Pushpa 2 Row : ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయి : మంత్రి సీతక్క
Pushpa 2 Row : తెలంగాణ రాజకీయాల్లో పుష్ప 2 సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు టార్గెట్ పుష్ప కామెంట్స్ రోజురోజుకూ పెంచుతున్నారు. సీఎం నుంచి మంత్రుల వరకూ అందరూ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మంత్రి సీతక్క బన్నీ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పుష్ప 2 సినిమా వివాదంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదని.. అలాంటి సినిమాలకు ప్రోత్సాహాలు లేవని వ్యాఖ్యానించారు. కానీ ఒక స్మగ్లర్ పోలీస్ బట్టలు విప్పి నిలబెట్టి.. పోలీస్ స్టేషన్ కొన్న సినిమాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతం అని సీతక్క ప్రశ్నించారు.
అదేం సినిమా..
'స్మగ్లర్ హీరో అంటే అదేం సినిమా? స్మగ్లర్ హీరో.. స్మగ్లింగ్ కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతాడు? సందేశాత్మక సినిమాలు తీస్తే ప్రజలు స్వాగతిస్తారు. రెండు మర్దర్లు చేసిన నేరస్తుడు మహారాష్ట్రలో పుష్ప 2 సినిమా చూస్తూ దొరికాడు. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయి. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలి. కేంద్ర ప్రభుత్వం అలాంటి సినిమాలకు ప్రోత్సాహం అందించాలి' అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.
స్మగ్లర్ హీరోనా..
'చంకలో బిడ్డపెట్టుకుని ఒక పేద మహిళ హక్కులు కోసం పోరాడిన జైభీమ్ సినిమాకు అవార్డు రాలేదు. సినిమాలను గౌరవిస్తాం. కానీ.. హక్కులు కాపాడే లాయర్ జీరో.. స్మగ్లర్ హిరో ఎలా అవుతాడు' అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. అటు కాంగ్రెస్ నేతలు చాలామంది పుష్ప 2 సినిమా, సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై గుర్రుగా ఉన్నారు. దీంతో అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆత్మ విమర్శ చేసుకోవాలి..
హీరో అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. విషాద ఘటన జరిగిన రోజే ప్రెస్‌మీట్ పెట్టి ఆ కుటుంబానికి అండగా ఉంటే బాగుండేదన్నారు. కాంగ్రెస్ నేతలు ఇలా విమర్శలు చేస్తుంటే.. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మాత్రం బన్నీకి దన్నుగా నిలుస్తున్నారు.
బండి అండ..
సినీ పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. సంధ్య థియేటర్ ఘటనలో ఓ మహిళ మృతిచెందడం చాలా బాధాకరమన్నారు. బాలుడు శ్రీతేజ్ కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారన్నారు. అయితే ఎంఐఎంతో కలిసి సినిమా లెవల్‌లో సీఎం రేవంత్ స్టోరీ అల్లారని విమర్శించారు. సమస్య ముగిసిన తర్వాత కూడా సీఎం మళ్లీ దీని గురించి మాట్లాడడం సరికాదన్నారు. సినీ ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు.