The Goat Life: హైదరాబాద్ వస్తే ప్రభాస్‌ను కలవకుండా వెళ్లను.. ది గోట్ లైఫ్ కోసం ఎంతో కష్టపడ్డాం: పృథ్వీరాజ్ సుకుమారన్
The Goat Life: ది గోట్ లైఫ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ వచ్చిన మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను ఎప్పుడు వచ్చిన ప్రభాస్ ను కలిసే వెళ్తానని చెప్పాడు.
The Goat Life: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన మూవీ ది గోట్ లైఫ్. ఆడుజీవితం అని కూడా ఈ మూవీని పిలుస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అతడు శుక్రవారం (మార్చి 22) హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఈ సినిమా విశేషాలు పంచుకోవడంతోపాటు ప్రభాస్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ప్రభాస్‌ను కలిసే వెళ్తా
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి పృథ్వీరాజ్ సుకుమారన్ గతేడాది సలార్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ ఈ ఇద్దరూ మూవీలోనే కాదు బయట కూడా మంచి ఫ్రెండ్స్ లా మారిపోయారు. అందుకే తాను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ప్రభాస్ ను కలిసే వెళ్తానని అతడు చెప్పాడు. ఇప్పుడు ఈవెంట్ ముగిసిన తర్వాత ప్రభాస్ తో కలిసి డిన్నర్ చేస్తానని అన్నాడు.
"ఈ ఈవెంట్ తర్వాత నేను అతన్ని కలుస్తాను. మరో రెండు గంటల్లో నేను ప్రభాస్ తో కలిసి డిన్నర్ చేస్తాను. నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ప్రభాస్ ను కలిసే వెళ్తాను" అని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పాడు. సలార్ మూవీలో ఈ ఇద్దరూ మంచి స్నేహితుల పాత్రలో నటించారు. ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
ది గోట్ లైఫ్ మూవీపై పృథ్వీరాజ్ ఏమన్నాడంటే..
ది గోట్ లైఫ్ మూవీ ఓ రియల్ లైఫ్ స్టోరీ. కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి సౌదీ అరేబియా ఎడారుల్లో చిక్కుకుపోయి అతి కష్టమ్మీద ప్రాణాలతో బయటపడిన స్టోరీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.
దీనిపై పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. "ఇటీవల వరదరాజ మన్నార్ అనే కింగ్ క్యారెక్టర్ లో సలార్ తో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాతో నజీబ్ అనే స్లేవ్ క్యారెక్టర్ తో తెరపైకి రాబోతున్నాను. వరదరాజ మన్నార్ పూర్తిగా ప్రశాంత్ నీల్ ఇమాజినేషన్. కానీ ఈ సినిమా వాస్తవంగా జరిగిన కథ. నజీబ్ మన మధ్యే సజీవంగా ఉన్నాడు.
90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వ్యక్తి అతను. ఈ ప్రయాణంలో తను ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ రాసిన పుస్తకమే గోట్ డేస్. బెన్యామిన్ రాసిన ఈ పుస్తకం కేరళలో 2008లో పబ్లిష్ అయ్యింది. ఇది పబ్లిష్ అవగానే ప్రతి ఒక్కరి చేతుల్లోకి వెళ్లింది. అంత ఆదరణ పొందింది గోట్ డేస్. కేరళలో ప్రతి దర్శకుడు, హీరో, ప్రొడ్యూసర్ ఈ నవల హక్కులు తీసుకోవాలని ప్రయత్నించారు.
చివరకు ఆ హక్కులను మా డైరెక్టర్ బ్లెస్సీ సాధించారు. అదృష్టవశాత్తూ నజీబ్ గా నటించే అవకాశం నాకు దక్కింది. 2009 ప్రారంభంలో ఈ సినిమాకు కమిట్ అయ్యాం. అయితే ఆ టైమ్ లో ఈ సినిమాకు కావాల్సిన బడ్జెట్ ఖర్చు చేయడం అసాధ్యంగా ఉండేది. పదేళ్ల తర్వాత 2018లో షూటింగ్ ప్రారంభించాం. అప్పటికి ప్రాంతీయ సినిమాల మార్కెట్ స్థాయి పెరిగింది.
మలయాళ సినిమాలకు ఆదరణ పెరిగింది. 2019లో షూటింగ్ ప్రారంభించాం. జోర్డాన్ లో షెడ్యూల్ చేశాం. కేరళ పోర్షన్స్ కంప్లీట్ చేశాం. నేను ఈ సినిమా కోసం మొదట బరువు పెరిగి ఆ తర్వాత 31 కిలోలు తగ్గాను. బరువు తగ్గేందుకు ఒక షెడ్యూల్ తర్వాత 7 నెలల గ్యాప్ తీసుకున్నాం. ఇప్పటికి కూడా ఈ సినిమా బడ్జెట్ రిస్కు చేయడమే" అని అన్నాడు.