Allu Arjun : అల్లు అర్జున్ ఇష్యూలో కాంగ్రెస్‌కు మైలేజ్ వచ్చిందా? బీఆర్ఎస్, బీజేపీ బన్నీకి ఎందుకు మద్దతు ఇస్తున్నాయి?
Allu Arjun : పుష్ప 2 సినిమా ద్వారా అల్లు అర్జున్ ఎంత ఫేమస్ అయ్యారో తెలియదు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసుతో మాత్రం నేతల నోళ్లలో నానుతున్నారు. ముఖ్యంగా బన్నీ టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్‌గా మారారు. అధికార కాంగ్రెస్ ఓ స్టాండ్ తీసుకుంటే.. బీఆర్ఎస్, బీజేపీ బన్నీకి సపోర్ట్‌గా నిలుస్తున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు అంతా అల్లు అర్జున్ చుట్టే తిరుగుతున్నాయి. అందుకు కారణం సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. ఓ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత బెయిల్ వచ్చింది. మళ్లీ మంగళవారం బన్నీ పోలీసుల విచారణకు హాజరయ్యారు.
పేలిన పొలిటికల్ తూటాలు..
ఆ ఘటనకు సంబంధించిన వివరాలు అలా ఉంటే.. దీనిపై పొలిటికల్ తూటాలు పేలుతున్నాయి. తొక్కిసలాట ఘటనకు కారణం అల్లు అర్జున్ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఆయన అరెస్టును సమర్థించడానికి ఈ వాదనను తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. అయితే.. కాంగ్రెస్ నేతల ఈ ఆరోపణలకు బీఆర్ఎస్, బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఏదైనా కార్యక్రమంపై నిరసన వ్యక్తం చేయడానికి తాము వెళ్లాలనుకుంటే.. ప్రివెంటివ్ అరెస్టు చేసే పోలీసులు.. అల్లు అర్జున్‌ను ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
ప్రజల మద్దతు..
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు సింపతి దక్కింది. అయితే.. దాన్ని కవర్ చేయడానికి కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో దీని గురించి కీలక విషయాలు వెల్లడించారు. దీంతో సీఎం చెప్పిన మాటల్లో నిజం ఉందనే చర్చ ప్రజల్లో జరిగింది. సినిమా ఇండస్ట్రీ సెలబ్రెటీల కంటే.. సామాన్య పౌరుల భద్రత తమకు ముఖ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్ వాదనకు ప్రజల మద్దతు లభించింది.
ప్రశ్నల వర్షం..
ఈ నేపథ్యంలో మళ్లీ అలర్ట్ అయిన ప్రతిపక్ష పార్టీలు.. 42 మంది విద్యార్థులు చనిపోయారని.. వారి గురించి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఒక్క శ్రీతేజకు రూ. 25 లక్షలు ఇచ్చారు. వారందరికీ ఎందుకు రూ.25 లక్షలు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. తొక్కిసలాట ఘటనకు ఓ నటుడిని బాధ్యుడిని చేయడం ఎందుకు అని ప్రశ్నించారు. ఇందులో ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందని విమర్శించారు. ఎంతో మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. వారికి ఎందుకు రూ.25 లక్షలు ఇవ్వలేదని నిలదీశారు.
టార్గెట్ బన్నీ..
ప్రతిపక్షాల నుంచి ఇలాంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. అల్లు అర్జున్‌పై మాటల దాడిని కాంగ్రెస్ నేతలు మరింత తీవ్రతరం చేశారు. మంత్రి సీతక్క మొదలు.. చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు బన్నీపై మాటల తూటాలు పేల్చారు. ఈ సమయంలో.. అల్లు అర్జున్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో భారీగా పోస్టులు కనిపించాయి. ఒక దశలో ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రజల్లోనూ చర్చ జరిగింది. సరిగ్గా ఈ సమయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది.
పీసీసీ సూచనలు..
గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ నేతలకు పీసీసీ సూచనలు చేసింది. అల్లు అర్జున్ విషయంలో ఇప్పటికే సీఎం, పీసీసీ చీఫ్ సమగ్రమైన వివరాలతో ప్రకటనలు చేశారని వెల్లడించింది. తెలుగు సినీ పరిశ్రమ, నటులపై ఆరోపణలు చేస్తూ.. ఇక నుంచి ఎవరూ ప్రకటనలు చేయొద్దని ఆదేశించింది. ప్రెస్‌మీట్స్, డిబేట్స్, సమావేశాల్లో.. సినీ పరిశ్రమ, నటులను కించపరిచేలా మాట్లాడొద్దని కాంగ్రెస్ నేతలకు పీసీసీ సూచించింది.
ఈ రెండు పార్టీల స్టాండ్ అదే..
మొత్తానికి ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి కాస్త మైలేజ్ వచ్చినా.. ఇండస్ట్రీకి చెందిన కీలక వ్యక్తుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. దానికి కారణం సీఎం, ఇతర కీలక నేతలు కాదు. ద్వితీయస్థాయి నాయకుల మాటల వల్ల వ్యతిరేకత వ్యక్తమైనట్టు చర్చ జరుగుతోంది. ఇక బన్నీ వ్యవహారంలో బీఆర్ఎస్, బీజేపీ మొదట్నుంటీ ఒకే స్టాండ్‌పై ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు చెందిన కీలక నేతలతో సినీ ఇండస్ట్రీ ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయనే టాక్ ఉంది.