TG Rythu Runa Mafi : రైతు రుణమాఫీ కాలేదు.. మాకు మిగిలింది ఉరే ముఖ్యమంత్రి గారూ! అన్నదాతల వినూత్న నిరసన
TG Rythu Runa Mafi : రుణమాఫీ కోసం రైతులు ఇంకా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. రుణమాఫీ కాలేదు.. రైతు భరోసా రాలేదంటా.. ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టారు. పంట పొలాల్లో తాడుకట్టి ఉరి పెట్టుకున్నట్టు నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
రైతు రుణమాఫీ కాలేదు.. రైతుభరోసా రాలేదు.. ఇక మాకు మిగిలింది ఉరే ముఖ్యమంత్రి గారూ.. ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే గ్రామస్తులు ఆందోళన చేశారు. పంట పోల్లాలో తాడు కట్టి ఉరి పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా వెంటనే వెయ్యాలని కోరారు. అసెంబ్లీలో రైతు రుణమాఫీ పూర్తి అయిందని ముఖ్యమంత్రి అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్రా కే గ్రామానికి వచ్చి చూడాలని.. సగం మందికి రుణమాఫీ కాలేదన్నారు.
అసెంబ్లీలో రేవంత్ ఏమన్నారు..
'బీఆర్ఎస్ పదేళ్లలో సంపూర్ణంగా చేయలేని రుణమాఫీని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే చేసింది. బీఆర్ఎస్ పదేళ్లలో కాలంలో కేవలం రూ.27 వేల కోట్ల రుణమాఫీ చేస్తే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ సమయంలో రూ.20 వేల 616 కోట్లు రుణమాఫీ చేశాం' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు.
మిత్తీలకే పోయింది..
గత ప్రభుత్వ హయాంలో సాగులో లేని భూములకు రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేశారని రేవంత్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి ఐదేళ్లలో రూ.16 వేల కోట్లు రుణమాఫీ చేశారని, లక్ష రుణమాఫీలో రూ.80 వేలు మిత్తీలకే సరిపోయిందని అన్నారు. రెండో సారి రూ.11 వేల 909 కోట్లు రుణమాఫీ చేశారని వివరించారు. ఐదేళ్లలో నికరంగా చేసిన రుణమాఫీ రూ.3384 కోట్లు మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఓఆర్ఆర్‌ను అమ్మి రెండో విడత రుణమాఫీ డబ్బులు ఇచ్చారని చెప్పారు.
కేటీఆర్ ఏమన్నారు..
'రేవంత్‌రెడ్డి వంద శాతం రుణమాఫీ చేశామంటున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరేమో తమ నియోజకవర్గాల్లో 70 నుంచి 75 శాతమే అయిందని చెబుతున్నారు. వాస్తవంగా రుణమాఫీ అయ్యింది 25 శాతమే. ముఖ్యమంత్రి సొంత గ్రామం కొండారెడ్డిప ల్లెకి పోయినా ఈ విషయం తెలుస్తుంది. ఈ ప్రభుత్వం రుణమాఫీకి ఇచ్చింది కేవలం రూ.12 వేల కోట్లే. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.28 వేల కోట్ల రుణమాఫీ చేసింది. రైతుబంధు ద్వారా మరో రూ.73 వేల కోట్లు ఇచ్చాం' అని కేటీఆర్ స్పష్టం చేశారు.