RRR Behind and Beyond OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్.. థియేటర్లలో రిలీజైన వారం రోజుల్లోనే..
RRR Behind and Beyond OTT: ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత శుక్రవారం (డిసెంబర్ 20) థియేటర్లలోకి వచ్చిన ఈ డాక్యుమెంటరీ వారం రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం. రాజమౌళి మ్యాగ్నమ్ ఓపస్ ఆర్ఆర్ఆర్ మూవీపై రూపొందిన డాక్యుమెంటరీ ఇది.
RRR Behind and Beyond OTT: ఆర్ఆర్ఆర్ మూవీపై రూపొందించిన డాక్యుమెంటరీ ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్. ఈ మూవీ తెర వెనుక సీన్లు.. ఇందులో పనిచేసిన వారి అభిప్రాయాలతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. డిసెంబర్ 20న కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే రిలీజైన ఈ ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్.. ఈ శుక్రవారం (డిసెంబర్ 27) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది.
ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ ఓటీటీ
ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ సోమవారం (డిసెంబర్ 23) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "బిహైండ్ ద సీన్స్, బియాండ్ ద లెగసీ.. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ చూడండి. ఎస్ఎస్ రాజమౌళి మ్యాగ్నమ్ ఓపస్ తెర వెనుక సీన్లు డిసెంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని తెలిపింది.
ఈ సందర్భంగా ఈ డాక్యుమెంటరీ పోస్టర్ ఒకటి పోస్ట్ చేసింది. అందులో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిని చాలా ఇంటెన్స్ లుక్ లో చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగన్ లాంటి వాళ్లు నటించిన విషయం తెలిసిందే.
ఏంటీ ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ?
ఆర్ఆర్ఆర్ మూవీ ఇండియాతోపాటు జపాన్, అమెరికాలాంటి దేశాల్లోనూ దుమ్ము రేపింది. మరి ఇంత అద్భుతమైన సినిమాను ఎలా తీశారు? అసలు తెరవెనుక ఏం జరిగింది? తారక్, చరణ్ లాంటి వాళ్లు ఏం చెప్పారు? రాజమౌళి డైరెక్షన్, సీన్ వివరించే తీరు ఎలా ఉంటుంది? ఆస్కార్ సాధించిన నాటు నాటు పాట విశేషాలేంటి? ఇలాంటి వివరాలన్నీ ఈ ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీలో చూడొచ్చు.
1920ల్లో భారత స్వాతంత్య్రోద్యమ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. నిజాంపై గళమెత్తిన కొమురం భీమ్, బ్రిటీష్ వారి పీచమణిచిన అల్లూరి సీతారామరాజు ఒకవేళ కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుందనే ఊహనే అద్భుతమైన కథగా మలచి రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించాడు. హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కామెరాన్ లాంటి వాళ్లను కూడా కట్టిపడేసిన ఈ సినిమా మేకింగ్ వీడియో చూడాలని ఎప్పటి నుంచో అభిమానులు ఆశ పడుతున్నారు. ఇప్పుడీ ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ ద్వారా అది నెరవేరబోతోంది. నెట్‌ఫ్లిక్స్ లో డిసెంబర్ 27 నుంచి ఈ డాక్యుమెంటరీ చూడొచ్చు.