KCR Polam Bata : 50 వేల మందితో మేడిగడ్డకు వెళ్తాం, నీటిని ఎత్తిపోస్తాం - ఇకపై రణరంగమేనంటూ కేసీఆర్ వార్నింగ్
KCR Polam Bata in Karimnagar : కాంగ్రెస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
KCR Polam Bata Updates: చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 25 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)డిమాండ్ చేశారు. నష్టం జరిగిన పంటకు ఎకరానికి రూ. 25వేల పరిహారం ఇవ్వాలన్నారు. తప్పించుకోవాలంటే... ప్రభుత్వాన్ని రైతులు విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పొలంబాటలో(KCR Polam Bata) భాగంగా ఇవాళ కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఆయన… సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. 4 నెలల వరకు తాను ఎక్కడా మాట్లాడలేదని,.. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనే సమయం ఇచ్చామని తెలిపారు. నాగార్జున సాగర్ లో నీటి ఉన్నప్పటికీ... నీటిని విడుదల చేయటం లేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి..
"నేను కరీంనగర్ కు వస్తాను అనగానే.. కాళేశ్వరం( Kaleshwaram) నుంచి నీళ్లను విడిచిపెడుతున్నారు. ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. నీళ్లు ఇవ్వాలని కేసీఆర్(KCR) ముందే చెప్పాలిగా అని సీఎం చెప్పటం సిగ్గుచేటు. ముఖ్యమంత్రిగా ఉన్నది నేనా..? నువ్వా..? సమయానికి నీళ్లు వదిళితే... పంటలు ఎండిపోయేవి కావు. డిసెంబర్ 9వ తేదీన 2 లక్షల రుణమాఫీ అని ప్రకటన చేశారు. కానీ ఇప్పటివరకు చప్పుడు లేదు. ఇవాళ బ్యాంకర్లు... రైతులను వేధిస్తున్నారు. రైతుబంధు డబ్బులను కూడా ఇప్పటి వరకు ఇంకా పూర్తి చేయలేదు. దీనిపై సరైన స్పష్టత కూడా లేదు. రైతులకు బ్యాంకులకు నోటీసులు ఇస్తే ఎందుకు మాట్లాడటం లేదు..? పండించిన పంటకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే... వేటాడుతాం. రైతుల తరపున బీఆర్ఎస్ పోరాడుతుంది. మూడు నాలుగు నెలల్లో పరిస్థితి ఘోరంగా మారిపోయింది. గొర్రెల స్కీమ్ ను ఆపేశారు. దళితబంధు కోసం విడుదల చేసిన డబ్బులను కూడా ఫ్రీజ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి. కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. కానీ ఇప్పటివరకు తులం బంగారం చప్పుడు లేదు. తులం బంగారం రానివాళ్లందరూ కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టాలి. 4 వేల పెన్షన్ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడి వరకు ఇవ్వలేదు. రెఫరెండం అంటున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో వృద్ధులు బుద్ధి చెప్పాలి. మహాలక్ష్మీ అని చెప్పి... మహిళలను మోసం చేశారు" అంటూ కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
సిరిసిల్ల నేతన్నల పరిస్థితి దారుణంగా మారిందన్నారు కేసీఆర్. ఉమ్మడి ఏపీలోని పరిస్థితులు మళ్లీ వచ్చాయని సిరిసిల్ల కార్మికులు చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బతుకమ్మ చీరల బకాయిలను విడుదల చేయకుండా పెండింగ్ లో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒవరీసీస్ స్కాలర్ షిప్ లను కూడా పెండింగ్ లో పెట్టారని అన్నారు. చేనేత మిత్ర స్కీమ్ ను బంద్ పెట్టారని ప్రభుత్వాన్ని కేసీఆర్ దుయ్యబట్టారు. “ స్కూల్ పిల్లల కోసం ప్రవేశపెట్టిన మీల్స్ స్కీమ్ ను కూడా బంద్ పెట్టారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని ఓ మంత్రి మాట్లాడుతాడు. చేనేత కార్మికులను ఉద్దేశించి... నిరోధులు అమ్ముకోవాలని మరో కాంగ్రెస్ నేత మాట్లాడుతుండు. ఇలాంటి వారికి చేనేత కార్మికులు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. చేనేత కార్మికుల కోసం న్యాయపోరాటం చేస్తాం. హైకోర్టును ఆశ్రయిస్తాం. చేనేత కార్మికులు దొబ్బి తిన్నారని కొందరు మాట్లాడుతున్నారు. వారు కష్టం చేసి సంపాదించారు.. కానీ దొబ్బితినలేదు. మూడు నాలుగు నెలల్లో చేనేత కార్మికుల జీవితాలు తారుమారు అయిపోయాయి. కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతోనే మీరు గెలిచారు. కేవలం మీరు ఇచ్చిన తప్పుడు హామీల వల్లే ఈ శాతం ఓట్లు వచ్చాయి. మూడు నెలల కిందటి వరకు లేని కరెంట్ కష్టాలు ఇప్పుడు ఎందుకు మొదలయ్యాయి..? తెలివిలేనితనం, అసమర్థత కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. పీఆర్ స్టంట్ లతో నడిపిస్తూ పిచ్చి కథలు చేస్తున్నారు” అని ఫైర్ అయ్యారు.
నీటిని ఎత్తిపోస్తాం - కేసీఆర్
KCR On Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్ట్ పై(KCR On Kaleshwaram) స్పందిస్తూ మాట్లాడిన కేసీఆర్... కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఎడారిగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ సర్కార్ చేస్తుందన్నారు. "ఆరు నెలల తప్పస్సు చేసి... మేడిగడ్డ ప్రాజెక్ట్ ను రూపొందించాం. కానీ ఈ ప్రభుత్వానికి ప్రాజెక్ట్ ప్లాన్ తెలుసా..? సెప్టెంబర్ మాసం చివర్లో నీటిని ఎత్తిపోస్తా ఉంటాం. ఫలితంగా పంటలు ఎక్కడా ఎండిపోయే పరిస్థితి ఉండదు. వర్షా కాలం సమయంలో మాత్రం... అన్ని గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తాం. కానీ ఈ సర్కార్ వచ్చిన తర్వాత... మేడిగడ్డ (Meddigadda) కుంగిందన్న పేరుతో 50 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలేశారు. అసలు ప్రాజెక్టుల వద్ద ఎన్ని పంపులు ఉన్నాయో కాంగ్రెస్ నేతలకు తెలుసా..? ఇసుక కుంగి... ప్రాజెక్టులో ఫిల్లర్లు కదిలాయి. ప్రాజెక్టుల్లో సాధారణంగా సమస్యలు వస్తుంటాయి. కేసీఆర్(KCR) ను బద్నాం చేసేందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ రైతులకు భరోసా ఇచ్చాను. ప్రభుత్వం నీటిని ఎత్తివేయకపోతే 50 వేల మందితో గోదావరి ప్రాజెక్టులకు వెళ్దాం, నీటిని ఎత్తిపోస్తాం. హైదరాబాద్ లో నీటి ట్యాంకర్లను ఫ్రీగా ఇవ్వాలి. మిషన్ భగీరథను యథావిధిగా నడపాలి. అసలు ఈ ప్రభుత్వంలో ఉన్నవారు రివ్యూలు చేస్తున్నారా..?" అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.
ఇకపై రైతుల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడికి కేసీఆర్ వెళ్తాడని చెప్పుకొచ్చారు. రాష్ట్రం రణరంగమైనా సరే… రైతుల సమస్యలను పరిష్కరించే వరకు ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తే ఉండదన్నారు. నీటి నిర్వహణ తెలియనివారు రాజ్యమేలుతున్నారని… ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే అని పునరుద్ఘాటించారు.