Nitish Kumar Reddy: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో నితీష్ కుమార్ రెడ్డికి భారీ ధర.. ఐపీఎల్ మెరుపులే కారణం
Nitish Kumar Reddy: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. ఐపీఎల్ 2024లో మెరుపుల తర్వాత ఏపీఎల్ లో అతని రేంజ్ పెరిగిపోయింది.
Nitish Kumar Reddy: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా నిలవడం విశేషం. ఆరు టీమ్స్ పాల్గొనే ఈ లీగ్ లో నితీష్ గోదావరి టైటన్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ 2024లో అతడు ఆల్ రౌండ్ మెరుపులతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
నితీష్ కుమార్ రెడ్డి దూకుడు
ఐపీఎల్లో నితీష్ కుమార్ రెడ్డిని సన్ రైజర్స్ హైదరాబాద్ అతని కనీస ధర రూ.20 లక్షలకే కొనుగోలు చేసింది. గతేడాది అతడు విఫలమైనా.. ఈసారి జట్టులోనే కొనసాగించింది. అయితే ఈ నిర్ణయం ఆ జట్టుకు మేలే చేసింది. ఐపీఎల్ 2024లో నితీష్ 9 మ్యాచ్ లలో 239 రన్స్ చేశాడు. అంతేకాదు బౌలింగ్ లోనూ 3 వికెట్లు తీయడం విశేషం.
దీంతో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో నితీష్ డిమాండ్ పెరిగిపోయింది. అతడు ఈ లీగ్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. గోదావరి టైటన్స్ టీమ్ అతనికి రూ.15.6 లక్షలు ఇస్తుండటం విశేషం. ఈ లోకల్ లీగ్ అతనికి దాదాపు ఐపీఎల్ స్థాయి మొత్తం అందిస్తోంది. గత రెండు సీజన్ల రికార్డును నితీష్ తన ధరతో బ్రేక్ చేశాడు.
ఈ లీగ్ వేలం పాటను నితీష్ తన ట్యాబ్ లో చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లీగ్ చరిత్రలో తాను అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచానని తెలిసిన వెంటనే 20 ఏళ్ల నితీష్ తెగ సంబరపడిపోయాడు. ఐపీఎల్లో అంతర్జాతీయ బౌలర్లను కూడా దీటుగా ఎదుర్కొన్న నితీష్.. ఇప్పుడు ఏపీఎల్ మూడో సీజన్లో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి.
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మూడో సీజన్
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ నిర్వహించడానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సిద్ధమవుతోంది. ఈసారి లీగ్ లో మొత్తం ఆరు టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ అనే జట్లు లీగ్ లో ఆడనున్నాయి. కడప, విశాఖపట్నంలలో ఏపీఎల్ మూడో సీజన్లో మొత్తం 19 మ్యాచ్ లు నిర్వహించనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు గోపీనాథ్ రెడ్డి వెల్లడించారు.
ఏపీఎల్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. గతేడాది ఆగస్ట్ లో రెండో సీజన్ జరిగింది. ఆగస్ట్ 27న విశాఖపట్నంలో జరిగిన ఫైనల్లో కోస్టల్ రైడర్స్ ను ఓడించి రాయలసీమ కింగ్స్ విజేతగా నిలిచింది. మరి ఈసారి పాల్గొనబోతున్న ఆరు జట్లలో ఎవరు విజేతగా నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఖరీదైన ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తన గోదావరి టైటన్స్ కు టైటిల్ సాధిస్తాడన్న ఆశతో ఆ టీమ్ ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది ఈ టీమ్ రెండో క్వాలిఫయర్ లో రాయలసీమ కింగ్స్ చేతుల్లో ఓడిపోయింది.