Allu Arjun : పోలీసుల విచారణకు అల్లు అర్జున్.. గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ నేతలకు కీలక ఆదేశాలు!
Allu Arjun : అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నేతలకు స్పష్టమైన సూచనలు చేసింది. ఇకపై ఎవరూ అల్లు అర్జున్ అంశంపై స్పందిచవద్దని ఆదేశించింది. అవసరమైనప్పుడు పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి మాట్లాడతారని స్పష్టం చేసింది. అటు బన్నీని ఇవాళ పోలీసులు ప్రశ్నించనున్నారు.
గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ నేతలకు పీసీసీ సూచనలు చేసింది. అల్లు అర్జున్ విషయంలో ఇప్పటికే సీఎం, పీసీసీ చీఫ్ సమగ్రమైన వివరాలతో ప్రకటనలు చేశారని వెల్లడించింది. తెలుగు సినీ పరిశ్రమ, నటులపై ఆరోపణలు చేస్తూ.. ఇక నుంచి ఎవరూ ప్రకటనలు చేయొద్దని ఆదేశించింది. ప్రెస్‌మీట్స్, డిబేట్స్, సమావేశాల్లో.. సినీ పరిశ్రమ, నటులను కించపరిచేలా మాట్లాడొద్దని కాంగ్రెస్ నేతలకు పీసీసీ సూచించింది.
బన్నీకి నోటీసులు..
అటు అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి సీఐ పేరుతో నోటీసులు వెళ్లాయి. సంధ్య థియేటర్ ఘటనలో విచారణకు సహకరించాలని నోటీసులు జారీ చేశారు. కేసు దర్యాప్తునకు అల్లు అర్జున్ రావడం చాలా ముఖ్యమని పోలీసులు స్పష్టం చేశారు. మీ నుంచి కొన్ని సమాధానాలు రాబట్టాలన్న పోలీసులు.. ఆ రోజు ఏం జరిగిందో నిజానిజాలు తేల్చేందుకు.. అవసరమైతే ధియేటర్‌కు వెళ్లాల్సి ఉంటుందని నోటీసుల్లో స్పష్టం చేశారు.
ఆంక్షలు..
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరం నుంచి ఆంక్షలు విధించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ రానున్న నేపథ్యంలో.. పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో.. అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు అతని మామ చంద్రశేఖర్ రెడ్డి.
సర్వత్రా ఉత్కంఠ..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ సహా 18 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. చిక్కడపల్లి పీఎస్‌లో సంధ్య థియేటర్ ఘటన దృశ్యాలను పోలీసులు అల్లు అర్జున్‌కు చూపనున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ ఏం చెబుతారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మల్లన్న ఫిర్యాదు..
తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు తీన్మార్ మల్లన్న, అల్లు అర్జున్ పై పోలీసు ఫిర్యాదు చేశారు. పుష్ప 2 సినిమా పోలీసు బలగాలను అవమానించిందని ఆరోపించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదులో దర్శకుడు సుకుమార్, నిర్మాతల పేర్లు ఉన్నాయి.