TG Students Suicides : విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వాలకు పట్టవా? సంచలనమైతేనే చర్చిస్తారా?
TG Students Suicides : సంధ్య థియేటర్ ఘటన విషాదకరం...అయితే ఇలాంటి ఘటనలు నిత్యం ప్రైవేట్ కాలేజీల్లో, తెలంగాణ సమాజంలో ఎన్నో జరుగుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఉరితాళ్లకు వేళాడుతున్నారు. వారి మరణాలపై అసెంబ్లీ చర్చించి ఉండాల్సిందన్న వాదన వినిపిస్తుంది.
TG Students Suicides : ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య... పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య...ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య...ఫుడ్ పాయిజన్ తో విద్యార్థిని మృతి తెలంగాణలో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు. ఓ ప్రముఖ విద్యా సంస్థకు చెందిన ప్రైవేట్ కాలేజీలు, హాస్టళ్లలో విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఈ ఘటనలు జరిగిన కొద్ది రోజులు కాస్త హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత షరామామూలే. బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు తప్ప..ఈ బాధ ఏ ఒక్కరికీ అర్థం కావడంలేదు. విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అంటూ ప్రతిపక్షాల విమర్శలు, అందుకు అధికార పార్టీ నేతల కౌంటర్లతో అసలు విషయం పక్కదారి పడుతుంది. ఈ ఏడాది పదుల సంఖ్యలో విద్యార్థులు ఆయువు తీసుకున్నది వాస్తవం. ఏదో సంచలనం జరిగితే తప్ప.. విద్యార్థుల ఆత్మహత్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని సామాజికవేత్తలు, పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చర్చించండి
సంధ్య థియేటర్ తొక్కిసలాటపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్... కానీ విద్యార్థుల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజన్ ఘటనలు, హైడ్రా మరణాలపై అసెంబ్లీలో చర్చించేందుకు సమయం లేదా? అని తెలంగాణ టీడీపీ మహిళా నేత తిరునగరి జోత్స్న ప్రశ్నించారు. ప్రభుత్వ హాస్టల్స్‌లో పుడ్ పాయిజన్ తో చనిపోయిన పిల్లల చావులకి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. రుణమాఫీ అవ్వక చనిపోయిన రైతుల ప్రాణాలకు ఎవరు బాధ్యులు? హైడ్రా భయంతో ప్రాణాలు కోల్పోయిన వారి మరణాలకు కారణం ఎవరు? సిరిసిల్ల చేనేత సోదరుల ఆత్మహత్యలు కారణం ఎవరు? ఇక్కడ చనిపోయింది సామాన్యులు కాదా? వారి కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారని ఆమె ప్రశ్నించారు. ఇదీ వాస్తవమే కదా అని పలువురు పెదవి విరుస్తున్నారు.
విద్యార్థుల ఆత్మహత్యలపై చర్చలేవి?
విద్యార్థుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదని, బాధ్యులను ఎందుకు అరెస్టు చేయడంలేదన్న ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకూ విద్యార్థుల బలవన్మరణాలు పెరుగుతున్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. చదువుల ఒత్తిడితో, ర్యాంకుల గోలలో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. కార్పొరేట్ చదువుల ఒత్తిడి భరించలేక విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. సూసైడ్ నోట్ లలో ఈ విషయం చెబుతున్నా... యాజమాన్యాల తీరు మారడంలేదు. ప్రభుత్వాలు చర్యలు అంతంత మాత్రమే అనే విమర్శలు లేకపోలేదు. తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపాయి. ఈ విషయంపై ఆర్టీఐ కార్యకర్తలు సేకరించిన వివరాలు విస్మయం కలిగిస్తున్నాయి. 2020 నుంచి 2024 నవంబర్ వరకు తెలంగాణలో 26 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఈ విద్యా సంవత్సరంలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. కానీ గత నాలుగేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 26 మంది మాత్రమే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆర్టీఐ ద్వారా తేలడం గమనార్హం.
ప్రైవేట్ కాలేజీ ఆగడాలు
ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి, ఆగడాలకు ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ విద్యాసంవత్సరం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోనే పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ విషయంపై అసెంబ్లీ ఎందుకు చర్చించని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్న యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు ఉన్నాయనేది వాస్తవం. పుడ్ పాయిజన్ కారణంగా ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అనంతరం ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట విషాదకరం. అయితే ఇలాంటి విషాద ఘటనలు నిత్యం ప్రైవేట్ కాలేజీల హాస్టళ్లలో, ప్రభుత్వ గురుకులాల్లో జరుగుతున్నాయని వీటిని కూడా అంతే సంచలనంతో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. బాధితులకు అండగా నిలబడి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సంబంధిత కథనం