BRS Chalo Medigadda: చలో మేడిగడ్డ… కాళేశ్వరాన్ని సజీవంగా చూపిస్తామంటున్న బిఆర్‌ఎస్‌ నేతలు…-chalo medigadda brs leaders visit to kaleswaram today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Chalo Medigadda: చలో మేడిగడ్డ… కాళేశ్వరాన్ని సజీవంగా చూపిస్తామంటున్న బిఆర్‌ఎస్‌ నేతలు…

BRS Chalo Medigadda: చలో మేడిగడ్డ… కాళేశ్వరాన్ని సజీవంగా చూపిస్తామంటున్న బిఆర్‌ఎస్‌ నేతలు…

HT Telugu Desk HT Telugu
Mar 01, 2024 05:58 AM IST

BRS Chalo Medigadda: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్‌ నేడు చలో మేడిగడ్డకు పిలుపు ఇచ్చింది.

చలో మేడిగడ్డకు సిద్ధమైన బిఆర్‌ఎస్ నేతలు
చలో మేడిగడ్డకు సిద్ధమైన బిఆర్‌ఎస్ నేతలు

BRS Chalo Medigadda: కాళేశ్వరం Kaleswaram ప్రాజెక్టు నిర్మాణంపై మాటల యుద్ధం సాగుతున్న వేళ బిఆర్‌ఎస్‌ నేతలు నేడు చలో మేడిగడ్డకు పిలుపునిచ్చారు. ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి ఆఫీసర్లతో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డను సందర్శించి, రివ్యూలు నిర్శహించి, బీఆర్​ఎస్​ పాలనపై మండి పడుతుండగా.. బీఆర్​ఎస్​ కూడా మార్చి ఒకటిన మేడిగడ్ద సందర్శనకు పిలుపునిచ్చింది. శుక్రవారం ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమం చేపట్టింది.

కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదని, మిగతా బ్యారేజీలు, పంపుహౌజ్​లను చూపించి, కాంగ్రెస్​ చెబుతున్న మాటలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు లో అంతర్భాగమైన మేడిగడ్డ కు బయలుదేరేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

చలో మేడిగడ్డ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నేతలతో స్టేషన్​ ఘన్​ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం సమావేశం నిర్వహించారు. హనుమకొండ ఎక్సైజ్​ కాలనీలోని తన నివాసంలో మీటింగ్​ ఏర్పాటు చేసి వారందరికీ దిశా నిర్దేశం చేశారు.

కాళేశ్వరాన్ని సజీవంగా చూపిస్తం

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్​ నేతలు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని స్టేషన్ ఘన్​ పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్​ నాయకులతో పాటు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా కాళేశ్వరం ప్రాజెక్టును సజీవంగా చూపెడతామని, అందుకే చలో మేడిగడ్డ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.

కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదని, మూడు బ్యారేజ్ ల సమాహారం అని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజక్టు అంటే 15 రిజర్వాయర్లు, 21 పంపు హౌజ్​లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉంటాయని చెప్పారు. కాళేశ్వరం అంటే 141 టీఎంసీల స్టోరేజ్‌ కెపాసిటీ అని, 240 టీఎంసీల వినియోగమని, వీటన్నింటి సమగ్ర స్వరూపమే కాళేశ్వరం ప్రాజెక్టు అని ఆయన చెప్పుకొచ్చారు.

భద్రత కల్పించాల్సిందిగా సీపీకి విజ్ఞప్తి

చలో మేడిగడ్డ కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ నుంచి భూపాలపల్లి వరకు కొనసాగుతుందని కడియం శ్రీహరి వెల్లడించారు. శుక్రవారం ఉదయం జనగామ, స్టేషన్​ ఘన్​ పూర్​, వరంగల్ రింగ్​ రోడ్డు మీదుగా కరుణాపురం, ఆరెపల్లి, గుడెప్పాడు, పరకాల, భూపాలపల్లి మీదుగా మేడిగడ్డ వరకు కొనసాగుతుందని, దారిపొడవునా భద్రత ఏర్పాట్లు చేయాల్సిందిగా బీఆర్​ఎస్​ ప్రతినిధులు వరంగల్ సీపీ అంబర్​ కిశోర్​ జాకు వినతిపత్రం అందించారు. తమకు సమగ్ర మైన భద్రత కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ , ఎంపీ పసునూరి దయాకర్, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, వరంగల్ బీఆర్​ఎస్​ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్మన్లు సుధీర్ కుమార్, గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

(రిపోర్టింగ్ హిందుస్తాన్ టైమ్స్, వరంగల్ ప్రతనిధి0