Gavaskar on Ashwin: అశ్విన్ గొప్ప కెప్టెన్ అయి ఉండేవాడు.. వైస్ కెప్టెన్‌ని కూడా చేయలేదు.. బౌలర్ కాబట్టే అవమానం: గవాస్కర్
Gavaskar on Ashwin: అశ్విన్ టీమిండియాకు గొప్ప కెప్టెన్ అయి ఉండేవాడని, కానీ కనీసం వైస్ కెప్టెన్ ను కూడా చేయలేదని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అనడం గమనార్హం. ఈ మధ్యే అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి ఆస్ట్రేలియా నుంచి సిరీస్ మధ్యలోనే ఇండియాకు వచ్చేసిన అశ్విన్ పై సన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Gavaskar on Ashwin: టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ టీమ్ మేనేజ్మెంట్ డబుల్ స్టాండర్డ్స్ పై మండిపడ్డాడు. అశ్విన్ బౌలర్ కాబట్టే ఈ అవమానాలని, అదే బ్యాటర్లకు మాత్రం మరో రూల్ ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అశ్విన్ గొప్ప కెప్టెన్ అయి ఉండేవాడని, కానీ కనీసం వైస్ కెప్టెన్ ని కూడా చేయలేదంటూ సెలెక్టర్లను నిందించాడు. ఈ మధ్యే రిటైరైన అశ్విన్ ను ఉద్దేశించి మిడ్‌డేకు రాసిన కాలమ్ లో గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అశ్విన్‌కు అందుకే అవమానాలు
రవిచంద్రన్ అశ్విన్ ఓ బౌలర్ అయినందుకే అతన్ని తుది జట్టులో నుంచి ఎలాంటి కారణం లేకుండా పక్కన పెట్టేవారని గవాస్కర్ తన కాలమ్ లో అభిప్రాయపడ్డాడు. టీమ్ బ్యాలెన్స్ అనే పేరు చెప్పి అలా చేసేవారని, అదే బ్యాటర్ల విషయంలో మాత్రం ఎప్పుడూ జరగలేదని అన్నాడు. "క్రికెట్ ఓ బ్యాటర్ల గేమ్ కావడంతో ఎన్నో ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులు గెలిచిన వ్యక్తికి కూడా తగిన గుర్తింపు లభించలేదు. తుది జట్టులో నుంచి అతన్ని తప్పించిన ప్రతిసారీ కనీసం 5 శాతం కూడా సరైన వివరణ ఉండదు.
టీమ్ బ్యాలెన్స్ పేరుతో తప్పించేస్తారు. అదే స్వదేశంలో మాత్రం అతన్ని తీసేయరు. ఎందుకంటే అతడు లేకుండా గెలవలేమని టీమ్ మేనేజ్‌మెంట్ కు తెలుసు. పిచ్, కండిషన్స్ నంబర్ వన్ ర్యాంకు బౌలర్ కు సూట్ కావని చెప్పినప్పుడు.. అదే బ్యాటర్లకు మాత్రం ఎందుకు చెప్పారు. వాళ్లు టాప్ ర్యాంక్ బ్యాటర్లు కాకపోయినా సరే.. అవే పిచ్, కండిషన్స్ లో గతంలో ఇబ్బందిపడినా ఈ సాకు చెప్పరెందుకు" అని సన్నీ ప్రశ్నించాడు.
కెప్టెన్సీ గౌరవం ఇవ్వలేదు
అంతేకాదు అశ్విన్ గొప్ప కెప్టెన్ అయి ఉండే అవకాశం ఉన్నా కూడా అతనికి ఆ గౌరవం ఇవ్వలేదని కూడా గవాస్కర్ మండిపడ్డాడు. అతని నాయకత్వ లక్షణాలను గుర్తించలేదని విమర్శించాడు. కనీసం తన చివరి మ్యాచ్ లో ఆ గౌరవం ఇచ్చినా బాగుండేదని అన్నాడు.
"ఇండియాకు అశ్విన్ మంచి కెప్టెన్ అయి ఉండేవాడు. కానీ అతనికి కనీసం వైస్ కెప్టెన్సీ గౌరవం కూడా ఇవ్వలేదు. చివర్లో అయినా కనీసం ఓ టెస్ట్ మ్యాచ్ కో.. ఓ పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్ కో అవకాశం ఇచ్చి ఉండాల్సింది. కానీ అది కూడా ఇవ్వలేదు. అందుకే అశ్విన్ 100వ టెస్టులో రోహిత్ శర్మ అతనికి ఆ అవకాశం ఇవ్వడం మెచ్చుకోదగిన విషయం" అని గవాస్కర్ అన్నాడు.