Amaravati Capital: అమరావతిలో మిగులు భూముల అమ్మకంతోనే రాజధాని అప్పులు తీరుస్తామన్న మంత్రి నారాయణ-minister narayana says capitals debts will be paid by selling surplus lands in amaravati ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravati Capital: అమరావతిలో మిగులు భూముల అమ్మకంతోనే రాజధాని అప్పులు తీరుస్తామన్న మంత్రి నారాయణ

Amaravati Capital: అమరావతిలో మిగులు భూముల అమ్మకంతోనే రాజధాని అప్పులు తీరుస్తామన్న మంత్రి నారాయణ

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 23, 2024 02:15 PM IST

Amaravati Capital: అమరావతి నిర్మాణం కోసం చేసే అప్పులపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాజధాని నిర్మాణం కొలిక్కి వచ్చిన తర్వాత ప్రభుత్వం వద్ద మిగిలే భూముల్ని విక్రయించడం ద్వారా రుణాలను తీరుస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 26 జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ
ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ

Amaravati Capital: అమరావతి నిర్మాణ ప్రాజెక్టు విషయంలో అపోహలు అవసరం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం కోసం చేసే అప్పుల్ని రాజధాని భూముల విక్రయంతోనే తీరుస్తామని స్పష్టత ఇచ్చారు. ఇతర ప్రాంతాల అభివృద్ధికి అమరావతి అప్పులకు సంబంధం లేదన్నారు.

yearly horoscope entry point

ఏ రాష్ట్రానికైనా దేశానికైనా రాజధాని కావాలని, 26 జిల్లాలను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని మంత్రి నారాయణ చెప్పారు. ఒక దగ్గర రాజధాని పెట్టాల్సి ఉందని, అమరావతిని రాజధానిని నిర్మించాలని నిర్ణయించామని, రైతులు కూడా భాగస్వాముల్ని చేశామని, అమరావతి నిర్మాణం కోసం తీసుకుంటున్న రుణాలు, ప్రపంచ బ్యాంకు, ఏడిబి రుణాలను అమరావతిలో ఉండే భూముల్ని విక్రయించడం ద్వారా అప్పులు తీరుస్తామన్నారు. ప్రజల మీద భారం వేయడం లేదన్నారు. ప్రజల మీద భారం లేకుండా అమరావతి నిర్మాణం చేపట్టాలన్నదే తమ విధానమన్నారు.

2014-19లో పునర్విభజన చట్టంలో భాగంగా వచ్చిన సంస్థల్ని వేర్వేరు చోట్ల ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. గిరిజన వర్శిటీ విజయనగరంలో, ఐఐఎం విశాఖపట్నంకు, పెట్రోలియం యూనివర్శిటీ విశాఖపట్నంకు, ఫారిన్ ట్రేడ్‌ సంస్థ కాకినాడలో, ఎన్ఐటి తాడేపల్లిలో, ఐఐటి తిరుపతిలో సెంట్రల్ యూనివర్శిటీ అనంతపురంలో ఏర్పాటు చేశామన్నారు. టీసీఎస్‌ వంటి సంస్థల్ని విశాఖపట్నం తీసుకొచ్చామని, లూలూ గ్రూపును విశాఖ తీసుకొస్తే వారిని తరిమేశారని ఆరోపించారు. మాన్యూఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్‌ రాయలసీమలో పెడుతున్నామని చెప్పారు. పోర్టులను అభివృధ్ది చేయడానికి అన్నిచర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వం ఆర్నెల్లలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించడం తట్టుకోలేక విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారన్నారు.

అమరావతి రాజధానిని ఆర్నెల్లలో ఇంత చేస్తామని ఎవరు ఊహించ లేకపోయారన్నారు. అమరావతి సెల్ఫ్‌ సస్టైన్‌ ప్రాజెక్టు అవుతుందని, వేరే పెట్టుబడుల్ని అమరావతిలో పెట్టడం లేదని స్పష్టం చేశారు. ల్యాండ్‌ పూలింగ్‌ లో రైతుల భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. 15లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన తట్టుకునేలా కృష్ణా కరకట్టల్ని బలోపేతం చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు.

ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సీఆర్‌డిఏ అథారిటీ సమావేశంలో జోన్ 7 జోన్ 10 లే ఔట్లకు సంబంధించి అథారిటీ ఆమోదం తెలిపినట్టు వివరించారు. ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్..ఐకనిక్ బిల్డింగ్స్ హై కోర్ట్..అసెంబ్లీ బిల్డింగ్స్ కు సంబంధించి ఇప్పటివరకు 47 వేల కోట్లకి పైగా పనులకు ఆమోదం జరిగిందన్నారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. రాజధాని నిర్మాణంపై ఎవరికి అపోహలు అవసరం లేదన్నారు.

Whats_app_banner