Attack on Allu Arjun House : అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. నిందితులకు బెయిల్.. 10 ముఖ్యాంశాలు-bail granted to the accused who attacked allu arjun house in hyderabad 10 key points ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Attack On Allu Arjun House : అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. నిందితులకు బెయిల్.. 10 ముఖ్యాంశాలు

Attack on Allu Arjun House : అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. నిందితులకు బెయిల్.. 10 ముఖ్యాంశాలు

Basani Shiva Kumar HT Telugu
Dec 23, 2024 11:25 AM IST

Attack on Allu Arjun House : అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసుకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ కేసులో నిందితులకు కోర్టు బెయిల్ ఇచ్చింది. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. కొందరు బన్నీ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ ఇంటిపై దాడి
అల్లు అర్జున్ ఇంటిపై దాడి

హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. ఆరుగురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ.. న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.10 వేల చొప్పున ఒక్కొక్కరు రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మూడు రోజుల్లోగా పూచీకత్తులను సమర్పించాలని స్పష్టం చేసింది.

10 ముఖ్యాంశాలు..

1.డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది.

2.ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ నాయకులు డిసెంబర్ 22న అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు.

3.బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. అల్లు అర్జున్ ఇంటి ముందు బైఠాయించారు. కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

4.ఈ ఆందోళన సమయంలో కొందరు అల్లు అర్జున్ ఇంటి కంపౌండ్ వాల్ ఎక్కారు. మరికొందరు లోపలికి దూకారు.

5.ఇదే సమయంలో కొందరు ఆకతాయిలు అల్లు అర్జున్ ఇంటిపైకి రాళ్లు, టమాటాలు రువ్వారు. మరి కొందరు ఇంట్లోకి వెళ్లి పూల కుండీలను ధ్వంసం చేశారు.

6.ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.

7.ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు డిసెంబర్ 23న ఉదయం వనస్థలిపురంలోని కమలానగర్‎లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. నిందితులకు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.

8.ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు.

9.ఈ దాడిపై అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్పందించారు. దాడిపై విచారం వ్యక్తం చేశారు. అందరూ సంయమనం పాటించాలన్నారు. "మా ఇంటి బయట జరిగిందంతా అందరూ చూశారు. కానీ ప్రస్తుతం మేం సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికీ రియాక్ట్‌ అవ్వకూడదు. పోలీసులు వచ్చి ఆందోళనకారులను తీసుకెళ్లారు. వారిపై కేసు పెట్టారు. ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే, వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ ఘటనపై మేం స్పందించం. ఎవరూ తొందరపడి ఎలాంటి చర్యలకు దిగవద్దు"- అని అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు.

10.అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావులేదని మంత్రి స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని సూచించారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉందని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు.

Whats_app_banner