Congress Mlc Complaint : మరిన్ని చిక్కుల్లో అల్లు అర్జున్, పుష్ప 2 స్విమ్మింగ్ పూల్ సీన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫిర్యాదు
Congress Mlc Complaint On Allu Arjun : సినీ హీరో అల్లు అర్జున్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలో ఓ సన్నివేశం పోలీసులను కించపరిచేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Congress Mlc Complaint On Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'పుష్ప 2: ది రూల్' పోలీసులను కించపరిచేలా ఉందంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన ఫిర్యాదులో పుష్ప చిత్ర దర్శకుడు సుకుమార్, నిర్మాతల పేర్లు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర స్విమ్మింగ్ పూల్ లో పోలీసు అధికారి ఉండగా....మూత్ర విసర్జన చేసే సన్నివేశంపై వివాదం నెలకొంది. ఈ సన్నివేశం చట్టాన్ని అమలు చేసే అధికారులను కించపరిచేలా ఉందని, చిత్ర నిర్మాతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు.
సంధ్య థియేటర్ ఘటన
డిసెంబర్ 4వ తేదీ హైదరాబాద్ సంధ్య థియేటర్ లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందగా, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చారని, ఫలితంగా తొక్కిసలాట జరిగిందని పోలీసులు ఆయనను అరెస్టు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం అల్లు అర్జున్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి భర్త భాస్కర్ ఈ కేసును ఉపసంహరించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి
అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం దాడి జరిగింది. కొందరు ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసి సెక్యురిటీ సిబ్బందిని కొట్టారు. ఈ హింసాత్మక నిరసనలు ఈ అంశాన్ని రాజకీయంగా మలుపు తిప్పాయి. అధికార కాంగ్రెస్ కుట్రలో భాగంగా ఈ దాడి జరిగిందని ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపించాయి. అల్లు అర్జున్ ఇంటిపై టమోటాలతో దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేసిన వారిలో కొందరు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ కు చెందిన వారేనని బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఓయూ జేఏసీకి చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వీరు బెయిల్ పై విడుదలయ్యారు.
మరొకరు అరెస్టు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీని రెండు రోజుల క్రితమే పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. థియేటర్ హాలులోకి వెళ్లే గేటు వద్ద భారీగా అభిమానులను ఆపేసి, ఒక్కసారిగా అనుమతించడంతో అంతా హాలులోకి దూసుకొచ్చి తొక్కిసలా జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు ఆంటొనీనే ప్రధాన కారకుడిగా పోలీసులు గుర్తించారు.
సంబంధిత కథనం