Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతం, బ్యారేజీలను పరిశీలించిన జస్టిస్ చంద్రఘోష్
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతం అయ్యింది. ఎన్డీఎస్ఏ నివేదిక మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ చేపట్టారు.
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతం అయ్యింది. నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే రెండు పర్యాయాలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందళ్ల బ్యారేజీలను సందర్శించి లోపాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నివేదిక ప్రకారం ప్రభుత్వం బ్యారేజ్ ల రక్షణ, పునఃరుద్దరణ పనులను మూడు ఏజన్సీల ద్వారా చేపట్టి, లోపాలపై చర్యలు తీసుకునేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ తో విచారణ చేపట్టారు. జస్టిస్ చంద్ర ఘోష్ శనివారం పెద్దపల్లి జిల్లా సుందిళ్ల పార్వతి బ్యారేజీని సందర్శించి బ్యారేజీలో చేపట్టిన మరమ్మత్తు పనులను పరిశీలించారు. మేడిగడ్డ , అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై విచారణలో భాగంగా సుందిళ్ల బ్యారేజీని సందర్శించినట్లు తెలిపారు. బ్యారేజీని క్షుణ్ణంగా పరిశీలించి జరుగుతున్న పనులు, వినియోగించిన మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. పార్వతి బ్యారేజీ సందర్శన అనంతరం అన్నారం సరస్వతి బ్యారేజీ, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలను సందర్శించి పరిశీలించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎన్డీఎస్ఏ, జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చే నివేదికల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజీలో సీఎస్ఎం ఆర్ఎస్ పరీక్షలు జరిగాయి.
ఈనెలాఖరులోగా మరమ్మతు పనులు పూర్తి చేసేలా చర్యలు
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో పిల్లర్లు కుంగడం, అన్నారం సరస్వతి, సుందిళ్ల పార్వతి బ్యారేజీలలో సీపేజీల లీకేజీలపై మరమ్మత్తు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పనులను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం పరిశీలించి 15 రోజుల్లోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నారం, మేడిగడ్డ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, సుందిళ్లలో నడకన పనులు సాగుతుండడంతో అధికారులు సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేయింబవళ్లు పనులు చేస్తేనే వరదలు వచ్చేలోపు బ్యారేజీల మరమ్మతు, పునరుద్ధరణ పూర్తవుతాయని అధికారులకు స్పష్టం చేశారు.
వరదలతో అన్నారం బ్యారేజీకి ముప్పు
ఏటా వరదల సమయంలో అన్నారం బ్యారేజీలో అప్ ప్లామ్, డౌన్ ప్లామ్ లలో లాంచింగ్ ఆస్ట్రాన్లు, సీసీ బ్లాకులు దెబ్బతింటున్నాయని అధికారులు నివేదించారు. డిజైన్ల లో లోపాల వల్ల వరదలు వచ్చే సమయంలో గేట్లు తెరిచేటప్పుడు ప్రవాహవేగంతో సమస్య ఉత్పన్నమవుతుందని అధికారులు నివేదించారు. సిమెంట్ కాంక్రీట్ బ్లాకుల స్థానంలో సిమెంట్ బెంట్నెట్ గ్రౌటింగ్ తో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అఫ్కాన్ ప్రతినిధులు తెలిపారు. ఇక అన్నారం బ్యారేజీపై పార్సన్ సంస్థ నివేదిక తప్పుల తడకగా ఉందని చెప్పిన ఈఎన్సీ.. మరమ్మతులన్నీ ఎన్డీఎస్ఏ సిఫారసుల ప్రకారమే జరగాలని నిర్మాణ సంస్థకు సూచించారు.
కరకట్ట గండి పూడ్చివేత
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు సుందిళ్ల పార్వతీ బ్యారేజీ సమీపంలోని కరకట్టకు పడిన గండిని అధికారులు పూడ్చివేశారు. 2022 జులై7 17న గోదావరిలో వచ్చిన వరదలకు కరకట్టకు గండి పడింది. బ్యారేజీ సీసీ బ్లాక్ ల లెవెలింగ్, సిమెంట్ దిమ్మెలను సరిచేయడం వంటి పనుల్లో భాగంగా కరకట్టపై పడిన గండిని పొక్లెయిన్ సహాయంతో మట్టితో పూడ్చివేశారు. వర్షాలకు కరకట్టకు మళ్లీ గండి పడకుండా ముందు జాగ్రత్తగా బండరాళ్లు పెడుతున్నారు.
HT Telugu ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి
సంబంధిత కథనం