YSRCP : జగన్ జంగ్ సైరన్.. కూటమి ప్రభుత్వంపై పోరుబాట.. ఇప్పుడే ఎందుకు?
YSRCP : జగన్ జంగ్ సైరన్ మోగించారు. కూటమి ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇచ్చిన వైసీపీ చీఫ్.. ఇకపై ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడాలని డిసైడ్ అయ్యారు. అందుకు కరెంట్ ఛార్జీల పెంపు అంశాన్ని అస్త్రంగా వాడుకోవాలని నిర్ణయించారు. కరెంటు ఛార్జీలపై డిసెంబర్ 27న పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు.
వైఎస్సార్సీపీ చీఫ్ జగన్‌మెహన్ రెడ్డి తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. లాభం లేదు.. ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వంపై పోరాడటానికి ఇన్నాళ్లు వేచిచూసిన జగన్.. కరెంట్ ఛార్జీల అస్త్రంతో రంగంలోకి దిగుతున్నారు. కూటమి ప్రభుత్వంపై పోరు చేయడానికి ఇదే సరైన సమయం అని భావించిన జగన్.. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పోరుబాట పోస్టర్‌ను వైసీపీ నేతలు ఆవిష్కరించారు.
ఇప్పుడే ఎందుకు..
డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అయితే.. ప్రజలు, కార్యకర్తల నుంచి పెద్దగా స్పందన ఉండదని అంతా భావించారు. కానీ.. అనుహ్యంగా ఏపీలోని గల్లీలు మొదలు.. లండన్‌లోని వీధుల వరకు జగన్ బర్త్‌డే వేడుకలు జరిగాయి. దీంతో వైసీపీ మంచి ఊపులో ఉంది. ఇదే ఊపులో ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించడం సరైన సమయమని జగన్ భావించినట్టు తెలిసింది. కేడర్ యాక్టివ్‌గా ఉన్నప్పుడే ప్రభుత్వంపై పోరాటం చేయడం రాజకీయంగా మంచిదని భావించినట్టు తెలిసింది. అందుకే డిసెంబర్ 22న ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు.
కరెంట్ ఛార్జీలే ఎందుకు..
కూటమి పార్టీలు ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చాయి. ముఖ్యంగా సూపర్ సిక్స్ బాగా ప్రాచుర్యం పొందింది. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు, ఆడబిడ్డకు ప్రతి నెలా రూ.1500, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, డీఎస్సీ ప్రకటన వంటి ప్రధాన హామీలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదు. ఏడాదికి 3 సిలిండర్ల పథకాన్ని మాత్రం ప్రారంభించింది. ఇన్ని అంశాలు ఉన్నా.. జగన్ కరెంట్ ఛార్జీల పెంపు ఇష్యూను ఎంచుకున్నారు. ఎందుకంటే.. కరెంట్ ఛార్జీల అంశం రాష్ట్రంలో ఎక్కువమందిపై ప్రభావం చూపుతుందని.. దీని ద్వారా ప్రజలకు దగ్గర కావొచ్చని వైసీపీ భావిస్తున్నట్టు తెలిసింది.
క్షేత్రస్థాయి నుంచి రిపోర్ట్..
కూటమి ప్రభుత్వ 6 నెలల పాలనపై జగన్ క్షేత్రస్థాయి నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. చాలా వర్గాలు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నట్టు జగన్‌కు రిపోర్ట్‌లు వచ్చాయని సమచారం. ఎక్కువమంది కరెంట్ ఛార్జీల పెంపు అంశంపై గుర్రుగా ఉన్నట్టు జగన్ భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో.. కరెంట్ ఛార్జీల పెంపుపై పోరు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు.
భవిష్యత్తులోనూ..
కరెంట్ ఛార్జీలపై పోరు తర్వాత మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 27న తలపెట్టిన కార్యక్రమం విజయవంతం అయితే.. దానిపై వచ్చిన స్పందన ఆంధారంగా మార్చి మాసంలో మరో అంశంపై పోరు చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. అందుకే 27న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ ఆఫీసు నుంచి అన్ని నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది.
లీడర్లు లేనిచోట్ల ఎలా..
ఎన్నికల ఫలితాల తర్వాత చాలా నియోజకవర్గాలకు చెందిన నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు. కీలక ప్రాంతాల్లో లీడర్లు లేరు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించడం ఇప్పుడు వైసీపీ కష్టంగా మారింది. అయితే.. ఈ కార్యక్రమం తర్వాత ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిరసన కార్యక్రమాల నిర్వహణకు కేడర్ సమీకరణ, ఇతర విషయాలను చూసుకోవడానికి ముందుండే నాయకులనే ఇంఛార్జ్‌లుగా నియమిస్తారని సమాచారం.