Ration Rice Seized : కాళేశ్వరం వద్ద భారీగా రేషన్ బియ్యం పట్టివేత - మహారాష్ట్రకు తరలిస్తున్న వాహనాలు సీజ్
Ration Rice Seized at Kaleshwaram: అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు పోలీసులు. రెండు లారీలు, రెండు బోలేరో ట్రాలీ వాహనాలను పట్టుకోగా… నలుగురిపై కేసు నమోదు చేశారు.
Ration Rice Seized: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో కాళేశ్వరం వద్ద భారీగా రేషన్ బియ్యం(Ration Rice Seized at Kaleshwaram) పట్టుబడ్డాయి. స్థానిక అధికారుల కళ్లుగప్పి అక్రమంగా రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్న రెండు లారీలు, మరో రెండు బొలేరో ట్రాలీ వాహనాలను హైదరాబాద్ కు చెందిన సివిల్ సప్లై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. సుమారు 900 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని, వాహనాలను సీజ్ చేసి, నలుగురిపై కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు, వాహనాలను, నలుగురు నిందితులను మహాదేవ్ పూర్ పోలీసులకు అప్పగించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి టన్నుల కొద్ది బియ్యం సరిహద్దుల దాటి మహారాష్ట్ర కు తరలి పోయినా స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ కు చెందిన అధికారులు దాడులు చేసి భారీ మొత్తంలో బియ్యాన్ని పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.
యథేచ్చగా బియ్యం తరలింపు…!
మహారాష్ట్ర లో అమలవుతున్న చట్టం అక్రమార్కులకు చుట్టంగా మారింది. ఆదాయ వనరుగా మార్చుకుని తెలుగు రాష్ట్రాల నుండి లారీల కొద్ది రేషన్ బియ్యం తరలించడం నిత్యకృత్యంగా మారింది. అందుకు అంతరాష్ట్ర సరిహద్దు కాళేశ్వరం వద్ద గోదావరి వంతెన అడ్డగా చేసుకుని సర్కారు ఇస్తున్న సబ్సీడీ బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. యధేచ్ఛగా సాగుతున్న దందాను స్థానిక అధికార యంత్రాంగం చూసిచూడనట్లే వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. కనీసం సొంత విభాగానికి చెందిన నిఘా వర్గాలు పట్టించుకున్న దాఖలాలు కానరాని పరిస్థితి నెలకొంది. అందుకు హైదరాబాద్ కు చెందిన సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు అంతరాష్ట్ర సరిహద్దు కాళేశ్వరం వద్ద దాడులు చేసి భారీ మొత్తంలో బియ్యం(Ration Rice Seized at Kaleshwaram) పట్టుకోవడం స్థానిక అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. ప్రధానంగా మహారాష్ట్రలో బియ్యంపై నియంత్రణ లేకపోవడాన్ని అనుకూలంగా మార్చుకుని ఓ బడా వ్యాపారి అక్రమదందాకు తెరలేపినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన నేతృత్వంలోనే నిత్యం టన్నులు కొద్ది రేషన్ బియ్యం సరిహద్దులు దాటుతున్నట్టుగా తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ దందాకు వెన్నుదన్నుగా నిలుస్తున్న సదరు వ్యాపారి చేసే మంత్రాంగం అంతా ఇంతా కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి నెల మొదటి రెండు వారాల పాటు రేషన్ బియ్యం తరలించే వాహనాలతోనే సరిహద్దు రహదారులు రద్దీగా మారుతున్నాయంటే తెలంగాణ సబ్సిడీ రేషన్ బియ్యం ఏ స్థాయిలో తరలి వెల్తున్నాయో అర్థమౌతుంది.
రోజుకో చోట రేషన్ బియ్యం పట్టుబడుతున్నా చట్ట ప్రకారం కఠిన చర్యలు లేకపోవడంతో యదేచ్చగా అక్రమదందా సాగుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని మామూళ్ళ మత్తులో సంబంధిత అధికారులు జోగుతుండడంతో అక్రమార్కులకు బియ్యం దందా ఆదాయ వనరుగా మారిందని చెప్పక తప్పదు. కాళేశ్వరం తోపాటు చెన్నూరు మీదుగా కూడా రేషన్ బియ్యం పెద్ద ఎత్తున తరలిపోతుంటాయి. అయితే అక్కడ సాగుతున్నా కట్టడి చేసే నాథుడే కానరాని పరిస్థితి ఏర్పడింది. రేషన్ బియ్యంపై ఇటీవల కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు విమర్శలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. రేషన్ బియ్యం తరలించే వారిలో ఓ ముఖ్యమైన వ్యక్తి ఆ ప్రాంత ముఖ్య నేతను కలవడంతో విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. తాజాగా సివిల్ సప్లై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు చేసి నాలుగు వాహనాలను, 900 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం సంచలనంగా మారింది.