Actress Kasthuri Case: పరారీలో ఉన్న నటి కస్తూరికి ముందస్తు బెయిల్ నిరాకరణ, నోరుజారినందుకు ఇక అరెస్ట్ తరువాయి!
Actress Kasthuri Arrest: నటి కస్తూరికి తన అరెస్ట్ తప్పదని తెలిసి ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది. కానీ.. బెయిల్ పిటీషన్ విచారణ సమయంలో ఎలాంటి వాదనలు జరిగాయంటే?
తెలుగు వారిపై నోరుజారిన నటి కస్తూరి అరెస్ట్ తప్పదా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత వారం చెన్నైలో జరిగిన ఓ సభలో తెలుగు వారిని కించపరిచేలా నటి కస్తూరి మాట్లాడింది. దాంతో మదురైలో నాయుడు మహాజన సంఘం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటి కస్తూరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అరెస్ట్ తప్పదని భావించిన నటి కస్తూరి పరారైంది. అయితే.. తాజాగా మద్రాస్ హైకోర్టులో ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. కానీ బెయిల్ పిటీషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ముందు విచారణకు రాగా.. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ భాస్కరన్ వాదనలు వినిపించారు.
కస్తూరి క్షమాపణల్ని ప్రస్తావించిన లాయర్
‘‘కస్తూరి ఒక సామాజికవర్గ సమావేశంలో తెలుగు మాట్లాడే మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. సామాజిక సామరస్యానికి విఘాతం కలిగించేలా, రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించేలా ఆమె ప్రసంగం ఉంది. ఈ ప్రసంగం పూర్తిగా ప్రేరేపితమైనది’’ అని భాస్కరన్ చెప్పుకొచ్చారు.
కస్తూరిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటిలో నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్లు.. అలానే తమిళనాడులో ఆమెపై ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదని భాస్కరన్ వాదనలు వినిపించారు.
పోలీస్ కస్టడీకి వద్దన్న కస్తూరి లాయర్
కస్తూరి తరఫున సీనియర్ న్యాయవాది ఏకే శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ చెన్నై సమావేశంలో కొందరి గురించి మాత్రమే ప్రస్తావించారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం సమాజానికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడలేదని.. అయినప్పటికీ ఆమె క్షమాపణలు చెప్పినట్లు ఏకే శ్రీరామ్ విన్నవించుకున్నారు. కాబట్టి.. కేసులో కస్తూరిని పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని.. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
అంతఃపురం గురించి ఎందుకొచ్చింది?
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ‘‘కస్తూరి కొంత మంది వ్యక్తుల గురించి మాట్లాడారని చెప్తున్నారు. కానీ.. ఆ కొద్దిమంది గురించి మాట్లాడేటప్పుడు అంతఃపురం ప్రస్తావన ఎందుకు వస్తుంది? తెలుగు మాట్లాడే మహిళలు ఎందుకు వస్తారు? పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పినా.. అందులోనూ ఆమె తన వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నట్లే ఉంది. అంతే తప్ప తాను చేసిన వ్యాఖ్యలు తప్పు అని.. క్షమాపణలు చెప్పినట్లు లేదు’’ అని వ్యాఖ్యానించారు. అలానే బెయిల్ పిటీషన్‌ని తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇక అరెస్ట్ తరువాయి
కేసులు నమోదైన తర్వాత నటి కస్తూరి తన మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారైంది. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు కస్తూరి కోసం గాలిస్తూ ఇంటికి వెళ్లగా.. ఆమె ఇంటికి తాళం వేసి ఎక్కడికి వెళ్లిపోయింది. దాంతో టీమ్స్‌గా ఏర్పడి నటి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటీషన్‌ను కూడా హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు కస్తూరిని అరెస్ట్ చేసే పనిని మరింత వేగవంతం చేశారు.
టాపిక్