No Detention Policy : కేంద్రం కీలక నిర్ణయం.. 5, 8 తరగతుల్లో విద్యార్థులు కచ్చితంగా పాస్ కావాలి.. లేదంటే..
No Detention Policy : పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు, ఎనిమిది తరగతులకు సంబంధించి నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసింది. ఈ నిర్ణయం ప్రకారం 5, 8 తరగతుల విద్యార్థులకు ఇది కీలక అప్డేట్. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు మళ్లీ అదే తరగతిలో చదవాల్సి ఉంటుంది. అయితే మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. కానీ పరీక్ష నిర్వహించిన తర్వాత కూడా ఉత్తీర్ణత సాధించనప్పుడే అదే తరగతిలో కొనసాగిస్తారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం కార్యదర్శి సంజయ్ కుమార్ తెలియజేశారు.
5, 8 తరగతుల వార్షిక పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు రెండు నెలల్లోపు మళ్లీ పరీక్షకు అవకాశం కల్పిస్తారు. ఇందులో కూడా విఫలమైతే తదుపరి తరగతికి ప్రమోట్ అవ్వరు. అంటే రీ ఎగ్జామ్‌లో కూడా ఫెయిల్ అయిన విద్యార్థి మళ్లీ అదే తరగతి చదవాల్సి ఉంటుంది. ఎలిమెంటరీ విద్య పూర్తయినంత వరకూ ఏ విద్యార్థిని కూడా బహిష్కంచరాదని కేంద్రం స్పష్టం చేసింది.
తాజాగా వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ స్కూళ్లలో తాజా నియమం వర్తిస్తుంది. క్లాస్ టీచర్ అవసరమైతే పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేయాలని నోటిఫికేషన్ పేర్కొంది.
'ప్రతి విద్యార్థిలో నేర్చుకునే కోరిక పెరగాలని, దీనిని ముందుకు తీసుకెళ్లాలని మేం కోరుకుంటున్నాం. కొన్ని కారణాల వల్ల చదువులో రాణించలేని పిల్లలపై శ్రద్ధ చూపుతాం. నిబంధనల మార్పు తరువాత ఇది సాధ్యమవుతుంది. పిల్లల అభ్యాసం పట్ల మక్కువ పెరుగుతుంది.' అని సంజయ్ కుమార్ తెలిపారు.
దాదాపు 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయి. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సైనిక్ పాఠశాలలతో సహా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పాఠశాలలకు ఈ నియమం వర్తిస్తుంది. అయితే రాష్ట్రాలు కూడా ఈ విషయంలో తమ స్వంత నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలోకి వస్తుంది. అందువల్ల ఈ విషయంలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వారికి ఉంది.