Jagapathi Babu: సంధ్య థియేటర్ ఘటన -బాధిత కుటుంబాన్ని కలిసిన జగపతిబాబు - వీడియోతో క్లారిటీ
Jagapathi Babu: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్సను పొందుతోన్న శ్రీతేజ్‌తో పాటు అతడి కుటుంబాన్ని పరామర్శించేందుకు తొలిరోజే హాస్పిటల్‌కు వెళ్లానని సినీ నటుడు జగపతిబాబు అన్నాడు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
Jagapathi Babu: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ ఘటనలో అభిమాని మృతి చెందడానికి అల్లు అర్జున్ కారణమంటూ సీఏం రేవంతి రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అల్లు అర్జున్‌తో పాటు అతడి టీమ్ నిర్లక్ష్య ధోరణి వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతోన్నారు తనపై వస్తోన్నవన్నీ తప్పుడు ఆరోపణలేనని అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అల్లు అర్జున్ కామెంట్స్‌పై ఆధారాలతో సహా అనేక అంశాలను పోలీసులు బయటపెట్టారు. అల్లు అర్జున్ థియేటర్‌కు చేరుకున్నప్పటి నుంచి వెళ్లిపోయేవరకు ఏం జరిగిందన్ననే వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివాదం రోజురోజుకు ముదురుతూ అనేక మలుపులు తిరుగుతోంది.
జైలు నుంచి విడుదలైన తర్వాత...
ఇదిలా ఉండగా.. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తర్వాత అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు అతడి ఇంటికి క్యూ కట్టారు. కానీ ఈ ఘటనలో కన్నుమూసిన రేవతి కుటుంబాన్ని పరామర్శించేందుకు సినీ ప్రముఖులు ఎవరూ వెళ్లలేదనే విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. సినీ ప్రముఖుల తీరును రాజకీయ నాయకులతో పాటు అభిమానులు చాలా మంది తప్పుపడుతోన్నారు.
జగపతిబాబు క్లారిటీ...
ఈ విమర్శలపై సినీ హీరో జగపతిబాబు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. మరో ఊరిలో జరుగుతోన్న ఓ సినిమా షూటింగ్ ముగించుకొని సిటీకి రాగానే మొదటగా సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన చిన్నారి శ్రీతేజ్‌ను చూడాలని అనిపించి హాస్పిటల్‌కు వెళ్లాను. శ్రీతేజ్ తండ్రిని, అతడి చెల్లెలిని పలకరించాను.
ఆ చిన్నారి ఆరోగ్యం కుదుటపడుతుందని, తొందరలోనే అతడు కోలుకుంటాడని ఆ ఫ్యామిలీ మెంబర్స్‌కు భరోసా ఇచ్చి వచ్చాను. ఈ ఘటనలో అందరి కంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది ఆ ఫ్యామిలీనే కాబట్టి వారికి సపోర్ట్ ఇవ్వాలనే హాస్పిటల్‌కు వెళ్లాను. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి నేను హాస్పిటల్ వెళ్లింది ఎవరికి తెలియదు అని జగపతిబాబు ఈ వీడియోలో చెప్పాడు.
పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా...
పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళా అభిమాని మృత్యువాతపడింది. ఆమె కొడుకు శ్రీతేజ తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌లో చికిత్సపొందుతోన్నాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై కేసును నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఒక రోజు రాత్రి జైలులో గడిపిన అల్లు అర్జున్ బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ ఘనటలో అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్‌తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.