Kadapa Mla Vs Mayor : కడపలో కాకరేపుతున్న కుర్చీ రాజకీయం, టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ మేయర్-సర్వసభ్య సమావేశం రసాభాస
Kadapa Mla Vs Mayor : కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వ సభ్య సమావేశంలో కుర్చీల ఫైట్ కొనసాగింది. టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ మేయర్ మధ్య వాగ్వాదం జరిగింది. సభలో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్లు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు.
Kadapa Mla Vs Mayor : కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వ సభ్య సమావేశంలో మళ్లీ కుర్చీ కోసం రసాభాస జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ప్రొటోకాల్ పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవీరెడ్డికి వేదికపై మరోసారి కుర్చీ వేయలేదు. ఈ విషయంపై వైసీపీ మేయర్‌ను ఎమ్మెల్యే నిలదీయడంతో కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. తనకు కుర్చీ వేసేంత వరకు నిలబడే ఉంటానని ఎమ్మెల్యే మాధవీ రెడ్డి కడప మేయర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. మహిళలను అవమానిస్తే మీ పార్టీ అధినేతకు సంతోషం కలుగుతుందా అని ఎమ్మె్ల్యే ప్రశ్నించారు.
మేయర్ సీటు పక్కన తనకు కుర్చీ వేయాలని ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఆందోళనకు దిగడంతో కార్పొరేషన్ సమావేశం రణరంగంగా మారింది. సమావేశాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేసినా పరిస్థితి కుదుటపడకపోవడంతో.... వైసీపీ సభ్యులు బాయికాట్ చేశారు. అనంతరం మేయర్ సురేష్ బాబు బయటకు వెళ్లిపోయారు. దీంతో ఉదయం నుంచి సీటు జరిగిన ఫైట్ ముగిసింది. అంతకు ముందు టీడీపీ-వైసీపీ కార్పొరేటర్ల ఘర్షణతో కార్పొరేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
మేయర్ ఓ నియంత- ఎమ్మెల్యే మాధవీ రెడ్డి
సమావేశం అనంతరం ఎమ్మెల్యే మాధవీ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కడప కార్పొరేషన్ నేటి సమావేశంచరిత్రలో నిలిచిపోతుందన్నారు. అజెండాపై చర్చ జరపకుండానే బిల్లులు ఆమోదించారని మండిపడ్డారు. ఈ సమావేశంతో ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. మేయర్ ఓ నియంతలా వ్యవహరిస్తు్న్నారని ఆరోపించారు. మహిళ ఎమ్మెల్యే అంటే గౌరవం లేదని, కడప కార్పొరేషన్ రాయించుకున్నట్ల వ్యవహారిస్తున్నారన్నారు. సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు హంగామా చేశారన్నారు. కొందరు కార్పొరేటర్లు టీడీపీలో చేరారని జీర్ణించుకోలేక కుర్చీ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. కార్పొరేషన్ లో కనీసం వీధి కుక్కలను కూడా అరికట్టలేని పరిస్థితి ఉందన్నారు.
ఎమ్మెల్యే దౌర్జన్యానికి పాల్పడ్డారు- మేయర్ సురేష్ బాబు
ఎమ్మెల్యే మాధవీరెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని కడప మేయర్ సురేష్ బాబు ఆరోపించారు. కడప మునిసిపల్ కార్పొరేషన్ సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే గలాటా చేశారన్నారు. తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే సమావేశాన్ని అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే దౌర్జన్యానికి పాల్పడి సమావేశ అజెండా పేపర్లను చించివేశారన్నారు. ఎమ్మెల్యేకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు. మిగిలిన కార్పొరేషన్లలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడ కూర్చుంటున్నారో చెప్పాలన్నారు. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారని గౌరవిస్తే తన ఇంటిపైనే చెత్త వేయించారని ఆరోపించారు.
వందలాది మంది కార్యకర్తలతో కార్పొరేషన్ పై దండయాత్ర చేశారని మేయర్ విమర్శించారు. కార్పొరేటర్లపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఫిరాయింపు కార్పొరేటర్లను సస్పెండ్ చేసినా సమావేశం నుంచి బయటకు వెళ్లలేదన్నారు.
నవంబర్ 7న జరిగిన కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో కూడా కుర్చీ వివాదం నెలకొంది. ఈ సమావేశంలో మేయర్ పక్కన తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీ రెడ్డి మండిపడ్డారు. మేయర్ ఛాంబర్‌లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కుర్చీలు తీసేశారని, ప్రొటోకాల్ పాటించాలని ఎమ్మెల్యే ఆరోపించారు. దీంతో కుర్చీల వివాదం నెలకొంది.