Mohammed Shami: షమి ఔట్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా దూరం.. ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదన్న బీసీసీఐ-mohammed shami fitness pace bowler ruled out of border gavaskar trophy says bcci ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mohammed Shami: షమి ఔట్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా దూరం.. ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదన్న బీసీసీఐ

Mohammed Shami: షమి ఔట్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా దూరం.. ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదన్న బీసీసీఐ

Hari Prasad S HT Telugu
Dec 23, 2024 07:16 PM IST

Mohammed Shami: మహ్మద్ షమి ఆస్ట్రేలియా వెళ్లడం లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలి ఉన్న రెండు టెస్టుల కోసం అతడు అందుబాటులోకి వస్తాడని భావించినా.. అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని బీసీసీఐ స్పష్టం చేసింది.

షమి ఔట్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా దూరం.. ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదన్న బీసీసీఐ
షమి ఔట్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా దూరం.. ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదన్న బీసీసీఐ (Getty)

Mohammed Shami: టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఏడాదికిపైగా జట్టుకు దూరంగా ఉన్న పేస్ బౌలర్ మహ్మద్ షమి.. ఆస్ట్రేలియా వెళ్లడం లేదు. అతని ఫిట్‌నెస్ పై సోమవారం (డిసెంబర్ 23) అప్డేట్ ఇచ్చింది బీసీసీఐ. ఈ మధ్యే తన ఫిట్‌నెస్ నిరూపించుకొని బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్, తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాడు. అయితే ఆ సమయంలో అతని మోకాలులో వాపు వచ్చిందని, దీంతో అతడు ఆస్ట్రేలియా సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండబోడని బోర్డు స్పష్టం చేసింది.

yearly horoscope entry point

షమి రావడం లేదు

మహ్మద్ షమి ఫిట్‌నెస్ పై మొదటి నుంచీ సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. గబ్బా టెస్టు ముగిసిన తర్వాత కూడా కెప్టెన్ రోహిత్ శర్మను షమి గురించి ప్రశ్నించగా.. నేషనల్ క్రికెట్ అకాడెమీయే అప్డేట్ ఇవ్వాలని అతడు అన్నాడు. మొత్తానికి సోమవారం (డిసెంబర్ 23) బీసీసీఐ షమి గాయం గురించి వెల్లడించింది. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడిన సమయంలో బౌలింగ్ భారం పెరిగి అతని ఎడమ మోకాలులో వాపు కనిపించినట్లు బోర్డు తెలిపింది.

"ప్రస్తుత బీసీసీఐ మెడికల్ టీమ్ అంచనా ప్రకారం.. బౌలింగ్ భారం పడినా అతని మోకాలు తట్టుకోవడానికి మరికాస్త సమయం పడుతుంది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టులకు అతడు ఫిట్‌గా లేడని నిర్ధారించారు" అని బోర్డు ప్రకటన వెల్లడించింది.

షమి వచ్చేదెప్పుడు?

షమి మోకాలు పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని బీసీసీఐ తెలిపింది. అతడు ఎలా కోలుకుంటాడన్నదానిపైనే విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన మ్యాచ్ లకు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది తెలుస్తుందని కూడా చెప్పింది. టెస్టులకు సరిపడా ఫిట్‌నెస్ సాధించేలా బీసీసీఐ మెడికల్ సిబ్బంది అతనితో కలిసి పని చేస్తున్నట్లు బోర్డు వెల్లడించింది.

నిజానికి గతంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ.. షమి మోకాలిలో వచ్చిన వాపు గురించి తెలిపాడు. అతడు దేశవాళీ క్రికెట్ ఆడుతున్న విషయం తనకు తెలుసని, అయితే అతని రికవరీపై మాత్రం అనిశ్చితి కొనసాగుతోందని అన్నాడు. మహ్మద్ షమి గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత మళ్లీ టీమిండియాకు ఆడలేదు. అతని మడమ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు.

Whats_app_banner