TS GOM Medigadda Visits: మేడిగడ్డ, అన్నారంలలో తెలంగాణ మంత్రుల పర్యటన-a team of telangana ministers examining medigadda and annaram projects ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Gom Medigadda Visits: మేడిగడ్డ, అన్నారంలలో తెలంగాణ మంత్రుల పర్యటన

TS GOM Medigadda Visits: మేడిగడ్డ, అన్నారంలలో తెలంగాణ మంత్రుల పర్యటన

Sarath chandra.B HT Telugu
Dec 29, 2023 12:31 PM IST

TS GOM Medigadda Visit: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టులో తెలంగాణ మంత్రుల బృందం పరిశీలిస్తోంది. ప్రాజెక్టును నిర్మించిన వారే మేడిగడ్డ,అన్నారం వైఫల్యాలకు బాధ్యత వహించాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు.

మేడిగడ్డలో తెలంగాణ మంత్రుల పర్యటన
మేడిగడ్డలో తెలంగాణ మంత్రుల పర్యటన

TS GOM Medigadda Visit: కాళేశ్వరం ప్రాజెక్టులో నిజానిజాలు ప్రజల ముందు బయట పెడతామని తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ మంత్రుల బృందం మేడిగడ్డ సందర్శనకు వచ్చారు. మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు మేడిగడ్డలో పర్యటిస్తున్నారు.

మేడిగడ్డ నిర్మాణంపై అధికారులు రూపొందించిన పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్‌ పరిశీలించాారు. ఈ ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ ప్రాజెక్టు కుంగింది. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం కట్టిన మూడేళ్ల కే కుంగిపోవడం ప్రభుత్వానికి అవమానకరం అన్నారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై పూర్తిగా రివ్యూ చేస్తామన్నారు. లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులకు నిర్మించిన వారిదే బాధ్యత ఉంటుందన్నారు. సమీక్షకు ఎల్‌ అండ్‌ టి సంస్థ ప్రతినిధులను కూడా సమావేశానికి పిలిపించినట్టు చెప్పారు.

ప్రాజెక్టులు ఎవరు కట్టారో వారే వాటి నాణ్యతకు బాధ్యత వహించాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇంత భారీ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను ఖచ్చితంగా బయట పెడతామని చెప్పారు.

మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోవడంతో నీటిని నిల్వ చేయడానికి వీల్లేకుండా పోయింది. నదిలో ఉన్న నీటిని మొత్తం దిగువకు వదిలేయాల్సి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నారంలో సైతం నీటి బుగ్గలు రావడంపై మంత్రులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనున్నారు.

నిర్మాణంలో లోపాలు, డిజైన్లలో లోపాలు ఉన్నాయా అని పరిశీలిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. డిజైన్‌ లోపాలు, నిర్మాణ సంస్థ లోపాలు ఉన్నాయా అనేది కూడా నిగ్గు తేలుస్తామన్నారు.

కాళేశ్వరం నిర్మించిన అధికారులతోనే ఎల్‌ అండ్‌ కార్యాలయంలో సమీక్ష ఏర్పాటు చేశారు. పవర్ పాయింట్ తర్వాత కుంగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. మరోవైపు ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోయిన ప్రాంతాన్ని మీడియాను అనుమతించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాన్ని ప్రజలకు తెలియ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని స్పష్టం చేశారు. నిర్మాణ లోపాలను ప్రజలకు వివరించాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఆర్ధిక పరిస్థితి, విద్యుత్‌పై శ్వేతపత్రాలు విడుదల చేసినట్టే లక్ష కోట్ల సాగు నీటి ప్రాజెక్టుల వ్యవహారాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మేడిగడ్డ వైఫల్యానికి తమ బాధ్యత లేదనే ఎల్‌ అండ్‌ టి వాదన విషయంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడిగడ్డ సందర్శనకు వచ్చిన రాహుల్ గాంధీ సమక్షంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.

గత ప్రభుత్వ హయంలో మేడిగడ్డ ఘటనలో కుట్ర ఉందని కేసులు పెట్టారని, వాస్తవ పరిస్థితిని తెలుసుకోడానికి తాము వచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వాస్తవ పరిస్థితిని తెలంగాణ ప్రజలకు తెలియ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. కేటీఆర్‌ చిన్న విషయం అంటున్నారని, ఆ విషయాలను బయటకు తీస్తామని, అన్ని ప్రజల ముందు ఉంచుతామన్నారు. ఏమి జరిగిందో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.

Whats_app_banner