Allu Arjun Issue : గాంధీ భవన్ లో అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం, పవన్ వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
Allu Arjun Issue : అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ నేతలతో మాట్లాడేందుకు ఆయన గాంధీ భవన్ కు వెళ్లగా...వేరే కారణాలతో వారిని కలవలేకపోయారు. ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు.
Allu Arjun Issue : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉందని సమాచారం. ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ కేసులో ఏ11గా ఉన్న అల్లు అర్జున్ ను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టులో బెయిల్ ఇవ్వడంతో ఆయన విడుదల అయ్యారు. ఈ వ్యవహారం సద్దుమణిందనుకున్న సమయంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యారు. దీంతో వ్యవహారం మరింత ముదిరింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో విషయం చాలా దూరం వెళ్లింది. ఇక పోలీసులు రంగంలోకి దిగి వీడియోలు విడుదల చేశారు. అల్లు అర్జున్ కు తొక్కిసలాట గురించి సమాచారం అందించామని చెప్పుకొచ్చారు. గత రెండు రోజులుగా ఈ వివాదం నడుస్తోంది. నిన్న ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి సైతం పాల్పడ్డారు.
గాంధీ భవన్ కు అల్లు అర్జున్ మామ
తాజాగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి నాంపల్లిలోని గాంధీ భవన్ కు వెళ్లారు. తన అల్లుడి విషయంపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు చేరుకునే సమయానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, దీపాదాస్ మున్షీ మీడియా సమావేశంలో ఉన్నారు. అనంతరం దీపాదాస్ తో చంద్రశేఖర్ భేటీ అయ్యారు. కానీ ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ నుంచి వెళ్లిపోయారు.
పవన్ కల్యాణ్ కోరుకోవడంలో తప్పులేదు- మహేష్ గౌడ్
ఈ విషయంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ స్పందించారు. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ సభ్యుడే అన్నారు. సినీ పరిశ్రమపై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు చేయడంలేదన్నారు. అల్లు అర్జున్ ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. హైదరాబాద్ లో చిత్రసీమ ఇంతలా అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం అన్నారు. చరిత్ర తెలియకుండా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయన్నారు.
"తెలుగు చిత్రసీమ ఆంధ్రా రావాలని పవన్ కల్యాణ్ కోరుకుంటే తప్పులేదు. కానీ ఆంధ్రాకు వెళ్లే పరిస్థితి లేదు. తెలుగు చిత్రసీమ హైదరాబాద్ లోనే ఉంటుంది. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం సరికాదు. సినీ పరిశ్రమకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. అల్లు అర్జున్ ఘటనపై నిర్వాహకుల తప్పిదం ఉంది. ఇరుకుగా ఉన్న సంధ్య థియేటర్ వద్దకు హీరో వస్తానంటే వద్దని పోలీసులు చెప్పారు. పర్మిషన్ ఇవ్వలేదు. పోలీసుల సూచనలు పట్టించుకోకుండా నిర్వాహకులు అల్లు అర్జున్ ను థియేటర్ కు తీసుకెళ్లారు. ఇందువల్ల ఓ నిండు ప్రాణం పోయింది. ఘటనకు బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ ను కాంగ్రెస్ కు అంటగట్టం సరికాదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిని లక్ష్యం చేసుకుని బద్నాం చేస్తున్నారు.
అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ సభ్యుడు. నాకు చిరకాల మిత్రుడు. ఆయన మమ్మల్ని కలిసేందుకు గాంధీ భవన్ కు వచ్చారు. మేము ప్రెస్ మీట్ లో ఉండడం వల్ల ఆయనను కలవలేకపోయాం. ఆయన బయటకు వెళ్లి నాకు ఫోన్ చేశారు. మళ్లీ కలుద్దామని చెప్పాను. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం. శాంతి భద్రతల విషయంలో కాంప్రమైజ్ అవ్వం" -టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
సంబంధిత కథనం