగా పాన్ ఇండియన్ ప్రేక్షకులకు చేరువయ్యాడు. తన పంథాలో ప్రయోగాలు చేస్తూనే అడపాదడపా కల్కి లాంటి మాస్ కథలతో సినిమాలు చేస్తున్నాడు.
ఫక్తు కమర్షియల్ మూవీ...
కల్కి మూవీని ఫక్తు మాస్ కమర్షియల్ మూవీగా దర్శకుడు ప్రవీణ్ ప్రభరామ్ తెరకెక్కించాడు. ఈ మూవీ కోసం దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం భూతద్దం పెట్టి వెతికిన కనిపించదు.
ఊరిని తన గుప్పిట్లో పెట్టుకున్న రౌడీ, అతడి అన్యాయాలకు నలిగిపోతున్న ప్రజలను కాపాడటానికి కొత్తగా పోలీస్ ఆఫీసర్ రావడం, ఇద్దరి మధ్య పోరాటం…చివరకు విలన్‌ను హీరో చంపడం అనే పాయింట్‌ను ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడేశారు మన దర్శకులు. కల్కి కూడా అలాంటి రొటీన్ టెంప్లేట్ కమర్షియల్ మూవీనే.
కానీ ఇలాంటి సినిమా నుంచి మాస్ ఆడియెన్స్ ఏం కోరుకుంటున్నారో దర్శకుడు అవన్నీ ఫుల్‌గా దట్టించేశాడు డైరెక్టర్. ప్రతి పది నిమిషాలకు ఓ ఎలివేషన్ సీన్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో సినిమా సాగుతుంది.
రఫ్ అండ్ టఫ్...
సాధారణంగా పోలీస్ కథల్లో హీరో నితీనిజాయితీల కోసం పోరాడేవాడుగా కనిపిస్తుంటాడు. కల్కి మూవీ కోసం ఆ పడికట్టు ఫార్ములాను పక్కనపెట్టేశాడు డైరెక్టర్. రఫ్ అండ్ టఫ్ ఆటిట్యూడ్, టిపికల్ క్యారెక్టరైజేషన్‌తో కల్కి పాత్రను డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్. అదే ఈ రొటీన్ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
హీరోయిన్ లేదు...
హీరోను దెబ్బకొట్టడానికి విలన్ ప్లాన్స్‌లు వేయడం....వాటిని కల్కి తన టీమ్‌తో కలిసి తిప్పికొట్టేసీన్స్ చాలా సినిమాల్లో చూసినవే అయినా టోవినో థామస్ యాక్టింగ్ వల్ల కొత్తగా అనిపిస్తాయి. ఈ సినిమా కోసం దర్శకుడు వాడిన మరో ట్రిక్ ఏంటంటే... ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ లేదు. సంయుక్త మీనన్ ఉన్నా...విలన్ గ్యాంగ్‌లో ఓ మెంబర్‌గానే చూపించాడు. ఇద్దరి మధ్య గట్టిగా ఓ రెండు సీన్స్ కూడా ఉండవు. లవ్ ట్రాక్, రొమాంటిక్ సీన్స్‌ను ఇరికించి కథను పక్కదారి పట్టించే ప్రయత్నం దర్శకుడు చేయకపోవడం బాగుంది.
మాస్ క్యారెక్టర్‌లో...
కల్కి గా మాస్ క్యారెక్టర్‌లో టోవినో థామస్ లుక్, బాడీలాంగ్వేజ్ బాగున్నాయి. చివరి వరకు ఒకే టెంపోను మెయింటేన్ చేస్తూ ఇంటెన్స్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌కు తక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కు ఎక్కువ అన్నట్లుగా సంయుక్త మీనన్ క్యారెక్టర్ సాగుతుంది. ఆమె డబ్బింగ్ కూడా సరిగ్గా నప్పలేదు. హీరోకు ధీటుగా విలన్ క్యారెక్టర్స్‌ను బలంగా డిజైన్ చేసుకోలేదు. ఉన్నంతలో హరీష్ ఉత్తమన్ పర్వాలేదనిపించాడు. పోలీస్ కానిస్టేబుల్ పాత్రలు చేసిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
మాస్ వర్గాలను మెప్పించే కల్కి…
కల్కి మాస్ సినిమా లవర్స్‌ను మెప్పిస్తుంది. టోవినో థామస్ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లో కోసం ఈ సినిమా చూడొచ్చు.